ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ నిర్ణేతలు, వారి నిర్ణయమే అందరికీ శిరోధార్యం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సబ్బండ వర్గాల పోరాట ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. వచ్చిన రాష్ట్రం తెచ్చిన నాయకుడి చేతిలోనే ఉండటమే సబబు అని నమ్మిన ప్రజలు వరుసగా రెండు పర్యాయాలు అధికారం అందించారు. పదేండ్ల పాలన తర్వాత సహజంగా వచ్చే వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీల కారణంగా స్వల్ప తేడాతో అడ్డిమారి గుడ్డి దెబ్బలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు ఏర్పడాలంటే అది ప్రజా తీర్పుతోనే సాధ్యం అవుతుంది. ఎవరు అధికారంలో ఉండాలి, ఎవరు ప్రతిపక్షంలో ఉండాలన్నది ప్రజలే తమ ఓటు ద్వారా నిర్ణయిస్తారు. కానీ, నిండైన ప్రజాశీర్వాదంతో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ప్రజలది కాదని తమదే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అన్నట్టు పోకళ్లకు పోయి ఇది ప్రజాపాలన అంటూ బ్రాండింగ్ చేసుకోవడం, పదే పదే ప్రజా పాలన అంటూ ఊదరగొడుతున్నారు. కానీ, నిజానికి ప్రజాపాలన అంటూ అత్యంత పైశాచిక పాలనకు తెరలేపడం ఎన్నో అంశాల్లో ఏడాదిగా చూస్తూనే ఉన్నాం. అందువల్లనే ఏడాది గడవకముందు నుంచే ప్రజలు ఈ ప్రజాపాలనపై తిరుగుబాటు చేస్తున్నారు. ఏడాది తర్వాత గ్రామాల్లోకి వచ్చిన అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తూ పట్టపగలే ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. తమ భవిష్యత్తు ఏంటని నిలదీస్తున్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి అసెంబ్లీలో అడ్డదిడ్డంగా మాట్లాడి తప్పించుకోవచ్చు, ప్రతిపక్ష నాయకులు విసిరిన సవాళ్లను వక్రీకరిస్తూ తప్పించుకోవచ్చు, మీడియా నుంచి కూడా తప్పించుకోవచ్చు కానీ, అధికారం కట్టబెట్టి అందలమెక్కించిన ప్రజల నుంచి మాత్రం తప్పించుకోలేరని మరోసారి రుజువైంది. ఎందుకంటే ఐదేండ్ల వరకు గాలిలో దీపం లాంటి పదవి మళ్లీ రావాలంటే ఆ ప్రజల ముందే మళ్లీ నిలబడాల్సి వస్తుంది కాబట్టి ప్రజావాణిని వినక తప్పదు.
ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు వెళ్లి, మంత్రులు పక్క రాష్ట్రంలో ధర్నా కోసం ప్రత్యేక విమానంలో విహారయాత్రకు వెళ్లారు. అధికారులను మాత్రం ప్రజల దగ్గరికి పంపి ‘మేం వచ్చాం మీకేం కావాలో మమ్మల్ని అడుక్కోండి’ అన్నట్టు, అరకొర లబ్ధిదారుల పేర్లతో గ్రామసభలు పెట్టారు. స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులే కాంగ్రెస్ నాయకులు సూచించిన వారికే పథకాలు అందుతాయని ప్రకటిస్తున్నారు. ఈ రాజకీయ ప్రమేయం వల్ల అర్హులైన పేదలకు లబ్ధి జరగకుండా అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నది. ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కాలన్న కుట్రలో భాగంగా ఖాళీ గిన్నెలతో విందు ఏర్పాటు చేసి ఊరిస్తున్నారు.
అధికారుల నామమాత్రపు ప్రకటనలను, దాటవేసే ధోరణిని పసిగట్టిన ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అధికారులను నిలదీయడం అంటే అధికారంలో ఉన్నవాళ్లను, తాము అధికారం కట్టబెట్టిన ప్రభుత్వాన్ని వీధిలో గల్లాపట్టి అడిగినట్టే. ప్రభుత్వం మీద ప్రజలకు ఏ మాత్రం విశ్వాసం ఉన్నా సంయమనం పాటిస్తారు. కానీ, గుడ్డెద్దు పోయి చేనులో పడ్డట్టు చేసిన ప్రతీ పనిని నాలుగైదు సార్లు సమీక్షిస్తూ ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థంకాక నాన్చుతున్న ఈ ప్రభుత్వ తీరుతెన్నులను ప్రజలు అర్థం చేసుకున్నారు. ‘పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ’ అని గ్రహించారు. అందుకే అధికారులపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడుతున్నారు.
ప్రజలు ఎందరో నాయకులను ఎన్నుకున్నారు. ఎన్నో ప్రభుత్వాలను చూశారు. కాబట్టి, వాళ్లకు ఈ ప్రభుత్వ పనితీరు అంచనా వేయడం పెద్ద సమస్య కాదు. ప్రశ్నించడం అసలే కాదు. అందుకే, గ్రామసభల్లో ప్రజల కంటే పోలీసులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే ఎక్కువ ఉంటున్నారు. ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి గ్రామాల్లో ఘర్షణ వాతావరణాన్ని పెంచి పోషిస్తున్నారు. ప్రజలే అధికారులను, నాయకులను నిలదీస్తున్నారు. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ నాయకుల అరాచకాలను బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే వాళ్లపై కాంగ్రెస్ నాయకులు భౌతికదాడులకు తెగబడుతున్నారు. పదేండ్లలో పచ్చగా, పాడి పంటలతో, పండుగలా వర్ధిల్లిన పల్లెల్లో రేవంత్‌రెడ్డి మళ్లీ కక్షలు, పగలు, ప్రతీకార రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారు.
పాలన చేతకాక పట్టణాల్లో హైడ్రా మంటలు పెట్టి, పల్లెల్లో గ్రామ సభలలో మంటలు పెడుతు న్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకం టే, తెలంగాణ సమాజం చైతన్యానికి మారుపేరు. ఇక్కడి ప్రజల్లో త్యాగం, తెగించి కొట్లాడే తత్వం సహజంగా ఉంటది. కాబట్టి, రేవంత్ రెడ్డి మార్పు పేరుతో తెలంగాణలో పెట్టిన మంటలు చల్లార్చడానికి ప్రతీ ఒక్కరూ సన్నద్ధం అవ్వాలి. గతంలో ఈ రకంగా విర్రవీగిన ప్రభుత్వాలకు, నాయకులకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో తెలుసు. అదే విధంగా రానున్న రోజుల్లో ఓటు అనే వజ్రాయుధంతో పోటు పొడవం ఖాయం, ఖాయం.
– (వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు)
ఏనుగుల రాకేష్‌రెడ్డి