దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని దయనీయ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో నెలకొని ఉన్నది. రాష్ట్రంలోని పాలక, ప్రతిపక్ష పార్టీలు రెండూ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్‌ను గాలికివదిలేసి తమ సొంత రాజకీయ మనుగడ కోసం కేంద్రంలోని బీజేపీ పెద్దల ప్రాపకం కోసం సాగిలపడుతున్నాయి. బీజేపీ పెద్దల కరుణా కటాక్షాల కోసం పాలకపక్షం వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ రెండూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాయి. తెలుగు ప్రజలు ఇప్పుడిప్పుడే ఆ రెండు పార్టీల ద్వంద్వవైఖరిని గ్రహిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రజానీకంలో సరికొత్త ఆశలు రేకెత్తిస్తున్నది. బీఆర్ఎస్ అగ్రనేతల్లో ఒకరైన మంత్రి హరీశ్‌రావు ఏపీలో పాలన గురించి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు నానా యాగీ చేస్తున్నారు. వాస్తవానికి ఆయన వ్యాఖ్యలు ఏపీలో వాస్తవ పరిస్థితికి దర్పణం పడుతున్నాయి.
హరీష్ వ్యాఖ్యలు అక్షర సత్యం: ‘ఆంధ్రప్రదేశ్‌లో పాలన ఎలా ఉంది? తెలంగాణలో ఎలా ఉంది? బేరీజు వేసుకోండి. ఆంధ్రలో ఓటు హకు వదలుకొని, తెలంగాణలో ఓటర్లుగా నమోదు కండి’ అని కొంతమంది కార్మికులను ఉద్దేశించి తెలంగాణ మంత్రి టీ హరీష్‌రావు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ఆంధ్ర ప్రాంతవాసుల మనోభావాలకు అద్దం పట్టాయి. హరీష్‌రావు వ్యాఖ్యలపై రాజకీయపక్షాలు మినహా సామాన్య ప్రజానీకం మాత్రం ఆయన చెప్పినదాంట్లో తప్పేం లేదని సమర్ధిస్తున్నారు. వాస్తవాన్ని గ్రహించకుండా వైసీపీ నాయకులు, మంత్రులు హరీష్‌రావుపై ఘాటైన విమర్శలు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ అభివృద్ధిపై వైసీపీ నాయకుల వితండవాదనతో ఆంధ్రప్రాంత జన బాహుళ్యం ఏకీభవించలేకపోతున్నది. దీనిపై వైసీపీ నాయకుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.
అసలు తెలంగాణతో పోల్చుకోగలమా?: వాస్తవానికి అభివృద్ధి విషయంలో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్‌కు నకకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. రాష్ర్టాభివృద్ధి, తలసరి ఆదాయం పెంపు, జీవన ప్రమాణాలు స్థాయి అన్నింటిలో తెలంగాణ అగ్రగామిగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ అన్నింటా అధోగతి పాలయి ఉంది. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో కోటి ఆశలతో తెలంగాణ నుంచి స్వస్థలాలకు తిరిగి వచ్చినవారంతా ఇప్పుడు ఉపాధి కరువై కునారిల్లిపోతున్నారు. ఏపీలో నూతనంగా పారిశ్రామిక పెట్టుబడులు రాకపోవటం, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు తరలిపోతుండటం, జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నియామకాలు లేకపోవ టం, ఉపాధి అవకాశాలు మృగ్యం కావటం తదితర కారణాలతో నిరుద్యోగం ప్రబలిపోయింది. ప్రధానంగా లక్షల మంది ఉపాధి పొందుతున్న నిర్మాణరంగం కుదేలైపోయింది. దీంతో దాదాపు 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి, అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తున్నారు. వారంతా పొట్ట చేత పట్టుకొని వలసబాట పట్టారు. తెలంగాణలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో కార్మికులు తరలివెళ్లారు. వారి ఉపాధిని పరిగణనలోకి తీసుకొని, వారి సంక్షేమం దృష్ట్యా హరీష్‌రావు ఆ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రనేతల అంచనాలు తలకిందులయ్యాయి: తెలంగాణలో ప్రభుత్వ విధానాలు పరిశ్రమలు నెలకొల్పేందుకు అనువుగా ఉండటంతో అన్నిరంగాల్లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఐటీరంగం దేశంలోనే అగ్రగామి గా ఉన్నది. దీంతో కేవలం ఏపీ నుంచే కాకుం డా పలు రాష్ర్టాల నుంచి సాఫ్ట్వేర్ నిపుణులు హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకున్నది. హైదరాబాద్ పరిసర ప్రాం తాల్లోనూ, ఔటర్ రింగ్‌రోడ్ వెంబడే ఆకాశహర్మ్యాలు వెలిశాయి. లక్షల సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి పొందుతున్నారు. సంఘటిత, అసంఘటిత రంగంలోని కార్మికులను దృష్టిలో ఉంచుకొని మే 1న శ్రామిక దినోత్సవాన్ని పురసరించుకొని తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక సంక్షేమ పథకాన్ని ప్రకటించనున్నారు. అదే విషయాన్ని మంత్రి హరీష్‌రావు కార్మికుల సమావేశంలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ మంత్రులు హరీష్‌రావుపై ధ్వజం ఎత్తకుండా, స్వరాష్ట్రం నుంచి తెలంగాణకు కార్మికులు వలసపోకుండా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించటంపై దృష్టిసారిస్తే బాగుంటుం ది. ఆంధ్రలో ఉపాధి అవకాశాలు కల్పించకుం డా, కార్మిక సంక్షేమాన్ని గాలికి వదిలేసిన వైసీ పీ నాయకులు తెలంగాణ మంత్రిపై చేసిన విమర్శలు బెడిసికొట్టాయి.
రాజకీయ శూన్యతను బీఆర్ఎస్సే పూడ్చగలదన్న ఆశాభావం: ఆంధ్రలో పాలకవర్గ వైఫల్యంపై వైసీపీ నాయకులు భుజాలు తడుముకుంటూ హరీష్‌రావుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ హరీష్‌రావు అన్నదాంట్లో తప్పేం లేదని ఆంధ్రప్రదేశ్‌లో చర్చ జరుగుతున్నది. ఆంధ్రా ప్రజల మనోభావాలనే హరీష్‌రావు ప్రస్తావిస్తే ఇంతగా ఉలికిపాటు ఎందుకని సాధారణ పౌరులు సైతం ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల దివాళాకోరుతనం పట్ల ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత నెలకొని ఉన్నది. ఒకరకంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ శూన్యత ఏర్పడింది. దానిని భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పరిచిన తరహాలో కేసీఆర్ ఆంధ్రప్రాంతంపైనా దృష్టిసారించిన పక్షంలో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయ శక్తిగా రూపుదిద్దుకుంటుందనటంలో ఎలాంటి సందేహం లేదని ఈ ప్రాంత రాజకీయ విశ్లేషకుల అంచనా.
ప్రయోజనాలు తాకట్టు: ఏపీలోని అధికార వైసీపీ, విపక్ష టీడీపీలు రెండూ బీజేపీ ప్రాపకం కోసం పోటీ పడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టుపెట్టాయి. ప్రత్యేక హోదా, విశాఖ ఉకు, పోలవరం ప్రాజెక్టు, విభజన హమీల వంటి కీలక అంశాలు పకనబెట్టి ఎన్నికల్లో గెలుపు ఒక్కటే పరమావధిగా బీజేపీ ముందు మోకరిల్లుతున్న వైనం సామాన్య ప్రజానీకానికి వెగటు పుట్టిస్తున్నది. ఆయా అంశాలపై వైసీపీ, టీడీపీలు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నప్పటికీ కేంద్రాన్ని పల్లెత్తు మాట అనేందుకు సాహసించడం లేదు. రెండు పార్టీల్లో బలహీనతలను ఆసరాగా తీసుకొని ఏపీలో బీజేపీ రాజకీయ క్రీడకు తెరదేసింది. వాస్తవానికి ఏపీలో బీజేపీకి నామమాత్రంగానైనా ఓటు బ్యాంకు లేదు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో అధికారం చెలాయిస్తున్నప్పటికీ నోటా కంటే తకువగా ఓట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ ఉనికి ప్రశ్నార్థకమే. కమలనాథులు ఆడుతున్న వికృత రాజకీయ క్రీడ బెడిసికొట్టింది.
ఒక రాజకీయపార్టీ మరొక పార్టీతో పొత్తు కుదుర్చుకోవటంలో తప్పులేదు. కానీ బీజేపీ ఆ విధంగా చేయకుండా అన్ని పార్టీలతో లోపాయికారీ అవగాహనలు కుదుర్చుకొని వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి.
తనకు ఆదరణ లేని ప్రాంతాల్లో తన శత్రువులను సైతం తానే సృష్టించుకొని టీమ్‌లుగా చలామణి చేస్తున్నది. అందుకు ఏపీ ఒక ఉదాహరణ. ఏపీలో వైసీపీ, టీడీపీలతో బీజేపీ, బీ టీమ్ బంధాన్ని కొనసాగిస్తున్నది. దక్షిణాదిన బీజేపీని బాహాటంగా ఎదిరించిన కేసీఆర్ రాజకీయ యవనికపై హీరో అయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేకశక్తులకు కేసీఆర్ ఎడారిలో ఒయాసిస్‌లా కానవస్తున్నా రు. తెలంగాణ ఉద్యమ సమయంలో సెంటిమెంట్ రగిల్చేందుకు కేసీఆర్ పరుషంగా మాట్లాడినప్పటికీ, తదనంతర పరిణామాల్లో ఆంధ్రా ప్రాంతం వారిని కంటికిరెప్పలా చూసుకుంటున్న విషయాన్ని మరువరాదు. కేసీఆర్ వంటి పోరాటయోధుని అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో నవ్యాంధ్రకు ఎంతైనా ఉన్నది. రాజధాని సైతం లేని అనాథ శిశువులా ఉన్న ఏపీకి చేయూతనిచ్చి, చేయందించి నడిపించగల నాయకుడు ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ఒకరే అనటంలో సందేహం లేదు.
దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేకశక్తులకు కేసీఆర్ ఎడారిలో ఒయాసిస్‌లా కానవస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సెంటిమెంట్ రగిల్చేందుకు కేసీఆర్ పరుషంగా మాట్లాడినప్పటికీ, తదనంతర పరిణామాల్లో ఆంధ్రా ప్రాంతం వారిని కంటికిరెప్పలా చూసుకుంటున్న విషయాన్ని మరువరాదు. కేసీఆర్ వంటి పోరాటయోధుని అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో నవ్యాంధ్రకు ఎంతైనా ఉన్నది.
– శ్రీ ప్రసాద్
(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకుడు, అమరావతి)