గురుకులాల కారణంగా మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని ఒక అధ్యయనంలో వెల్లడైందని, దీనిపై మరింత లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల పేర్కొన్నారు. రాష్ట్రంలోని సర్కార్ పాఠశాలలను సెమీ గురుకులాలుగా మార్చే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టు కూడా తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను సెమీ గురుకులాలుగా మార్చాలనుకోవడం హర్షణీయమే. కానీ, ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కళాశాలల అస్తిత్వాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉన్నదన్న విషయాన్ని మరువకూడదు.
సాధారణంగా గురుకులాలలో ఐదో తరగతి పిల్లలను చేర్పిస్తారు. ఆ సమయంలో వారికి కనీసం పదేండ్ల వయస్సు ఉంటుంది. అప్పటివరకు పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలో, వారి సంరక్షణలోనే పెరుగుతారు. పదేండ్ల వరకు తల్లిదండ్రులే పిల్లల ఆలనాపాలనా చూసుకుంటారు. అదీ కాకుండా గురుకులాలలో చేర్చిన తర్వాత ఆదివారాలు, సెలవు రోజుల్లో తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి వస్తుంటారు. ఐదో తరగతి నుంచి ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకుంటారు. ఆ సమయంలో చదువుతో పాటు మంచిచెడుల గురించి కూడా ఉపాధ్యాయులు బోధిస్తారు. అందువల్ల గురుకులాలలో ఉంటే మానవ సంబంధాలు బలహీనపడతాయని చెప్పడం సరికాదు.
చదువుకునే వయసు రాగానే పూర్వం రాజులు కూడా తమ పిల్లలను గురుకులాలకు పంపించేవారు. యుక్త వయసు వచ్చేవరకు అక్కడే ఉంటూ వారు సకల శాస్ర్తాలు నేర్చుకునేవారు. యుద్ధ తంత్రాలను ఒంట బట్టించుకునేవారు. అన్నిరంగాల్లో ప్రావీణ్యం సాధించి యువరాజులుగా పట్టాభిషిక్తులై రాజ్యాలను పరిపాలించేవారు. విద్యార్థికి చదువు రావాలంటే ఏకాగ్రత ముఖ్యం. ఇంట్లోని సమస్యలు చదువుకు ఆటం కం కారాదు. గ్రామాల్లోని అనేక ఇండ్లల్లో చదివే వాతావరణం కనిపించదు. మరీ ముఖ్యంగా మద్యం కారణంగా కొంతమంది భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుంటాయి. సింగిల్ పేరెంట్స్ చదివించే స్థితిలో లేకపోవడం, పాఠశాలల నుంచి తిరిగొచ్చాక పిల్లలతో ఇంటి పనులు చేయించడం, కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట లెక్కచేయకుండా టీవీలు, ఫోన్లకు అతుక్కుపోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి వాతావరణంలో పిల్లలు చదువుకోవడానికి కుదరదు.
గురుకులాల వాతావరణం అందుకు పూర్తి భిన్నం గా ఉంటుంది. ఉదయం, సాయంత్రం, రాత్రి సమయాల్లో ప్రత్యేకంగా స్టడీ అవర్స్ నిర్వహిస్తారు. టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పిల్లలను చదివిస్తారు. అందుకే గురుకులాలలో చదివిన ఎంతో మంది నేడు ఐఏఎస్, ఐపీఎస్లుగా, డాక్టర్లు, ఇంజినీర్లుగా ఉన్నత స్థానాలకు చేరుకొని సమాజ సేవ చేస్తున్నారు. సర్కార్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి గురుకులాలే కారణమని కొంతమంది అసంబద్ధంగా వాదిస్తుంటారు. ఆ వాదన సరికాదు. అందుకు ప్రైవేట్ పాఠశాలలే కార ణం. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఉన్నట్టుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేకపోవడం, టీచర్ల సంఖ్య తక్కువగా ఉండటం, సరైన పర్యవేక్షణ లేకపోవడమే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వైపు చూడకపోవడానికి ప్రధాన కారణం.
రాష్ట్రంలో 1200కు పైగా గురుకులాలున్నాయి. వాటిలో సుమారు 4 లక్షల మందికి పైగా విద్యార్థులు చదవుకుంటున్నారు. 10వ తరగతి, ఇంటర్లలో గురుకుల విద్యార్థులే రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధిస్తున్నారంటేనే వాటి ప్రమాణాలను అర్థం చేసుకోవచ్చు. గురుకులాలలో సీట్లకున్న డిమాండే అందుకు నిదర్శనం. జాతీయస్థాయి పోటీ పరీక్షలు జేఈఈ, నీట్లలోనూ గురుకులాల విద్యార్థులే అగ్రస్థానంలో నిలుస్తున్నారు. కేవలం విద్యలోనే కాకుండా క్రీడలు, పర్వతారోహణ వంటి అతి క్లిష్టమైన వాటిల్లోనూ ప్రతిభ కనబరుస్తు న్నారు. గురుకులాల విజయాలను స్ఫూర్తిగా తీసుకొనే దేశంలో నవోదయ విద్యాలయాలను నెలకొల్పారన్నది జగమెరిగిన సత్యం.
ఇప్పటికీ కొన్ని గురుకులాలను సమస్యలు వెంటాడుతున్నాయి. వాటిలో బోధనా సిబ్బంది తక్కువగా ఉన్నారు. ప్రధానోపాధ్యాయులు, పర్యవేక్షణాధికారుల కొరత ఉన్నది. గురుకులాలను తీసివేయాలనే ఆలోచనను ప్రభుత్వం మచ్చుకైనా రానీయకూడదు. పోగా వాటిలో మౌలిక వసతులను కల్పించాలి. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి. అంతేకాదు, గురుకులాలను పూర్తిస్థాయి కళాశాలలుగా మార్చాలి. గురుకులాలను మరింత బలోపేతం చేసి వాటి అస్తిత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి.
-సీవీవీ ప్రసాద్
80196 08475