2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ, అనంతరం ఆ మీడియా సంస్థపై ఐటీ దాడులు, అదానీ గ్రూప్ కంపెనీల్లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక.. వెరసి దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ అంశాలపై నోరు విప్పాలని కేంద్రంలోని బీజేపీ సర్కారును బీఆర్ఎస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ అల్లర్లు, మోదీ హయాంలో అదానీ సామ్రాజ్యం విస్తరించిన తీరు, బీబీసీపై దాడుల వంటి పలు కీలక అంశాలపై ప్రసిద్ధ రచయిత్రి, బుకర్ ప్రైజ్ గ్రహీత అరుంధతీ రాయ్ ప్రఖ్యాత పత్రిక ‘ది గార్డియన్’లో ప్రత్యేక వ్యాసాన్ని రాశారు.
ప్రధాని మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ‘ట్విన్ టవర్స్’ లాంటి వారు. ప్రస్తుత ఘటనలు వారికి పెద్ద దెబ్బే. మోదీ, అదానీ ఎదుగుదలకు ఒకరినొకరు సాయం చేసుకున్నారు. ప్రస్తుత పరిణామాలతో వారి బంధంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దేశంలో నెలకొన్న హింసాత్మక హిందూ జాతీయవాదాన్ని బడా కార్పొరేట్లు లిఖించారని, ఎట్టకేలకు మోదీ మాడల్ అంటే ఏమిటో అందరికీ తెలుసొచ్చింది.
గుజరాత్ మారణకాండకు మోదీనే బాధ్యుడంటూ బీబీసీ చిత్రీకరించిన డాక్యుమెంటరీ, అదానీ గ్రూప్ కంపెనీల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ హిండె న్బర్గ్ ఇచ్చిన నివేదిక.. భారత్‌పై జరిగిన దాడిగా ఓ వర్గం భారత మీడియా ప్రసారం చేస్తున్నది. అయితే, అది నిజం కాదు. తాజా ఘటనలతో ఈ ట్విన్ టవర్స్‌కు బీటలు వారాయనే చెప్పాలి.
2003లో ‘వైబ్రెంట్ గుజరాత్’ పేరిట ఓ పెట్టుబడుల సదస్సు జరిగింది. ‘గుజరాత్ నమూనా అభివృద్ధి’ అంటూ మోదీ ఇప్పుడు చేసుకుంటున్న ప్రచారానికి అదే మూలం. అయితే, కార్పొరేట్ల డబ్బుతో హింసాత్మక హిందూ జాతీయవాదమనేది రాయడం అప్పుడే మొదలైంది. ఏదైతేనేం, మోదీ మాడల్ ఏమిటో చివరికి తెలిసొచ్చింది.
మోదీ, అదానీ మధ్య బంధం ఇప్పటిది కాదు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నది. 2002లో గుజరాత్లో ముస్లింల ఊచకోత జరగడానికి కొన్ని నెలల ముందే నరేంద్ర మోదీ ఆ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపుగా ఇదే సమయం లో మోదీ-అదానీ మధ్య మైత్రీబంధం మరింత పెనవేసుకొన్నది. 2003లో ‘వైబ్రెంట్ గుజరాత్’ పేరిట ఓ పెట్టుబడుల సదస్సు జరిగింది. ‘గుజరాత్ నమూనా అభివృద్ధి’ అంటూ మోదీ ఇప్పుడు చేసుకుంటున్న ప్రచారానికి అదే మూలం. అయితే, కార్పొరేట్ల డబ్బు తో హింసాత్మక హిందూ జాతీయవాదమనేది రాయ డం అప్పుడే మొదలైంది. ఏదైతేనేం, మోదీ మాడల్ ఏమిటో చివరకు తెలిసొచ్చింది.
2014లో మోదీ ప్రధాని అయ్యారు. అదానీ కంపెనీల ఎయిర్‌క్రాఫ్ట్‌లో తిరిగారు. మోదీ తొమ్మిదేండ్ల పాలనలో 800 కోట్ల డాలర్లుగా ఉన్న అదానీ సంపద ఏకంగా 13,700 కోట్ల డాలర్లకు ఎగబాకింది. 2022 ఏడాదిలోనే 7,200 కోట్ల డాలర్ల సంపదను అదానీ అర్జించారు. ప్రపంచంలోని తొమ్మిది మంది కుబేరుల ఆ ఏడాది సంపాదన కంటే ఇది ఎక్కువ. దేశంలోని 30 శాతం పోర్టులు, 23 శాతం ఎయిర్‌పోర్టులు, 30 శాతం గిడ్డంగులు, ప్రైవేట్‌రంగంలో అతిపెద్ద పవర్‌ప్లాంట్ అదానీ గ్రూప్ సొంతం. గుజరాత్ అభివృద్ధి నమూనా ఇలా సాకారమైంది. తొలుత అదానీ విమానాల్లో నరేంద్ర మోదీ ప్రయాణించారు. ప్రస్తుతం, మోదీ విమానాల్లో అదానీ ప్రయాణిస్తున్నారు. (దేశంలోని ప్రధాన విమానాశ్రయాలన్నీ అదానీ గ్రూప్‌నకే కట్టబెట్టడాన్ని ఉద్దేశిస్తూ..) అయితే, ఇప్పుడు ఆ రెండు విమానాల ఇంజిన్‌లో ట్రబుల్ ఏర్పడింది. జాతీయవాదం పేరిట భారత జెండాను ఒంటికి చుట్టుకొన్నంత మాత్రాన వాళ్లిద్దరూ ఆ సమస్య నుంచి బయటపడగలరా? అనేది అనుమానమే. గుజరాత్ అల్లర్లకు సంబంధించి బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీలో ఎన్నో విషయాలున్నాయి. బాధితులు తమ గోడు చెప్పుకొన్నారు. ఆ డాక్యుమెంటరీలో నేనూ భాగమయ్యా. అయితే, ఈ వీడియోను భారతీయులు వీక్షించకుండా ఆయా లింక్స్‌ను యూ ట్యూబ్, ట్విట్టర్ మాధ్యమాల నుంచి ప్రభుత్వం తొలగించింది. వర్సిటీల్లో స్క్రీనింగ్ ఏర్పాటుచేసిన వారిపై, వీక్షిస్తున్న విద్యార్థులపై దాడులు జరిగాయి. ఇది సరికాదు.
ఇక, అదానీ గ్రూప్ కంపెనీల్లో అవకతవకలు జరిగాయని హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికతో అదానీ వ్యాపార సామ్రాజ్య పునాదులు కదిలిపోయాయి. అయితే, హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌ను భారత్‌పై జరిగిన దాడిగా అదానీ గ్రూప్ అభివర్ణించింది. అయితే, ఈ వాదన మదుపర్లకు సంతృప్తినివ్వలేదు. అందుకే, కొద్ది రోజుల్లోనే 11 వేల కోట్ల డాలర్ల అదానీ సంపద ఆవిరైంది. పలు సూచీలు అదానీ గ్రూప్‌నకు రేటింగ్ తగ్గించాయి.
అదానీ ఉదంతంపై దర్యాప్తు చేపట్టాలని పార్లమెంట్లో విపక్షాలు పట్టుబట్టాయి. అయితే, కేంద్రం పట్టించుకోలేదు. అదానీ వివాదాన్ని పట్టించుకోని కేంద్ర దర్యాప్తు సంస్థలు.. బీబీసీ ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లో మాత్రం సోదాలు నిర్వహించాయి. తమ ఉనికి బయటపెట్టకుండా కార్పొరేట్లు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేలా 2016లో బీజేపీ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని తీసుకొచ్చింది. ప్రపంచ కుబేరుడైన అదానీ, ప్రపంచంలోనే అత్యంత ధనిక పార్టీగా పిలుస్తున్న బీజేపీకి ఏమైనా విరాళాలు ఇచ్చారా? అదానీ, బీజేపీ ఖాతా పుస్తకాలు ఒకటేనా? వేర్వేరా?
పార్లమెంట్లో 90 నిమిషాలు ప్రసంగించిన మోదీ.. విపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా అదానీ ప్రస్తావన తీసుకురాలేదు. ఉద్యోగం లేక, పేదరికంతో గ్రామాల్లో బతుకుతూ, తామిచ్చే రేషన్‌తో బతికే కోట్లాది మంది ప్రజలకు 10 వేల కోట్ల డాలర్ల గురించి (అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం) అవగాహన లేదని (వ్యంగ్యంగా) మోదీ అనుకున్నారు కావొచ్చు. అందుకే, అదానీ గురించి ప్రస్తావించలేదు.
అరుంధతీ రాయ్