ఒక దశాబ్ద కాలం పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగి, ఎంతో ఖ్యాతిని అర్జించిన సంక్షేమ గురుకులాల వెనుక గత కేసీఆర్ ప్రభుత్వం, ఆనాటి అధికారుల కృషి ఎంతో ఉన్నది. అకడమిక్స్, ఆటలు, ఇంకా ఇతర విషయాల్లో గురుకులాల విద్యార్థులు కొత్త చరిత్ర లిఖించారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి దేశానికి కీర్తిప్రతిష్టలు సంపాదించి పెట్టారు. 2022 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించి ఆసియా ఛాంపియన్షిప్ కోసం 2025లో దక్షిణ కొరియాలో జరిగిన క్రీడల్లో బంగారు పతకం పొంది దేశ కీర్తి పతాకను ఎగురవేశారు. గురుకుల విద్యార్థులు విదేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లోనూ చదువుతున్నారు. ఇక ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించి తమ ప్రతిభాపాటవాలను నిరూపించుకున్నారు. ఎంసెట్ ప్రవేశ పరీక్షల ద్వారా వందలాదిమంది వృత్తివిద్యా కోర్సుల్లో చేరి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు. ఎవరెస్టు శిఖరం ఎక్కి పర్వతారోహణలోనూ రికార్డులు నెలకొల్పారు. తరచూ ఏదో ఒకటి సాధించి గురుకులాలు వార్తల్లో పతాక శీర్షికన నిలిచేవి. కానీ, ఇదంతా గతం.
రాష్ట్రంలో ఆరు లక్షల మందికి పైగా నాణ్యమైన ఉచిత విద్యనందించిన 1022 గురుకులాలు గత రెండేండ్లుగా నిరాదరణకు గురయ్యాయి. దురదృష్టవశాత్తు విద్యార్థుల ఆత్మహత్యలు, కలుషితాహారం, రోడ్లపై ధర్నా లాంటి విషయాలతో గత కొంతకాలంగా వార్తలకెక్కడం శోచనీయం. గురుకుల పాఠశాలలు, కళాశాలల నిర్వహణలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది. ఇందుకు ప్రభుత్వం, నిర్వహణ సొసైటీల అధికారులే కారణం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేజిక్కించుకొని రెండేండ్లు కావస్తున్నది. కానీ, ఇప్పటివరకు ఒక్క గురుకుల పాఠశాల కూడా మంజూరు కాలేదు సరి కదా ఉన్నవాటిని గాలికొదిలేసింది. విద్యార్థుల ఆత్మహత్యలతో గురుకులాల ప్రతిష్ట మరింత దెబ్బతిన్నది. ఈ విద్యా సంవత్సరంలో గురుకులాల్లో అడ్మిషన్లు తగ్గినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మరోవైపు గురుకులాలకు సొంత భవనాలు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడంతో వాటి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అద్దె భవనాల బకాయిలూ ఇవ్వకపోవడంతో యజమానులు తాళాలు వేస్తున్నారు. ఇవన్నీ గురుకులాల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్య వైఖరిని స్పష్టం చేస్తున్నాయి.
తల్లికి తద్దినం పెట్టకుండా కనబోయే కొడుకుకు కడియాలు చేయించాడట వెనుకటికో ప్రబుద్ధుడు. ప్రభుత్వం కూడా నేడు విజయవంతంగా నడుస్తున్న గురుకులాలను గాలికొదిలేసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో కొత్తగా విద్యాసంస్థలను నెలకొల్పుతున్నది. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక కాంప్లెక్స్‌లాగా 25 ఎకరాల్లో నిర్మించి, అందులో నాలుగు లేదా ఐదు యాజమాన్యాల గురుకులాలను నడిపించే ప్రయత్నంలో ఉంది. అందుకోసం ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్క గురుకుల కాంప్లెక్స్‌కు రూ.200 కోట్లు కేటాయిస్తూ అట్టహాసంగా శంకుస్థాపనలు చేస్తున్నది. అన్ని రకాల గురుకులాలు ఒకేచోట నిర్వహించి కులరహిత సమాజాన్ని నిర్మించబోతున్నట్టు గొప్పలు చెప్తున్నది. కానీ, భోజనం, ఆటల సమయాల్లోనే విద్యార్థులందరూ కలుసుకుంటే కులరహిత సమాజం సాధ్యపడుతుందా?
80 శాతం నిర్మాణం పూర్తయిన గురుకుల భవనాల పెండింగ్ బిల్లులు విడుదల చేయలేని ప్రభుత్వం, నిధుల మంజూరుకు కమీషన్లు డిమాండ్ చేసే ఆర్థిక శాఖ ఏ విధంగా రూ.20 వేల కోట్లతో వీటిని పూర్తి చేస్తుంది? కమీషన్ల కోసమే ఇదంతా చేస్తున్నట్టు తోస్తున్నది. సర్కారీ విద్యపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతున్న నేపథ్యంలో వీటి మనుగడ అనుమానాస్పదమే.
అసలు వీటికోసం రూ.20,000 కోట్లు వెచ్చించాల్సిన అవసరం ఉన్నదా? అనేది సగటు తెలంగాణ పౌరుడికి కలుగుతున్న ధర్మ సందేహం. ఈ నిధులను రుణాల ద్వారా సేకరించడానికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నదని తెలుస్తున్నది. ప్రతి గురుకులం కోసం సేకరించే 25 ఎకరాల భూమిని కార్పొరేషన్ ఆస్తిగా చూపి దానిని తాకట్టుపెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక పక్కన విద్యాశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని ఉన్న 17,639 పాఠశాలల్లో (గురుకులాలు మినహా) 100 కంటే తక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో 15,770 ప్రాథమిక పాఠశాలలే. 157 బడుల్లో 30 కంటే తక్కువ మంది బాలబాలికలు ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచే ప్రయత్నం కాంగ్రెస్ సర్కారు చేయడం లేదు. పక్కా భవనాలు, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, ఉపాధ్యాయుల కొరత వేధిస్తూనే ఉన్నది. అనేక జిల్లాల్లో డీఈవోలు, ఎంఈవోలు లేరు. అసలు రోగాన్ని వదిలేసి డిజిటల్ విద్య, కంప్యూటర్ స్కిల్స్ అంటూ పై పై పూత పూస్తే ఒరిగే ప్రయోజనం శూన్యం. ఇది సమస్యను పక్కదారి పట్టించడమే.
అసలు ఈ ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు విద్యార్థులు ఎక్కడ నుంచి వస్తారు? ఇప్పుడు నడుస్తున్న గురుకుల విద్యార్థులను ఈ వీటిలోకి తరలిస్తే ఇంత కాలంగా ఉన్న గురుకులాల భవనాలు, సిబ్బంది కోసం కట్టించిన క్వార్టర్లు ఏం కావాలి? విజయవంతంగా నడుస్తున్న రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల మాటేమిటి? ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలు. లక్షల మంది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ప్రభుత్వ గురుకులాల స్ఫూర్తిని నీరుగారుస్తూ వాటిని కాలగర్భంలో కలిపే కుట్రకు రేవంత్ ప్రభుత్వం తెరలేపింది. వేల కోట్ల రూపాయల అదనపు ఖర్చు భరించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ప్రతిరోజు ప్రతి కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపించే ప్రభుత్వం ఈ యంగ్ ఇండియా గురుకులాలను స్థాపించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? కాంగ్రెస్ పార్టీకి కప్పం కట్టడం, రాజకీయ నాయకులకు కమీషన్లు, కాంట్రాక్టర్ల శ్రేయస్సు మాత్రమే వీటి వెనుక ఉన్న మతలబు. ఈ నేపథ్యంలో మేధావులు, విద్యావంతులు, ప్రభుత్వ విద్య పట్ల అభిమానం గల ప్రజాప్రతినిధులు కంకణం కట్టుకొని ప్రభుత్వ విద్యను కాపాడవలసిన అవసరం ఉంది. లేదంటే గురుకులాలు గత కాలపు వైభవంగానే చెప్పుకోవలసిన రోజులు వస్తాయి.
-శ్రీశ్రీ కుమార్