Chandrababu | ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉంటూ, కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఏకంగా ప్రత్యేక హోదా డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. ప్రత్యేక సమావేశం పెట్టి మరీ తమ డిమాండ్ సెగ ఢిల్లీకి తగిలేలా జేడీయూ పార్టీ తరఫున తీర్మానం చేసి ప్రధాని మోదీకి పంపించారు. అదే ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉన్న చంద్రబాబు మాత్రం ఏపీ విషయంలో ఎలాంటి డిమాండ్లు ముందుకు తేవడం లేదు. జేడీయూ తరహాలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మోదీపై ఒత్తిడి తీసుకురావడం లేదు. అందుకు బదులుగా కేవలం తెలంగాణలోని అభివృద్ధిని అడ్డుకునేలా కుట్రలు చేస్తున్నారు.
తెలంగాణపై ఆధిపత్యం సాధిస్తే ఇక్కడి నుంచి వ్యాపారాలను ఏపీకి తరలించుకుపోవచ్చని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని గుప్పిట్లో పెట్టుకుని ఆట ఆడిస్తూ పెట్టుబడులు ఏపీకి మళ్లీంచవచ్చనేది చంద్రబాబు ఆలోచన. హైదరాబాద్ సహా తెలంగాణలో భారీ నిర్మాణాలకు అనుమతి ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డిపై పరోక్షంగా ఒత్తిడి తీసుకువస్తే ఆటోమేటిక్‌గా వారు ఏపీ వైపు చూస్తారు. అంతేకాదు, తెలంగాణలో కంటే తమ రాష్ట్రంలో ఎక్కువ రాయితీ ఇస్తామని వరాలజల్లు కురిపిస్తే.. ఇక్కడి నుంచి కంపెనీలు ఏపీకి క్యూ కడతాయనేది చంద్రబాబు వ్యూహం. ఈ క్రమంలో విభజన చట్టంలో ఉన్న అపరిష్కృత సమస్యలపై చర్చించేందుకు కలుద్దామంటూ తెలంగాణలో చంద్రబాబు నక్కజిత్తులు వేస్తున్నారు.
కేంద్రంలో తనకున్న పలుకుబడితో చంద్రబాబు చేస్తున్న శకుని రాజకీయాల వల్ల తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశాలు దండిగా ఉన్నాయి. చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సహకరించే అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయి. అయితే గియితే కేంద్ర నిధుల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన నిధులను ఏపీకి తరలించే కుట్రలు కనిపిస్తున్నాయి.
అంతేకాదు, రెండు తెలుగు రాష్ర్టాల మధ్య వివాదాల పరిష్కారంలో కేంద్రం నిర్ణయాలు కూడా ఏకపక్షంగా ఉండవచ్చు. విద్యుత్తు ఆస్తుల పంపకం, కృష్టా, గోదావరి నదుల నీటి వాటాల విషయంలో తెలంగాణకు వ్యతిరేకంగా, ఏపీకి అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలా చంద్రబాబు చేయవచ్చు. ‘ప్రభుత్వాన్ని పడగొడుతా’ అని బ్లాక్మెయిల్ చేసి కేంద్ర క్యాబినెట్లో తీర్మానాలు కూడా చేయించవచ్చు. ట్రిబ్యునల్స్ ఉన్నా, న్యాయస్థానాలు ఉన్నా వాటిల్లో అసలు సంగతి తేలేలోపు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగవచ్చు.
కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు ఇచ్చే నిధులు మొదలుకుని బడ్జెట్లో కేటాయింపుల వరకూ.. రాష్ర్టాల అంతర్గత సమస్యల నుంచి రాష్ర్టాల మధ్య సరిహద్దు వివాదాలూ, ప్రాజెక్టుల నీటి పంపకాల వరకు అనేక అంశాల్లో బాబు పాత్ర కచ్చితంగా ఉంటుంది. ఆయన లోపల్లోపల పలుకుబడి ఉపయోగించి తన రాష్ర్టానికి మేలు కలిగేలా చేసుకోవచ్చు. మరోవైపు తెలంగాణకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందాలన్నా, ఎక్కువ మొత్తంలో నిధులు రావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబుపై ఆధారపడాల్సి వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా కేంద్రంతో తీవ్రంగా కొట్లాడకపోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నది ఆయన గురువే కాబట్టి.
అంతేకాదు, కేంద్రంపై తీవ్రమైన విమర్శలు కూడా చేసే అవకాశాలు లేవు. ఒకవేళ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా కొట్లాడే ప్రయత్నం చేస్తే.. బీజేపీ వెంటనే చంద్రబాబును రంగంలోకి దించి రేవంత్ రెడ్డి దూకుడుకు చెక్ పెట్టవచ్చు. తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు మోదీ గుజరాత్‌కు తరలించారని రేవంత్ రెడ్డి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. రేపు హైదరాబాద్‌కు వచ్చే కంపెనీలను కేంద్రంలో పలుకుబడిని ఉపయోగించి చంద్రబాబు తన రాష్ర్టానికి తరలించుకు పోతే రేవంత్ రెడ్డి అదే తరహాలో తన గురువును విమర్శించకపోవచ్చు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్.. టీడీపీతో కలిసి రహస్యంగా పనిచేసినా ఆశ్చర్యం లేదు. కేంద్రానికి చంద్రబాబు అనేక సంస్కరణలను ప్రతిపాదించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేస్తేనే నిధులు ఇస్తామని షరతు కూడా పెట్టవచ్చు. అలా అయితే ఇప్పుడు తక్షణం తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారుకు పొంచి ఉన్న ప్రమాదం ఏమిటంటే.. బీజేపీ తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణలు అమలు చేయడంతో పాటు వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడమే. అలా మీటర్లు పెడితేనే కేంద్రం నుంచి నిధులు విడుదల చేస్తామని చెప్పవచ్చు. ఏదేమైనా తెలంగాణ ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం.
ఇంకోవైపు హైదరాబాద్‌పై కూడా ఎన్డీయే కూటమి కుట్రలు చేసినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. జూన్ 2 నుంచి తెలంగాణ పూర్తిస్థాయి రాజధానిగా హైదరాబాద్ మారిపోయింది. హైదరాబాద్‌ను మరింత కాలం ఉమ్మడి రాజధానిగా చేయాలన్న డిమాండ్ ఏపీలో కొంతమంది రాజకీయ నాయకుల నుంచి వస్తున్నది. అంతేకాదు, ఒకడుగు ముందుకేసి హైదరాబాద్‌ను యూటీ చేయాలి లేదా దేశ రెండో రాజధానిగా చేయాలన్న డిమాండ్ కూడా వస్తున్నది. హైదరాబాద్‌ను యూటీ చేసినా తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కాంగ్రెస్ సీనియర్ నేతలు గతంలోనే చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు చొరవతో యూటీ లేదా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను చేసే దిశగా కుట్రలకు తెరతీసే అవకాశాలు చాలానే ఉన్నాయి.
మరోవైపు తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యింది. తెలంగాణకు కేంద్రం నుంచి అంతంతమాత్రం సహకారమే ఉంటున్నది. చట్టబద్ధంగా రావాల్సిన నిధులపై కూడా నీలినీడలే కమ్ముకున్నాయి. టీడీపీలాగా పార్లమెంట్లో తెలంగాణ గళాన్ని గట్టిగా వినిపించే పరిస్థితి లేదు. దీంతో వచ్చే ఐదేండ్లు తెలంగాణ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారనుంది. అయితే విభజన చట్టంలో ఉన్న తెలంగాణ హక్కులపై ఇదివరకటి సీఎం కేసీఆర్‌లాగా.. చంద్రబాబుతో రేవంత్ రెడ్డి ఢీ అంటే ఢీ అన్నట్లు కొట్లాడేందుకు ఆస్కారం లేదు.
చంద్రబాబును రాజకీయంగా ఢీ కొట్టే సత్తా రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డికి నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే చంద్రబాబు కుట్రపూరితంగా ఏపీలో కలుపుకొన్న ఏడు మండలాలను తిరిగి ఇచ్చేలా ఒప్పించాలి. విభజన చట్టంలో తెలంగాణకు కేటాయించిన లోయర్ సీలేరు విద్యుత్తును మనకు ఇవ్వకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే కుట్రపూరితంగా అడ్డుకున్నారు. ఇప్పుడు చంద్రబాబుతో భేటీలో సీలేరు విద్యుత్ తెలంగాణకు వచ్చేలా రేవంత్‌రెడ్డి ఒత్తిడి తీసుకురావాలి.
ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో ఓటు నోటు కేసు ప్రత్యేకంగా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డికి, ఏపీలో కేంద్రంలో చంద్రబాబుకు ఓటు నోటు కేసు ఒక రాజకీయ గుదిబండగా మారింది. ఈ కేసు విచారణ న్యాయస్థానంలో ఉండటంతో దాని నుంచి ఏలా తప్పించుకోవాలన్న దానిపై రేవంత్ రెడ్డి, చంద్రబాబు మధ్య రహస్య చర్చ జరగవచ్చు. కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు, విచారణ సంస్థలకు బలమైన సాక్ష్యాలు అందిస్తే ఇద్దరికీ శిక్ష పడే ప్రమాదం ఉంది. అందుకే సాక్షులను, విచారణను ప్రభావితం చేసేందుకు ఉమ్మడిగా వ్యూహాలు రచించవచ్చు.
తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు చెప్పారు. కొండగట్టు పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏపీలో మాదిరిగానే తెలంగాణలో జనసేన- బీజేపీ కలిపి పోటీ చేస్తాయని చెప్పారు. అయితే అటు చంద్రబాబు వ్యాఖ్యల్లో.. ఇటు పవన్ కామెంట్స్‌లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి పోటీ చేస్తాయనే విషయం స్పష్టం అవుతున్నది. చంద్రబాబు చెపుతున్నట్టు ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ బయటకు విభజన హామీల పరిష్కారం కోసమేనని చెప్పినప్పటికీ తెరవెనుక చంద్రబాబు, మోదీ రహస్య రాజకీయ ఎజెండా ఉందన్నది సుస్పష్టం.
ఏదేమైనా తెలంగాణ ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణలో చంద్రబాబు చేస్తున్న కుట్ర రాజకీయాలను ఎప్పటికప్పుడు తిప్పికోట్టాలి. అంతేకాదు, చంద్రబాబుతో కలిసి రేవంత్ రెడ్డి చేసే కుమ్మక్కు రాజకీయాలను ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉండాలి. రాజకీయ ఈగోలకు పోకుండా హక్కులపై కలిసి కేంద్రం, ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీల మెడలు వంచాలి. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న శకుని రాజకీయాలపై తెలంగాణ ప్రజలు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా భవిష్యత్ అంధకారంగా మారుతుంది. మళ్లీ తెలంగాణ సమాజం పరాయి పెత్తనం కింద బానిసలుగా మారే దుస్థితి ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉందని మరువరాదు.
తోటకూర రమేశ్