రాజకీయాలు కేవలం అధికార పోరాటం మాత్రమే కాదు. అవి చరిత్ర, జ్ఞాపకం, నైతిక హక్కుల మీద జరిగే నిరంతర సంగ్రామం కూడా. Politics is a battle over who controls the past, because whoever controls the past controls the future అని జార్జి ఆర్వేల్ అన్నట్టు చరిత్రను నిర్మించిన నాయకుల దేశభక్తి, నిబద్ధత, నిజాయతీని ప్రశ్నించడం భారత రాజకీయాల్లో కొత్త విషయం కాదు. నిన్న ఇది జవహర్లాల్ నెహ్రూ విషయంలో జరిగింది. ఈ రోజు అదే స్క్రిప్ట్ తెలంగాణలో కేసీఆర్ విషయంలో కొనసాగుతున్నది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది పునరావృతమయ్యే, కాలానుగుణంగా పరీక్షించిన రాజకీయ వ్యూహం. చరిత్రను నిర్మించిన వారిని తొలగించి, చరిత్రను తిరిగి హస్తగతం చేసుకోవాలనే యత్నం.
చరిత్రలో ఒక విచిత్రం ఉన్నది. అదేంటంటే పోరాటం చేయని వాళ్లే, ఆ పోరాటానికి అర్థం చెప్పాలని ప్రయత్నిస్తారు. Great men are often judged not by their sacrifices, but by the fears they leave behind అని హన్నా ఆరెంట్ చెప్పారు. అలాగే భారత స్వాతంత్య్ర ఉద్యమం కూడా వాదనలతో రాసిన చరిత్ర కాదు. త్యాగాలతో, జైలు జీవితాలతో, రక్తంతో రాసిన చరిత్ర. జవహర్లాల్ నెహ్రూ గడిపిన కారాగార జీవితం, వలస పాలనకు వ్యతిరేకంగా చేసిన రాజకీయ, సాంస్కృతిక పోరాటం, స్వతంత్ర భారతాన్ని రాజ్యాంగబద్ధ, గణతంత్ర, ప్రజాస్వామ్య వ్యవస్థగా నిలబెట్టిన బాధ్యత, ఇవన్నీ చరిత్రలో నమోదైన సత్యాలు.
స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రత్యక్షపాత్ర లేని ఆర్ఎస్ఎస్, బీజేపీ రాజకీయ శక్తులు, నేడు నెహ్రూ దేశభక్తిని, ఆయన ఉద్దేశాలను ప్రశ్నిస్తున్నాయి. ఇది సాధారణ రాజకీయ విమర్శ కాదు. ఇది స్వాతంత్య్ర చరిత్రపై నైతిక హక్కును ఆక్రమించుకునే యత్నం.
ఎవరు త్యాగం చేయలేదో, వారే త్యాగానికి అర్థం చెప్పాలనుకోవడమే అసలు సమస్య. ఎందుకంటే నెహ్రూ నిలబడితే ఆధునిక భారత కథనం కాంగ్రెస్ నడిపిన స్వాతంత్య్ర ఉద్యమ కేంద్రీకృతంగా ఉంటుంది. A nation’s past is not merely remembered; it is politically produced అని ఆంటోనియో గ్రామ్సీ అన్నారు. అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్రను పక్కన పెట్టాలంటే నెహ్రూనే సమస్యగా చిత్రీకరించాలనేది కుట్ర. ఆయననే వివాదంగా మార్చడం, ఆయన దేశభక్తిపై సందేహాలు సృష్టించడం ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తుల వ్యూహం.
నెహ్రూపై దాడులు.. అదే ప్రయోగం కేసీఆర్‌పై
History repeats itself, first as tragedy, second as farce అని కార్ల్‌మార్క్స్ చెప్పారు. చరిత్ర మొదటిసారి జరిగితే అది ఒక విషాదం. అదే చరిత్ర పునరావృతమైతే అది ఒక ప్రహసనం. నెహ్రూను లక్ష్యంగా చేసుకున్న రాజకీయ దాడులు స్వాతంత్య్రానంతర భారత రాజకీయాల్లో ఒక విషాదంగా మొదలయ్యాయి. కానీ అదే పద్ధతిని, అదే అనైతికతను, అదే చరిత్ర అపహరణను తెలంగాణలో కేసీఆర్‌పై ప్రయోగించడం విషాదం మాత్రమే కాదు, ఒక రాజకీయ ప్రహసనం. తెలంగాణ విషయంలో జరుగుతున్నది చరిత్ర పునరావృతం కాదు.. చరిత్రను అనుకరించే అసహజ ప్రయత్నం. తెలంగాణ రాష్ట్రం ఎవరో ఇచ్చిన దానం కాదు. త్యాగం, రక్తం, ఆత్మగౌరవం, దీర్ఘకాల పోరాట ఫలితం.
తెలంగాణ ఉద్యమం ఎప్పుడు మొదలైంది? ఉద్యమానికి నిరంతర రాజకీయ నాయకత్వం ఎవరు వహించారు? ఉద్యమాన్ని ఢిల్లీ రాజకీయాల వరకు తీసుకెళ్లి, రాష్ట్ర ఏర్పాటు సాకారం దిశగా పోరాటాన్ని మలిచింది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే.. కేసీఆర్. Leadership is not claimed by speech, but earned through struggle అని బీఆర్ అంబేద్కర్ అన్నట్టుగా ఇది భావోద్వేగపూరిత వాదన కాదు. ఇది రాజకీయ వాస్తవం. ఇది చరిత్రలో నమోదైన సత్యం. విద్యార్థుల ఉద్యమాల నుంచి, రాజీనామాలతో ప్రజాప్రతినిధుల పదవీ త్యాగాలు, నిరసన, నిరాహార దీక్షలు, పార్లమెంటులో పోరాటాల వరకు తెలంగాణ ఉద్యమానికి ఒక దిశ, గమ్యం ఇచ్చింది కేసీఆర్ నాయకత్వమే. నాడు ఉద్యమంలో లేని శక్తులు, ఉద్యమానికి దూరంగా ఉన్న రాజకీయ పార్టీలు నేడు కేసీఆర్ నిబద్ధతను ప్రశ్నించడం విషాదం మాత్రమే కాదు. అది ఒక ప్రహసనం. పోరాటం చేయని వారు ఆ పోరాటానికి అర్థం చెప్పాలనుకోవడమే ఆ నాటకంలో ఇతివృత్తం. తెలంగాణ పట్ల కేసీఆర్ నిబద్ధతను తెలంగాణ ఉద్యమంలో లేని కాంగ్రెస్ (ప్రస్తుత సీఎం, నాయకత్వం), బీజేపీ ప్రశ్నిస్తున్నాయి. ఇది రాజకీయ విమర్శ కాదు. ఇది ఉద్యమ చరిత్రను దోచుకునే యత్నం. నాయకత్వాన్ని అనుమానించడం ద్వారా ఉద్యమాన్నే అనాథగా చేయాలనే రాజకీయ దుర్మార్గం.
ఉద్యమంలో లేనివాళ్లకు నైతిక హక్కు ఎక్కడిది?
Moral authority does not come from power; it comes from participation అని జీన్‌పాల్ సార్టర్ చెప్పినట్టుగా నైతిక హక్కు ఎన్నికలతో రాదు. అది పోరాటంతో వస్తుంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు, కాలేజీల్లో విద్యార్థులపై లాఠీచార్జి జరిగినప్పుడు, విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినప్పుడు, రైతులు, ఉద్యోగులు రోడ్డెక్కినప్పుడు ఆ సమయంలో కాంగ్రెస్, బీజేపీ ఎక్కడున్నాయి? అప్పుడు రాజకీయంగా సురక్షితంగా ఉన్నవాళ్లే, నేడు ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్‌కు తెలంగాణ పట్ల నిబద్ధత ఎంత ఉన్నది? అని ప్రశ్నిస్తున్నాయి. ఇది తెలంగాణ ప్రజల పోరాటానికి, త్యాగాలకు అవమానం, ప్రజల స్మృతిని మసకబార్చే యత్నం.
తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించడమే
When a people choose a leader in struggle, that leader becomes part of their collective self అని ఫ్రాంట్జ్ ఫానొన్ అన్నారు. కొందరు నేతలు పదవులు పొందుతారు. కొందరు నేతలు ప్రజల జ్ఞాపకాల్లో స్థానం సంపాదిస్తారు. కేసీఆర్ కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక రాజకీయ ప్రతీక. తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ రాజకీయ స్వరానికి ప్రతీక. తెలంగాణ ప్రజల సమష్టి నిర్ణయానికి నిలువుటద్దం. ఆయన నిబద్ధతను ప్రశ్నించడం అంటే తెలంగాణ ప్రజలు చేసిన త్యాగాన్ని, ఉద్యమాన్ని, ప్రజల నిర్ణయాన్ని ప్రశ్నించినట్టే అవుతుంది. నిర్మాణాన్ని కూల్చలేక, వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని Destroy the symbol, and you weaken the structure అనేది ఆధునిక రాజకీయ సూత్రం. అంటే వ్యవస్థను కూల్చలేని వారు, వ్యవస్థను నిర్మించిన వ్యక్తిని కూల్చాలని యత్నిస్తారు. నెహ్రూ నిర్మించిన రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్-బీజేపీ రద్దు చేయలేవు. ప్రజాస్వామ్యాన్ని బహిరంగంగా తిరస్కరించలేవు. అందుకే నెహ్రూనే దేశద్రోహిగా చూపించాలని యత్నిస్తున్నారు. వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని, వ్యవస్థను బలహీనపరచాలనేది ఆ శక్తుల ఉద్దేశం.
నేడు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసి.. కేసీఆర్ నిర్మించిన తెలంగాణ వాస్తవాన్ని తొలగించలేవు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్తు స్వయం సమృద్ధి, సంక్షేమ పునాది వంటివన్నీ ఇక్కడి సమాజంలో లోతుగా పాతుకుపోయాయి. అందుకే కేసీఆర్ ఉద్దేశాలనే కించపర్చి, నిందలు వేయాలని చూడటం యాదృచ్ఛికంగా చేస్తున్న విమర్శగా చూడలేం. ఇది దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం. నిర్మాణాన్ని కాదు, నిర్మాణకర్తను లక్ష్యంగా చేసుకునే వ్యూహం.
చరిత్రను మార్చలేరు.. చెరపలేరు
The most effective way to destroy people is to deny and obliterate their own understanding of their history అని జార్జి ఆర్వెల్ అన్నట్టుగా చరిత్రను అంగీకరించలేని రాజకీయాలు, చివరకు చరిత్రతోనే యుద్ధం చేస్తాయి. నెహ్రూ ఉంటే ఆధునిక భారత కథనం ఆర్ఎస్ఎస్-బీజేపీ చేతుల్లోకి పూర్తిగా వెళ్లదు. కేసీఆర్ ప్రజల హృదయాల్లో మహోన్నతుడిగా ఉంటే తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలోకి కాంగ్రెస్, బీజేపీ స్థానం సంపాదించుకోవడం అసాధ్యం. అందుకే కేసీఆర్‌ను కించపరుస్తూ, నిందలు వేస్తూ నిరంతర దాడి చేస్తున్నారు ఆ రెండు పార్టీల నేతలు. అందులో భాగంగా వ్యక్తిగత ఆరోపణలకు కూడా వెనుకాడటంలేదు. అందుకే దేశభక్తి, నిబద్ధత వంటి పదాల రాజకీయ దుర్వినియోగం. ఇది వాదన కాదు.. భయం. ఆ భయం.. ప్రజల జ్ఞాపకం మీద భయం. సత్యం నిలిచిపోతుందనే భయం. You cannot erase lived history with official narratives. అనేది సబాల్టర్న్ స్టడీస్ సూత్రం. చరిత్ర అనేది వాదనలతో మారదు. అది ప్రజల అనుభవాలతో నిలబడుతుంది.
తెలంగాణ అస్తిత్వానికి నాయకత్వం వహించింది కేసీఆర్. ఈ సత్యాన్ని ఎవరు, ఎంత దాచినా దాగదు. ఉద్యమంలో లేనివాళ్లు ఆ చరిత్రను రాయలేరు. కుట్రలతో వేసే అపవాదులతో చరిత్ర మారదు. తెలంగాణకు జ్ఞాపకం ఉన్నది. ఇక్కడ ప్రజలకు జ్ఞాపకం ఉన్నది. తమ హక్కుల కోసం ఎవరు పోరాడారో, ఎవరు నిలిచారో, ఎవరు దూరంగా ఉన్నారో వారి మనోఫలకాలపై నిక్షిప్తమై ఉన్నది. ఎవరు ఇప్పుడు మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో కూడా తెలుసు.
నెహ్రూను ప్రశ్నించడం ద్వారా స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర మారలేదు. కేసీఆర్‌ను అనుమానించడం ద్వారా తెలంగాణ ఉద్యమ చరిత్రను మార్చలేరు. చరిత్రను నిర్మించినవాళ్లు ఎప్పుడూ లక్ష్యంగా మారుతూనే ఉంటారు. ఎందుకంటే వారిని విస్మరించి, కొత్త రాజకీయ కట్టుకథలు రాయలేరు. ఎందుకంటే వారు లేకుండా రాజకీయాలు నడవవు. అందుకే నెహ్రూ లక్ష్యం. అందుకే కేసీఆర్ లక్ష్యం. ఇందుకు కారణం కూడా.. వారిద్దరు చరిత్రను, వ్యవస్థలను నిర్మించడమే.
చరిత్ర, జ్ఞాపకం, బాధ్యత
The ultimate measure of a society is not how it treats its powerful, but how it remembers its builders అనేది నైతిక రాజకీయ సిద్ధాంతం. చరిత్రను నిర్మించిన నేతలను ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో తప్పు కాదు. కానీ ఆ ప్రశ్న వెనుక నిజాన్వేషణ లేకుండా, రాజకీయ అసహనం మాత్రమే ఉంటే అది విమర్శ కాదు, వికృతి. నెహ్రూ విషయంలో జరిగింది ఇదే. కేసీఆర్ విషయంలో జరుగుతున్నదీ ఇదే. పోరాటంలో లేనివాళ్లు, త్యాగం చేయని వాళ్లు, చరిత్రను తిరగరాయాలని యత్నించిన ప్రతిసారీ ప్రజాస్మృతి వారికి అడ్డుకట్ట వేసింది. చరిత్రను నిర్మించిన వారి పాత్రను, వారి నిబద్ధతను, వారి త్యాగాన్ని తిరస్కరించే నైతిక హక్కు ఎవరికీ లేదు. చరిత్ర అనేది ప్రభుత్వ పత్రం కాదు. ప్రజలు అనుభవించిన కష్టాలు, ఉద్యమాల గాయాలు, జైలు జీవితాల జ్ఞాపకాలు, పోరాటాల నిశ్శబ్ద సాక్ష్యాలే స్వాతంత్య్ర ఉద్యమం నిలిచినంతకాలం నెహ్రూను నిలబెడతాయి. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం నిలిచినంతకాలం కేసీఆర్ నిలబడతారు. రాజకీయాలు మారవచ్చు. ప్రభుత్వాలను నడిపే పార్టీలు మారవచ్చు. కానీ చరిత్రను నిర్మించినవాళ్ల స్థానాన్ని రాజకీయ దాడులు మార్చలేవు. ఇదే నైతిక సత్యం. ఇదే ప్రజాస్వామ్య బలం.
పెండ్యాల మంగళాదేవి