దేశంలో రాజ్యాంగేతర విన్యాసాలు, అరాచకాలు నడుస్తున్నాయి. వీటి సంగతి అలా ఉంచితే రాజకీయ పార్టీలను, నాయకులను అర్థం చేసుకోవటం కష్టంగా ఉన్నది. ఏ పార్టీ సిద్ధాంతాలేమిటో స్పష్టంగా తెలియటంలేదు. కండువాలు మార్చటం పరిపాటిగా మారిపోయింది. ప్రజలకు ఈ తికమక పరిస్థితి ఎలా అర్థమవుతుంది? ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాల పరిస్థితి విశ్లేషించి, పార్టీలు, నాయకులను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం.
తెలంగాణలో రాజకీయ పరిస్థితులను గమనిస్తే భారత స్వాతంత్య్ర ఉద్యమంతో పోల్చదగిన అహింసాయుత ఉద్యమం చేసిన పార్టీ బీఆర్ఎస్. ప్రజల ఆరు దశాబ్దాల నిరసన, నిరాశలను పారదోలింది. రెండుసార్లు అధికారం చేపట్టింది. తొమ్మిదిన్నరేండ్ల కాలంలో ప్రగతి, సంక్షేమాన్ని పరుగులు పెట్టించింది. ప్రజలకు కాంగ్రెస్ చెప్పిన మోసపు మాటల కారణంగా మూడోసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలువలేకపోయింది. దేశంలో బీజేపీ రాజకీయం అత్యంత ఆశ్చర్యకరం. ప్రజలను మతమౌఢ్యంలోకి తీసుకెళ్లి, వివిధ వర్గాల మధ్య కమలం పార్టీ చిచ్చుపెడుతున్నది. దేశ సంపదను తన అనుయాయులకు దోచిపెడుతున్నది. 15 రాష్ర్టాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అధికారం చెలాయిస్తున్నది. నిజానికి ఆ గెలుపు వివిధ అక్రమాలతో సాధించిన ఆక్రమణ. ఇప్పుడు సస్యశ్యామలమైన తెలంగాణపై కన్నేసింది. ప్రజలు అత్యంత జాగరూకతతో ఉండకపోతే తెలంగాణ గుండెకాయ అయిన హైదరాబాద్‌ను కోల్పోయే ప్రమాదం ఉన్నది.
గత ఎన్నికల్లో మోసపూరిత హామీలతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ అనతికాలంలోనే ఆ పార్టీపై ప్రజాగ్రహం వ్యక్తమవుతున్నది. పైగా 1956 నుంచి 2014 మధ్య నాలుగు దశాబ్దాలపాటు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ నరకయాతన పడింది. ప్రాజెక్టులను మధ్యలోనే పడావుపెట్టి, నీళ్లు ఆంధ్రకు పారించుకొని, నిధులు మింగేసి, ఉద్యోగాలు ఆక్రమించుకొని, తెలంగాణ సంస్కృతి, భాషలను జీవన విధానాన్ని హేళన చేసి, భూకబ్జాలు చేసి, అమితమైన వివక్షతో పాలించింది.
తెలుగు దేశం పార్టీ వైఖరిని గమనిస్తే ఆ పార్టీ పేరులోనే రాజకీయ కుట్ర ఉన్నది. తమను మద్రాసీలు అంటున్నారని, తాము ఆంధ్రులమని ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోవటానికి ఆత్మగౌరవ నినాదాన్ని అడ్డం పెట్టుకొన్నారు. కానీ తెలంగాణలో ప్రజలను మభ్యపెట్టేందుకు, వారి వర్గం వారు తెలంగాణలోకి వచ్చేలా తలుపులు బార్లా తెరువడానికి తెలుగుదేశం అని పేరు పెట్టుకొన్నారు.
మనిషి ఏ నిర్ణయం తీసుకోవటానికైనా, ఏ పని చేయటానికైనా మూడు ముఖ్యమైన ఇంద్రియాలు పని చేయాలి. అవే శరీరం, బుద్ధి, ఆత్మ. కొందరు రాజకీయ నాయకులు మూడు పార్టీలకు అనుసంధానించి పని చేస్తున్నారు. ఉదాహరణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నారంటే చెప్పడం కష్టమే. ఆయన ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారు? బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏ పార్టీకి చెందినవారు అంటే వాళ్లే చెప్పలేకపోతున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు వ్యతిరేకి. తెలంగాణ పుట్టుకనే సరిగ్గా లేదని వ్యతిరేకించిన మానవుడు. ఉద్యమం చేసి విజయం సాధించిన పార్టీ నాయకులు తాయిలాలకు తలొగ్గరన్న భయం వల్ల అలాంటి వైఖరిని తీసుకొన్నారు. తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి రాష్ర్టానికి న్యాయంగా రావాల్సిన గ్రాంట్లు, తప్పనిసరిగా చేయవలసిన సహాయాలు కూడా నిరాకరిస్తున్నారు. అలాంటి పార్టీకి ఓటు వేయడం, తెలంగాణను బలి చేయడమే అవుతుంది.
తెలంగాణ విషయంలో మాట్లాడుకోవాల్సిన మరో నాయకుడు చంద్రబాబునాయుడు. తెలంగాణకు చంద్రబాబు బద్ధవ్యతిరేకి. తన రాజకీయ పుట్టుక నుంచే తెలంగాణకు వ్యతిరేకం. తెలంగాణ గురించి ఆయనకు ఏమీ తెలియదు. దేశాన్ని నలిగిపోయేలా చేసిన ఎమర్జెన్సీని సమర్థించిన నాయకుడు చంద్రబాబు. కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. అక్కడ సినిమాటోగ్రఫీశాఖ మంత్రిగా పని చేయడం మరో మలుపు. ఓడిపోయి మామ పార్టీ బుట్టలోకి లాంగ్ జంప్ చేశారు. అతి చురుకుగా మామను కుర్చీ నుంచి దింపి తను ముఖ్యంమంత్రి అవడం మరో హైజంప్. ఇక అక్కడ నుంచి ఆయన వైభవం చూడాలి. 1830ల నుంచే వివిధ భాషా మాధ్యమాల్లో పాఠశాలలు, కళాశాలలు ఉన్న తెలంగాణలో చదువు తన వల్లనే మొదలైందనీ, ఒక డబ్బా బిల్డింగ్ కట్టి దానికి సిటీ అని పేరు పెట్టి తనే ఐటీని ఉద్ధరించాననీ, వినేవాళ్లకు విసుగొచ్చినా ఇప్పటి వరకు మూడు దశాబ్దాలుగా విసుగులేకుండా చెప్తున్నారు.
1950 వరకు నిజాం రాష్ర్టానికి వివిధ రోగాల వైద్యం, శస్త్రచికిత్సల కోసం మధ్య తూర్పు దేశాల వారు వచ్చేవారని తెలియని అజ్ఞాని చంద్రబాబు. నిశితంగా గమనిస్తే ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజల కంటే అమాయకులని అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు చెప్పిన ప్రతిమాటా నమ్ముతారు పాపం. వారి నమ్మకం ఇచ్చిన ఉత్సాహంతో ఈయన ఇంకా కొత్త కొత్త అబద్ధాలను ఆవిష్కరిస్తుంటారు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కర్కశపాలన, దోపిడీ, అధికారం లేనప్పుడు చేసిన మోసపు నాటకాలు నాలుగు కోట్ల తెలంగాణ వారికి తెలియనివి కావు. ప్రమాదం ముంచుకొచ్చి ఆయన మోసాలు బయట పడే సమయానికి ఆయన తెలివిగా సమకూర్చుకున్న అక్రమ సంపాదన రక్షిస్తుంది. ఈయన పార్టీకి తెలంగాణలో ఏ మాత్రం సీట్లు వచ్చినా మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తథ్యం. తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి మరి.
ఇక తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడుకొంటే.. తెలంగాణ, రేవంత్‌రెడ్డి అనేవి రెండు పరస్పర వ్యతిరేక పదాలు. తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడి మీద ద్వేషంతో, రాష్ట్ర ఏర్పాటుపై వ్యతిరేకతతో మొత్తం రాష్ర్టాన్ని ధ్వంసం చేస్తున్నాడు.. రేవంత్‌రెడ్డి. అపరిమిత అవినీతి కారణంగా ప్రజాగ్రహం పెల్లుబుకుతున్నది. ఆయన మనసు లోలోపల ఉడుకుతున్న ద్వేషం ఆయననే ఉన్మత్తుడిని చేస్తున్నది. చివరికి ఇవన్నీ దేనికి దారితీస్తాయో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
తెలంగాణ రాజకీయాల గురించి, తెలంగాణ రాజకీయాల్లో విన్యాసాల గురించి చర్చించుకొనేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురించి కూడా చర్చించుకోవాల్సిన అవసరమున్నది. రాజకీయ అనుభవం కానీ, సొంత వ్యక్తిత్వ బలం కానీ లేని ఈయన కూడా ఈ మధ్య అసందర్భపు ప్రేలాపన, అబద్ధాలు ప్రవచించటంలో మోదీ, చంద్రబాబు, రేవంత్‌తో పోటీ పడుతున్నారు. అనేక వ్యక్తిత్వాలు కలగాపులగం కలిగిన రుగ్మత ఉన్నవాడిలా కనిపించే ఈయన… తాను ఉన్న కూటమిలోని నేతలు చెప్పినట్టు రోబోలా పని చేస్తున్నారు.
తెలంగాణ వ్యతిరేకులు రాష్ర్టాన్ని తమ విన్యాసాలకు వేదికగా మారుస్తున్నారు. వీళ్ల నుంచి తెలంగాణ ప్రజలను ఎవరు రక్షించాలి? నిజానికి బాధలుపడేవారే తిరుగబడాలి. అందుకోసం విద్యావంతులు, మేధావులు, సొంత గడ్డపై ప్రేమ ఉన్నవారు సామాన్య జనాలను చైతన్యపరచాలి. ‘ఈచ్ వన్ టీచ్ వన్’ అన్నట్టుగా ప్రజలకు పైన పేర్కొన్న విషయాలు చెప్పాలి. ఎన్నికల సమయంలో అప్రమత్తం చేయాలి. ప్రజాస్వా మ్యం అంటే ప్రజలు వారి బాధలు వారే అర్థం చేసుకొని, ఆ బాధలకు కారణమైన వారికి తగిన బుద్ధి చెప్పాలి. అందుకు ఓటు ఒక్కటే సాధనం. తస్మాత్ జాగ్రత్త!
కనకదుర్గ దంటు