‘మన ఐక్యత చెదిరిపోయిన నాడు మనం గూడు లేని పక్షులమైతం. మన బతుకులు బజారున పడతయి. కాంగ్రెస్ వస్తే పోలీసు స్టేషన్లల ఎరువుల బస్తాలు, చెప్పుల లైన్లు, లాఠీచార్జిలు, అర్ధరాత్రి బాయిల కాడ పండుడు అయితది. మన వేలితో మన కంటినే పొడుచుకుంటమా? అందుకే, ఆలోచించి ఓట్లు వేయండి’.. 2023లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ చెప్పిన మాట ఇది.
కాంగ్రెస్ ‘ప్రజా పాలన’లో నేడు సరిగ్గా అదే జరుగుతున్నది. ‘ఆనాటి రోజులు తెస్తాన’ని చెప్పిన రేవంత్‌రెడ్డి నిజంగానే తీసుకొచ్చారు. చెప్పినట్టే రైతన్నను రోడ్డున పడేశారు. తెలంగాణ అంతటా ఇప్పుడు ఎక్కడ చూసినా ఎరువుల కోసం రైతన్నలు పడుతున్న వెతలే కనిపిస్తున్నయి. యూరియా కోసం ఊరూరా లైన్లు, పోలీసుల పహారా, నో స్టాక్ బోర్డులు, అన్నదాతల నిరసనలు, ఆందోళనలు నిత్యకృత్యమయ్యాయి. ఇదే కాంగ్రెస్ తెచ్చిన తనదైన ‘మార్క్’ మార్పు.
‘అగ్గి పుల్ల.. కుక్క పిల్ల.. సబ్బు బిళ్ల కాదేదీ కవితకనర్హం’ అన్నారు నాడు మహాకవి శ్రీశ్రీ. ‘అరిగిన చెప్పు.. విరిగిన రాయిరప్ప.. చిరిగిన పాస్బుక్కు.. నలిగిన ఆధార్‌కార్డు.. కాదేదీ లైన్లలో పెట్టేందుకనర్హం’.. అన్ని పట్టుకొచ్చి పెట్టండి అంటున్నది నేడు రేవంత్‌రెడ్డి సర్కారు, కాదు కాదు సర్కస్. ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య, మంత్రులకు, అధికారులకు మధ్య పొంతన లేని ఈ పనికిమాలిన పాలనలో అన్నదాతలు ఆగమవుతున్నరు. ‘మార్పు’ పేరిట ఇచ్చిన ‘తీర్పు’ ఇప్పుడు రైతాంగం మెడకు ఉరితాడై బిగుసుకున్నది. మచ్చుకైనా కనికరం లేని కాంగ్రెస్ పన్నిన ఉచ్చులో చిక్కుకొని కర్షకులు విలవిల్లాడుతున్నరు. మొన్నటివరకు రైతుబంద్ పెట్టిన రేవంత్‌రెడ్డి సర్కారు.. ఆ తర్వాత రుణమాఫీ చేయకుండా రిక్తహస్తం చూపింది. ఆనక సాగునీళ్లివ్వక గోసపుచ్చి రైతుచేత కంటనీరు తీయించింది. ఇప్పుడు యూరియా అందించడం చేతకాక అరిగోస పెడుతున్నది.
అన్నదాతకు ఎవుసమే బతుకు. పంటే రైతుకు పంచప్రాణాలు. మన్నునే నమ్ముకొని, మట్టి పిసికి, భూతల్లి కడుపును చీల్చి బువ్వ పండించే రైతన్నకు వ్యవసాయంతో ఉన్న బంధం అలాంటిది.తనకేదైనా అయినా పట్టించుకోని రైతన్న.. కన్నబిడ్డలాంటి పంటకేదైనా సుస్తీ చేస్తే మాత్రం తల్లడిల్లిపోతడు. తను పానం పెట్టి మరీ పెంచుకుంటున్న పంట పానం మీదికొస్తే తన పానమే పోతున్నట్టు కుమిలిపోతడు. అట్లాంటిది పంట కడుపు మాడ్చి తను కడుపు నింపుకొంటడా? ముద్దయినా ముట్టుకుంటడా?
కాంగ్రెస్ సర్కారు అసమర్థతతో తెలంగాణలోని పంటలన్నీ ఆకలితో అలమటిస్తున్నయి. ఆర్తనాదాలు పెడుతున్నయి. ఆ శోకాలు వినలేకనే పొద్దుపొద్దున్నే పొలం బాటపట్టే రైతన్న కోడి కూయకముందే నిద్రలేసి ఎరువుల కోసం బైలెల్లుతున్నడు. తెల్లవారంగనే క్యూ కడుతున్నడు. రాత్రంతా అక్కడే జాగారం చేస్తున్నడు. ఉమ్మడి ఏపీలో రైతాంగాన్ని అర్ధరాత్రి బాయిల కాడ పండబెట్టిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు యూరియా కోసం సొసైటీల కాడ పండబెట్టింది. మొన్నటి వరకు పండించిన పంటను కొనాలని కాళ్లావేళ్లా పడ్డ అన్నదాత.. నేడు యూరియా కోసం ఏలికల కాళ్ల మీద పడి వేడుకుంటున్నడు. రాత్రంతా కాపు కాసినా, పొద్దంతా పొట్లాడినా ఒక్క బస్తా అయినా ఇవ్వడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే కడుపు మండి.. పంట కడుపు నింపేందుకు పొద్దుపొడవకముందే అన్న దాత రోడ్డెక్కుతున్నడు, నిరసనలు తెలుపుతున్నడు, ఆందోళనలు చేస్తున్న డు, పోలీసుల లాఠీల దెబ్బలు తిని రక్తం చిందిస్తున్నడు. అయినా టోకెన్ తప్పితే, మెతుకు యూరియా ముట్టడం లేదు. అందుకే కడుపు కట్టుకొని పండించిన పంటను కాపాడేందుకు అవసరమైతే రాళ్లు రువ్వుతున్నడు.
మాటిమాటికి ఢిల్లీకి వెళ్లే ముఖ్యమంత్రి ఢిల్లీకి సంచులు మోస్తున్నరే తప్ప, అక్కడి నుంచి ఒక్క యూరియా సంచి తెస్తలేరు. పైగా యూరియా కొరతే లేదని, కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నరని, చెప్పులు లైన్లలో పెట్టిస్తున్నరని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నరు. కేంద్రం నుంచి సకాలంలో యూరియా తీసుకొచ్చి, బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చూసుకొని, కృత్రిమ కొరత సృష్టించేవారిపై చర్యలు తీసుకొని, పల్లెపల్లెన ఎరువులు పంచాల్సింది తానేనన్న సంగతిని ఆయన మరిస్తే ఎలా?
మరోవైపు రాష్ట్రంలో యూరియా కొరతే లేదని, కొందరు కావాలనే బజారున పడ్డారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చెప్పడం విడ్డూరం. కావాలని లైన్లలో పెట్టడానికి రైతులకు చెప్పులు, పాస్‌బుక్కులు ఏమైనా ఎక్కువయ్యాయా? ఖాళీ సంచులు, రాళ్లు, రప్పలు, కొమ్మలు, రెమ్మలు లైన్లలో పెట్టడానికి అన్నదాతలకేమైనా వీరి లాగ పనిపాట లేదా? మరోవైపు కొరత, కొరత అని తల్సుకుంటున్నందుకే కొరత వస్తున్నదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంటే, ఆపరేషన్ సిందూర్ కారణంగా చైనా నుంచి యూరియా రాలేదని ఎంపీ రఘునందన్ చెప్పడం హాస్యాస్పదం. హస్తం, కమలం నేతలు కూడబలుక్కొని మరీ చెప్తున్నదే నిజమనుకుంటే.. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడే ఎందుకు లైన్లు కనిపిస్తున్నయి? గతంలో కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు ఎన్నడూ యూరియా కొరత అనే మాటే వినరాలేదు. చినుకు పడకముందే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవుసానికి అవసరమైన అన్నింటిని సమకూర్చేది. ముఖ్యంగా కేసీఆర్ సర్కారు వచ్చాక సాగునీటి లభ్యత పెరగడంతో తెలంగాణలో సాగు విస్తీర్ణం రెండింతలైంది.
ఈ నేపథ్యంలోనే 2014లో 5.5 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న యూరియా వినియోగం నేడు 20 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకున్నది. అయినా కొరత రాకుండా ఉండేందుకు ఏప్రిల్-మే నెలల్లోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించేవారు. ఎరువులు కొనుగోలు చేసేందుకు సీజన్‌కు ముందే రైతుబంధు డబ్బులు రైతుల అకౌంట్లలో జమచేసేవారు. కేంద్రంతో మాట్లాడి సరిపడా యూరియా తెప్పించేవారు. గంగవరం లాంటి పోర్టులకు విదేశాల నుంచి వచ్చే యూరియాను ప్రత్యేక వ్యాగన్లు, లారీల ద్వారా నేరుగా తెలంగాణ అంతటా సరఫరా చేయించారు. అంతేకాదు, మార్క్‌ఫెడ్ వద్ద ఎల్లప్పుడూ 3 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఉండేలా చూశారు. కానీ, నేడు కాంగ్రెస్ సర్కారు రూ.1500 కోట్లకు కక్కుర్తి పడి నిధులు విదిల్చకపోవడంతో మార్క్‌ఫెడ్ స్టాక్ నిండుకున్నది. అందుకే, రేషన్ బియ్యం కోసం చెక్‌పోస్టులు పెట్టినట్టు నేడు యూరియా అక్రమంగా తరలకుండా సరిహద్దుల వద్ద పోలీసులు కాపు కాస్తున్నరు. సొసైటీల వద్ద కాపలా ఉంటున్నరు. రైతులు పడుతున్న బాధలకు ముమ్మాటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వమే ప్రధాన కారణం. ఎండా, వానలను లెక్క చేయకుండా లైన్లలో నిల్చున్న అన్నదాతల కడపు రగులుతున్నది. వారి కడగండ్లు ఆగ్రహ జ్వాలలుగా మారుతున్నయి. ఆ మంటల్లో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు బూడిదవడం ఖాయం.
(వ్యాసకర్త: రాష్ట్ర శాసనమండలి సభ్యులు)
-పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి