ఎంతో పద్ధతిగా, తప్పుల్లేకుండా, జాగ్రత్తగా అమలు చేయవలసిన పంట రుణమాఫీని తెలంగాణ ప్రభుత్వం తత్తరబిత్తరగా చేసి రైతన్నలకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. ఈ తొందరపాటు వెనుక సర్కారీ రైతు ద్రోహం దాగి ఉన్నది. పాలనా పగ్గాలు రేవంత్‌రెడ్డి చేతికొచ్చాక రూ.2 లక్షల పంట రుణమాఫీ అన్నది అన్నట్టుగా చేయడం అసాధ్యమని తెలిసి రైతులను దగా చేసేందుకు కాంగ్రెస్ సిద్ధపడ్డది. వీలైనంత మాఫీ నిధుల తగ్గింపునకు అలా కుట్రలు మొదలయ్యాయి. మాఫీ విధి విధానాలు ఇలా ఉంటాయని ప్రజలకు స్పష్టం చేయకుండానే జీవో విడుదల చేశారు. అందులో ‘తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు పంట రుణ మాఫీ వర్తిస్తుందని ఉన్నది. రైతు కుటుంబాన్ని నిర్ణయించడానికి ఆహారభద్రత కార్డులో ఉన్న సమాచారం ప్రామాణికంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం మేర కు పరిగణనలోకి తీసుకోబడుతుంది’ అని కూడా ఉంది. నిజానికి పీఎం సమ్మాన్ కిసాన్ నిధి అనేది రైతుబంధు లాంటి పథకం. దానికి రుణమాఫీతో ఎలాంటి సామ్యం లేదు. దాని నిబంధనలు రుణమాఫీకి వర్తింపజేయడం అన్యాయం. రైతు కుటుంబం అనే పదం పీఎం కిసాన్‌లో ఉన్నది. ఇంకా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, నెలకు రూ.10 వేలు మించి పింఛన్ పొందుతున్నవారు, ఆదాయం పన్ను చెల్లించేవారు, డాక్టర్, లాయర్ లాంటి వృత్తుల్లో ఉన్నవారు పీఎం కిసాన్ సాయానికి అనర్హులు.
పీఎం కిసాన్ లబ్ధి పొందుతున్నవారికే ఈ రుణమాఫీ వర్తిస్తుందని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం బాహాటంగా చెప్పాల్సింది. జీవోలో ఉన్న విషయం సామాన్య రైతులకు ఎలా తెలుస్తుంది? ఇదే విషయాన్ని ఎవరైనా ప్రభుత్వాధికారులు స్పష్టం చేస్తే రైతుల మధ్య గందరగోళం సమసిపోయేది. పీఎం కిసాన్ సమ్మాన్ ద్వారా డబ్బులు వచ్చినవారికే తప్ప మిగతా రైతులకు రుణం మాఫీ కాదని తెలిసే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడే ప్రభుత్వం దాపరికాలు పాటిస్తున్నది. బ్యాంకులో రుణం ఉన్న రైతులకు మాఫీ అవుతుందని నిలకడలేని సమాధానంతో కాలం వెళ్లబుచ్చుతున్నది.
ప్రభుత్వం మాట ఒకటి, చేత ఒకటి కావడంతో రైతులు అన్నిరకాలుగా నష్టపోయారు. చక్కగా పంట రుణం రెన్యువల్ చేసుకునే రైతులు కూడా గత రెండేండ్లుగా మాఫీ ఆశపై కాలం గడిపారు. అలా కాలయాపన వల్ల ఏడాది కాలానికి 7 శాతం ఉండే వడ్డీ ఆ తర్వాతి కాలానికి 12.5 శాతానికి పెరిగిపోతుంది. పైగా సకాల చెల్లింపునకు లభించే 5 శాతం వడ్డీ రాయితీని కోల్పోతారు. సాధారణ వడ్డీ పోయి చక్రవడ్డీ లెక్కింపు మొదలుకావడం మరో సమస్య. రెండు పంటల కాలం తర్వాత అప్పు నిరర్ధక ఆస్తిగా మారిపోతుంది. కాంగ్రెస్ హామీ ఇలా లక్షలాది రెగ్యులర్ రైతులను డిఫాల్టర్లుగా మార్చేసింది. ఇది బ్యాంకింగ్ వ్యవస్థపై ఎంతో ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. నేతల హామీని నమ్మి బ్యాంకులు ఎందుకు వేచి ఉండాలనే చిక్కు ప్రశ్న మరింత జఠిలమై వసూళ్ల కోసం అవి రైతులపై ఒత్తిడి పెంచే అవకాశం ఉన్నది.
రూ.2 లక్షల రుణమాఫీ హామీని రేవంత్ తొలిసారిగా 2022 మే 6నాడు వరంగల్‌లో జరిగిన ‘రైతు సంఘర్షణ’ సభలో ప్రస్తావించారు. సభాముఖంగా రైతు డిక్లరేషన్‌ను ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు ప్రతి ఎకరానికి రూ.15 వేల ఆర్థిక సాయం అనేవి ఆ డిక్లరేషన్‌లో ప్రధానమైనవి. ఈ మాటలు విన్న ఏ రైతైనా కాంగ్రెస్ గెలిస్తే రూ.2 లక్షల దాకా బ్యాంక్ అప్పు మాఫీ అయితుందని గట్టిగా నమ్ముతాడు. అదే ఆశతో ఓటు గుద్దేశాడు. అలా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పీఎంకిసాన్‌తో పాటు రేషన్ కార్డు నిబంధన తెచ్చి రైతులతో క్రూర పరిహాసమాడుతున్నది. బడ్జెట్ చర్చలో కూడా మాఫీ రాని రైతుల పరిస్థితి ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయలేదు. వ్యవసాయ కేటాయింపులో కౌలు రైతుల ప్రస్తావన లేదు. నిధుల కొరత వల్ల రుణమాఫీ ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పకనే చెప్పింది. ఆశపడి మోసపోయిన రైతుల కోసం ప్రభుత్వం వద్ద ఎలాంటి సాం త్వన వాక్యాలు లేవు. నిజానికి మాఫీ రాని రైతులు తమను క్షమించాలని ప్రభుత్వం బహిరంగంగా ఒప్పుకోక తప్పదు.
ప్రభుత్వం మాఫీ ప్రక్రియ ఆరంభిస్తూ 39 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కోసం రూ. 31 వేల కోట్లు అవసరమని ప్రకటించింది. ఆ మాట ప్రభుత్వమే మరిచిపోయినట్టుంది. ఎందుకంటే బడ్జెట్ నాటికి ఆ మొత్తం రూ.26 వేల కోట్లకు పడిపోయింది. మాఫీ విధి విధానాలు ఇలాగే ఉంటే అందులో సగమైనా సరిపోతుంది.
మొదటి విడతగా లక్ష రుణం ఉన్న 11.32 లక్షల రైతు కుటుంబాలకు రూ.6098 కోట్లు విడుదలయ్యాయి. ఈ లెక్కన రాష్ట్రంలో లక్షకు పైగా బ్యాంకు ఋణం తీసుకున్నవారు 27 లక్షలుండే అవకాశం లేదు. వారి అప్పు మొత్తం రూ. 24 వేల కోట్లు కానేకాదు. వాస్తవానికి బ్యాంకుల్లో లక్షకు పైగా అప్పు తీసుకునే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. లక్ష మాఫీ విషయంలో ప్రభుత్వం పాటించిన విధానాలు పోల్చిచూస్తే రూ.10-15 వేల కోట్లు ఇందుకు సరిపోతాయి. ఎందుకంటే భూమి ఎక్కువగా ఉన్నవారు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండకపోవచ్చు. వారు ఉద్యోగాల్లో ఉండవచ్చు. ఆదాయపన్ను పరిధిలోకి రావచ్చు. అందులో పీఎం సమ్మాన్ కత్తికి బలయ్యే వారే ఎక్కువ. త్వరలో ప్రకటించే లక్షకుపై రుణమాఫీతో కాంగ్రెస్ లెక్క ల బండారం మరింత బయటపడుతుంది.
-బి.నర్సన్
9440128169