PM Modi | కేశూభాయ్ పటేల్ మీద ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకొని గుజరాత్ ముఖ్యమంత్రి పదవిని దొడ్డిదారిన కైవసం చేసుకున్నారు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ. అనేక కల్పనలు సృష్టించి అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ, సామాజిక పరిస్థితులన్నింటిలో గుజరాత్‌ను మాడల్‌గా ప్రచారం చేయించారు. వాస్తవానికి గుజరాత్ రాష్ట్రంలో ఆయన చెప్పుకుంటున్నంత అభివృద్ధి ఏం జరగలేదని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి.
నరేంద్ర మోదీ ప్రతి ఏడాది, గణతంత్ర దినోత్సవం లేదా ఇతర సందర్భాలలో అనేక హామీలను గుప్పిస్తారు. కానీ ఆ తర్వాత వాటిని పాతాళంలోకి నెట్టేస్తారు. భారత ప్రధానిగా తొమ్మిదేండ్లుగా కొనసాగుతున్న మోదీ పాలనలో ఏటా ఇచ్చిన హామీలను ఏడాదిలోపు పూర్తి చేస్తామని బాహాటంగా పేర్కొంటారు. కానీ అనేక వేదికల పైన పార్టీ మీటింగుల్లో మీడియా సాక్షిగా ఆయన ఇచ్చిన ఎన్నో హామీలు హామీలుగానే ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీని దూషిస్తూ, ద్వేషిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను అనేకసార్లు తప్పుపట్టారు. పాలకులు, అధికారులు కలిసి దేశ సంపదను దోచుకుంటున్నారని, దేశ సంపదను సర్వనాశనం చేశారని, అవినీతి, నిరుద్యోగం పెరుగుతోందని మోదీ అనేకసార్లు ఆరోపించారు. కానీ ఆయన తొమ్మిదేండ్ల పాలన కాలంలో దేశాభివృద్ధి గానీ, జీవన పరిస్థితుల పెరుగుదలగాని జరగలేదు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ధనవంతులకు దోచిపెడుతూ పేద మధ్యతరగతి ప్రజానీకానికి ఎలాంటి సాధికారత సాధించలేదని కమిషన్లు, నివేదికలు చెబుతున్నాయి. తాను ప్రధాని అయిన తర్వాత కాంగ్రెస్ విధానాలనే ఆశ్రయిస్తున్నారు. ఆచరిస్తున్నారు.
దేశంలో పేదరిక నిర్మూలన చేయడానికి మరో ఉద్యమాన్ని చేయాలని, అప్పుడే నవభారత నిర్మాణం సాధ్యమవుతుందని 2014లో ఊదరగొట్టారు. అయితే ఇప్పటికీ దేశంలో 40 కోట్ల మందికి పైగా పేదరికంలోనే మగ్గుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇక భారత్‌లో ఉత్పత్తిని పెంచడానికి స్కిల్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ఇండియా అం టూ మరో నినాదం ఇచ్చారు. స్వదేశీ పరిశ్రమలను ఆదుకోవడాన్ని విస్మరించారు. 2019 అక్టోబర్ 2 గాంధీజీ 150వ జయంతి నాటికి పరిశుభ్ర భారతాన్ని సృష్టిస్తామని గప్పాలకు పోయారు. స్వచ్ఛభారత్ కోసం వేలకోట్ల నిధులను కేటాయించినప్పటికీ పరిశుభ్ర భారతం సాకారం కాలేదు. జన్‌ధన్ ఖాతాల ద్వారా ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉండేలా చేస్తామన్నారు. దేశంలో ఇప్పటికీ 21 కోట్ల మంది కి బ్యాంకు ఖాతా లేదు.
2015లో నల్లధనంపై పోరు చేస్తామని, ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్నారు. అదీ అమలు కాలేదు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్నారు. ప్రస్తుతం దేశంలో గడ్డు పరిస్థితుల్లో 49 శాతం కంపెనీలు మూతపడే దశలోకి చేరాయి. నిరుద్యోగులకు ఉపాధి కోసం సంవత్సరానికి రెండుకోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మోదీ దాన్ని ఇప్పటివరకు అమలు చేయకపోవడం, నిరుద్యోగ యువతను బాధిస్తున్నది. ప్రతి ఇంటికి నల్ల, తాగునీరు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదు. ఇప్పటికీ 50 శాతం ఇండ్లకు నల్ల కలెక్షన్ లేదు. 70 శాతం ఇండ్లకు సురక్షిత తాగునీరు అందట్లే దు. ప్రతి గ్రామానికి విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పినా ఇప్పటివరకు ఆచరణలో లేదు. 13 శాతం ఇండ్లకు ఇంకా కరెంటు లేదు.
ప్రతి పేదింటికి గ్యాస్ కనెక్షన్ అన్నారు. ఇప్పటికీ గ్యాస్ అందని పేదలు ఎంతోమంది ఉన్నారు. ఉన్న గ్యాస్ ధరను రెండింతలకు పైగా పెంచారు .దేశంలో అవినీతి పెచ్చు మీరిందని నల్లధనం పెరిగిందని దానిని వెనుకకు రప్పిస్తానని చెప్పి 2016లో పెద్ద నోట్లను రద్దు చేశారు. దేశంలో దోచి, విదేశాల్లో దాస్తున్న అక్రమార్కులను వదలబోమని, అది దేశ అభివృద్ధికి గొడ్డలి పెట్టని ప్రగల్భాలు పలికిన మోదీ హయాంలోనే బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మేహుల్ చోక్సీ లాంటి మోసగాళ్ల్లు విదేశాలకు పారిపోయారు. బ్యాంకు ల నుంచి కార్పొరేట్లు తీసుకున్న రూ.15 లక్షల కోట్ల రుణాలను కేంద్రం మాఫీ చేసింది.
2018లో జీఎస్టీ వంటి సంస్కరణలతో భారత్ పరుగు పెడుతుందని మోదీ చెప్పారు. గృహ, నిత్యావసర వస్తువుల పైన 5,6, శాతం ఉన్న పన్నులను 12,18 శాతం పెంచి పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచారు. అదే సమయంలో కరోనా దెబ్బ. కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలలేమితో గడిచిన తొమ్మిదేండ్లుగా లక్షలాది చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు మూతపడ్డాయి, కోట్లాదిమంది కార్మికులు ఆకలితో అలమటించారు. దీనికి ప్రభుత్వం ముందు చూపు లేకపోవడమే కారణమని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
2022 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మా రుస్తానన్న ప్రధాని 2022 పంద్రాగస్టునాడు ఎర్రకోటపై జెండా ఆవిష్కరించి తన ప్రసంగంలో 2047 నాటికి అభివృద్ధి చెందుతుందని చెప్పిన మాటే మళ్లీ చెప్పారు. 2014 లో డాలర్ విలువ 58. 40 ఉంటే 2023లో 83.18కి దిగజారింది.
మోదీ హయాంలో రూపాయి విలువ పెరగలేదు. నల్ల డబ్బు తిరిగి రాలేదు. జీవన ప్రమాణాలు పెరుగలేదు. అవినీతి ఆగలేదు. యువతకు ఉపాధి దొరకలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. అనుకున్న లక్ష్యాలను సాధించలేదు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి వివిధ దేశాలకు సంబంధించిన జీ 20 సమావేశాన్ని దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించారు.
1971లో దేశ జనాభా 54.7 కోట్లు ఉన్నప్పుడు అత్యంత పెద్ద శాఖ అయినా రైల్వేలో ఉద్యోగులు 13.7 లక్షలు. మరి ఇప్పుడు జనాభాకు తగ్గట్టుగానే ఉద్యోగాలు పెరుగాలి, కానీ 2023లో దేశ జనాభా 142 కోట్లకు పెరిగింది. కానీ రైల్వే ఉద్యోగులు మాత్రం 11.7 లక్షలకు తగ్గారు. ఇంకా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కోట్లాది ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి.
జీ-20 దేశాల ప్రతినిధుల సమావేశం కోసం ఢిల్లీలోని పేదల గుడిసెల ను ఎందుకు కూల్చిన ట్టు? వాటిని కనబడకుం డా గ్రీన్ కార్పెట్లు, మోదీ కటౌట్లతో ఎందుకు కప్పేసినట్టు? ఇవేకాదు మణిపూర్, హర్యానాలో గొడవలు జరుగుతున్నా ఉదాసీనత వహించడం దేనికి సంకేతం? మోదీ సమా ధానం చెప్పాల్సిందే.
పెద్దమాతరి బాబు
99495 69205