ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ పోరాటం మొదలై మూడు దశాబ్దాలవుతున్నది. ఉమ్మడి (ప్రస్తుత ఏపీ) రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 1994లో 20 మంది మాదిగ యువకులతో మందకృష్ణ మాదిగ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఎమ్మార్పీఎస్ ఉద్యమం పురుడు పోసుకున్నది. తూర్పున ఉదయించే సూర్యునిలా అణగారిన వర్గాల పల్లెల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా రాజ్యాంగపరంగా రావలసిన హక్కులు సాధించుకునే దిశగా మాదిగ దండోరా దళిత ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించింది.
PM Modi | ఎమ్మార్పీఎస్ మూడుదశాబ్దాలుగా తెలుగు రాష్ర్టాలే కాక దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీలను కూడగట్టుకుని ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా ఉద్యమాలు కొనసాగిస్తున్నది. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల మద్దతును కూడగడుతూ పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ చట్టం చేసేలా పోరాటాలు కొనసాగిస్తున్నది. అయితే వివిధ రాజకీయ పార్టీలు వర్గీకరణ విషయంలో మాల, మాదిగల మధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడుపుకొన్నాయే తప్ప సమస్యను పరిష్కరించలేదు. దీంతో వర్గీకరణ పోరాటంలో ఎంతోమంది అమరులయ్యారు.
సామాజిక న్యాయం కోసం జరుగుతున్న ఎమ్మార్పీఎస్ పోరాటం జనాభా దామాషా ప్రకారం ‘మేము ఎంతో మాకు అంత’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఏపీలో ఎస్సీ జనాభా 1,38,78,078 ఉండగా వీరిలో మాదిగలు 67,02,609 మంది, మాలలు 55,70,244 మంది ఉన్నారు. అంటే మాలల కంటే మాదిగలు 11 లక్షల మంది ఎక్కువగా ఉన్నారనేది అక్షర సత్యం. అయితే ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని పరిగణనలోనికి తీసుకున్న పాలకులు 1997లో జస్టిస్ రామచంద్ర రాజు నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ ఎస్సీలను వర్గీకరించాలని సిఫారసు చేసింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం 15 శాతం ఎస్సీ కోటాను విభజిస్తూ జీవోను విడుదల చేసింది. ఏ గ్రూపులో రెల్లికులం దాని అనుబంధ కులాలు సహా మొత్తం 12 కులాలను కలుపుతూ వారికి 1శాతం కోటా ఇవ్వగా, బీ గ్రూపులో మాదిగ దాని ఉప కులాలు మొత్తం 18 కులాలను చేరుస్తూ 7శాతం కోటాను కేటాయించింది. సీ గ్రూపులో మాల దాని ఉప కులాలు 25 కులాలను చేరుస్తూ 6 శాతం కోటాను కేటాయించగా డీ గ్రూపులో ఆది ఆంధ్రులతోపాటు నాలుగు కులాలను చేర్చి 1శాతం కోటాను నిర్ణయించింది. దీనిపై అప్పట్లో మాల మహానాడు కోర్టుకు వెళ్లింది. ఈ జీవో రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిమితికి మించినదని, రాజ్యాంగ విరుద్ధమైనదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆనాడు ప్రకటించింది. ఆ తర్వాత 2000లో తిరిగి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం చేసి, రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఆమోదంతో అమల్లోకి వచ్చింది. అప్పట్లోనే ఎస్సీలను ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరిస్తూ జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు కోటాలను నిర్ణయించారు. కానీ 2004 నవంబర్‌లో సుప్రీంకోర్టు ఆ అంశాన్ని కొట్టివేయడంతో మళ్లీ మొదటికొచ్చింది.
2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై వర్గీకరణ ఉద్యమ ఒత్తిడి పెరిగి రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయించారు. దీనికి ప్రతిస్పందనగా ఆనాడు సామాజిక న్యాయం, సాధికారిక మంత్రిత్వశాఖ ఉషామెహ్రా కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2008లో మంత్రి మీరాకుమార్‌కు కమిషన్ నివేదిక సమర్పించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ను సవరించాలని ఆర్టికల్‌లో 3వ క్లాజును చేర్చడం ద్వారా రాష్ట్ర అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేసిన పక్షంలో కులాల వర్గీకరణను పార్లమెంట్ ఆమోదించవచ్చని ఉషా మెహ్రా కమిషన్ సిఫారసు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఉషా మెహ్రా కమిషన్ నివేదికను సీరియస్‌గా తీసుకోకపోవడంతో పరిష్కారానికి నోచుకోలేదు. అనంతరం 2014 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఇచ్చిన బీజేపీ హామీ హామీగానే మిగిలిపోయింది. వర్గీకరణ విషయంలో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినా ఫలితం లేకుండా పోయింది.
ఇటీవల శాసనసభ ఎన్నికలకు ముందే హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరై వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు కమిటీని వేస్తున్నామని ప్రకటించి ఎస్సీ కులాల్లో ఆశలు రేపారు. తాను ఎమ్మార్పీఎస్‌కు నాయకత్వం వహిస్తున్న కృష్ణ మాదిగ సహచరుడిగా వర్గీకరణ ఉద్యమంలో పాలుపంచుకుంటానని ప్రసంగించిన మోదీ మాటలు మరింత ఆసక్తిని రేపాయి. మరి ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనైనా మోదీ మాట నిలుపుకొంటారా? ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టి చట్టబద్ధత కల్పించేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అనేది ఇప్పుడు తేలాల్సి ఉన్నది. ఈ విషయమై ఎస్సీ కులాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బూర్గుల నాగేందర్ మాదిగ
99630 08745