తెలంగాణ బిడ్డ అయిన కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ‘గనులు మీరు వేలం వేస్తారా.. మమ్ముల్ని వేయమంటారా?’ అని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. పదవీ స్వీకారం చేసిన మూడు రోజులకే రాష్ట్రంలో సహజంగా సింగరేణికి రావలసిన బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు తొందరపడుతున్నారు. తెలంగాణకు గని మాణిక్యమైన 135 ఏండ్ల సింగరేణికి మంగళం పాడేందుకు కేంద్రంలో బీజేపీ సర్కారు ప్రణాళికలు మొదలయ్యాయి. కొత్త గనుల కోసం సింగరేణి ఇందులో పాల్గొంటే ప్రైవేటు శక్తులతో అది తట్టుకోగలదా అనేదే అనుమానం.
బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించదేమోనన్న భయంతో గతంలో తెలంగాణ బొగ్గు గనుల వేలం పాటకు చాలా సంస్థలు ముందుకు రాలేదు. ఇప్పుడా పరిస్థితి లేదు. మంత్రి కిషన్ రెడ్డి నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ఖండించిన వార్త రాలేదు. గత ప్రభుత్వం వలె నిరసననైనా తెలపలేదు. చివరికి తొలిసారిగా బిడ్డింగ్‌లో తమ భవిష్యత్తును సింగరేణి పరీక్షించుకోక తప్పదేమో. ప్రభుత్వం ముందుకురాని పక్షంలో ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాజకీయ ప్రతిపక్షాలు, సింగరేణి కార్మికులు ఐక్యమై సిరుల వెలుగుల సింగరేణిని కాపాడుకోవలసిన అవసరం ఉన్నది.
ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణలో పారిశ్రామికవేత్తలకు దేశ సంపదను కట్టబెట్టేందుకు కంకణం కట్టుకున్న మోదీ ప్రధాని పీఠం ఎక్కగానే దేశంలోని గనుల వేలానికి తెరలేపారు. వారి పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు, ఇనుము, బొగ్గు, సున్నపురాయి మున్నగు వాటినన్నిటినీ వారికే నేరుగా అందేలా ఏర్పాట్లు చేశారు. 2014 నుంచి దేశంలోని ఖనిజ సంపద అంతా అదానీ, అంబానీ, దాల్మియా, బిర్లా, జిందాల్, అంబుజా లాంటి ప్రైవేటు కంపెనీల చేతల్లోకి వెళ్లిపోయింది. 2020లో తీసుకున్న కేంద్ర నిర్ణయం ప్రకారం బొగ్గు కేటాయింపు, ధర నిర్ణయాలపై ఆ సంస్థలకే సర్వ హక్కులుంటాయి. ప్రభుత్వ సంస్థలు కూడా వాటి నిర్ణీత ధరకే బొగ్గు కొనుక్కోవాలి. దాని వల్ల కరెంటు చార్జీలు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నది.
కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో 2020లో బొగ్గు గనుల తొలి వేలం ప్రక్రియ ప్రధాని మోదీ చేతుల మీదుగా అట్టహాసంగా మొదలైంది. దీనివల్ల రాష్ర్టాలకు, కేంద్రానికి ఆదాయం పెరుగుతుందని మోదీ అన్నారు. అయితే ఆయా రాష్ర్టాలకు మాత్రం ఈ విధానం కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. ఉదాహరణకు సింగరేణిని తీసుకుంటే అందులో 43 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇన్నేళ్లుగా రాష్ట్రంలో కొత్తగా మొదలైన గనులు దాని స్వాధీనంలోనే పనిచేయడం వల్ల సంస్థ సమృద్ధికి, ఉద్యోగుల భవితకు ఢోకా లేకుండా గడిచింది. ఈ వేలం విధానం వల్ల కొత్త గనులను ఎవరైనా పోటీ పాటలో సొంతం చేసుకోవాలి. దేశంలో గనులపై విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 100 శాతం అనుమతి ఉన్నందున బయటి దేశాలకు కూడా ఈ అవకాశం ఉన్నది. సింగరేణి వెబ్సైట్ ప్రకారం ఇప్పుడు 18 ఓపెన్ కాస్టులు, 24 భూగర్భ గనులు దాని ఆధీనంలో ఉన్నాయి.
పాత గనుల్లో బొగ్గు నిలువలు తరిగిపోగానే కొత్త గనుల అన్వేషణలో సింగరేణి ఇంతకాలం ఇబ్బంది లేకుండా కొనసాగింది. ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణి ఇప్పుడు కొత్త గనుల వేలంతో ప్రైవేట్ సంస్థలతో పోటీ పడాలి. వేలంలో ఎవరి బిడ్డింగ్ ఎక్కువ ఉంటే వారికే గనుల కేటాయింపు జరుగుతుంది.
ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల విధి విధానాల్లో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ప్రైవేటు సంస్థ తక్కువ వేతనాలతో, యంత్రాల సాయంతో, వీలైనంత తక్కువ సమయంలో గనిని తోడేసి బిచాణా ఎత్తేస్తుంది. అది సింగరేణికి సాధ్యపడదు. ఉద్యోగులను తగ్గించలేదు, వారి జీతభత్యాల్లో కోత పెట్టలేదు. కాబట్టి ప్రైవేటుకు పోటీగా ఈ వేలంలో పాల్గొంటే అది ఆర్థికంగా నష్టపోక తప్పదు. ఈ వేలం దందా వల్ల క్రమంగా కొత్త గనులు తగ్గి, ఉన్న ఉద్యోగులకు పనిలేక, ఉత్పత్తి లేక సింగరేణి నష్టాలపాలయ్యే ప్రమాదం ఉన్నది. సజావుగా నడుస్తున్న కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్య ప్రభుత్వ సంస్థలను కేంద్రం ఇలా పారిశ్రామికవేత్తల లాభాల కోసం బలి చేయడం దురదృష్టకరం. 2020 నుంచే తెలంగాణలోని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో బొగ్గు గనులను వేలం వేయవద్దని, సహజంగా అవి సింగరేణి సొత్తు అని గట్టిగానే వ్యతిరేకించింది. డిసెంబర్ 2021లో మాజీ సీఎం కేసీఆర్ ‘మా గనులు మాకే’ అని కేంద్రానికి లేఖ రాశారు.
అదే నెల తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పిలుపుపై 43 వేల మంది సింగరేణి ఉద్యోగులు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ 3 రోజులు సమ్మె చేశారు. 2022, ఫిబ్రవరిలో గనుల మంత్రిగా ఉన్న కేటీఆర్ కూడా రాష్ట్రంలోని 4 బొగ్గు గనుల వేలాన్ని ఆపివేయమని లేఖ రాశారు. 2022 డిసెంబర్లో రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ హోదాలో బోయినపల్లి వినోద్‌కుమార్ కూడా సింగరేణి సంస్థకు నామినేషన్ పద్ధతిలో గనులను కేటాయించమని కేంద్రాన్ని కోరారు. కొత్త గనులు కావాలనుకుంటే సింగరేణి వేలంలో పాడుకోవచ్చని ఆనాటి కేంద్ర గనుల మంత్రి ప్రహ్లాద్ జోషి మొండిగా సమాధానం ఇచ్చారు. ఈ రోజు తెలంగాణకు న్యాయం చేయవలసిన కిషన్‌రెడ్డి కూడా అదే పాట పాడుతున్నారు. సంబంధిత శాఖ మంత్రిగా ఉండి కూడా ఆయన తెలంగాణ రాష్ట్ర, సింగరేణి సంస్థ ప్రయోజనాలను కాపాడలేకపోవడం ఘోరం. పైగా ప్రభుత్వాన్ని శాసించే రీతిలో మాట్లాడటం విడ్డూరంగా ఉన్నది. రాష్ట్రం సకాలంలో స్పందించకుంటే స్వయంగా వేలాన్ని నిర్వహించే అధికారం కేంద్ర గనుల శాఖకు ఉంది. అందుకే అంత హూంకరింపు.
ఈ నెల చివరలో గనుల శాఖ తరపున వేలం నిర్వహించే అవకాశం ఉన్నదని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకైతే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి ప్రకటనను విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా కేంద్రానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్న రేవంత్ రెడ్డి ఈ విషయంలో మాత్రం కచ్చితంగా ఉండవలసిన అవసరం ఉన్నది.
వాస్తవానికి ఏ ప్రభుత్వ సంస్థకూ ప్రైవేటు పారిశ్రామికవేత్తలతో పోటీ పడే శక్తి లేదు. పైగా కేంద్రం మొగ్గు, ప్రేమ వారి వైపే ఉంటుంది. ప్రభుత్వ సంస్థలు నష్టాల పాలు కాకుండా కాపాడవలసిన కేంద్రం చేజేతులా వాటి గొంతు కోస్తున్నది. లాభాల్లో నడుస్తున్న కామధేను లాంటి సింగరేణి పొదుగును కోసి వ్యాపారులకు అప్పగించడం జనద్రోహమే అవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించదేమోనన్న భయంతో గతంలో తెలంగాణ బొగ్గు గనుల వేలం పాటకు చాలా సంస్థలు ముందుకు రాలేదు. ఇప్పుడా పరిస్థితి లేదు. మంత్రి కిషన్ రెడ్డి నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ఖండించిన వార్త రాలేదు. గత ప్రభుత్వం వలె నిరసననైనా తెలపలేదు. చివరికి తొలిసారిగా బిడ్డింగ్‌లో తమ భవిష్యత్తును సింగరేణి పరీక్షించుకోక తప్పదేమో. ప్రభుత్వం ముందుకురాని పక్షంలో ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాజకీయ ప్రతిపక్షాలు, సింగరేణి కార్మికులు ఐక్యమై సిరుల వెలుగుల సింగరేణిని కాపాడుకోవలసిన అవసరం ఉన్నది.
-బి.నర్సన్
94401 28169