మన దేశంలోని 100 కోట్ల మందికి కనీస ప్రాథమిక అవసరాలకు మించి కావలసిన వస్తువులను కొనుగోలు చేసే శక్తి లేదు. తమ సంతోషానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయలేక అటు సంతోషానికి, ఇటు దుఃఖానికి మధ్య వారు కొట్టుమిట్టాడుతున్నారు. ఇదీ మన దేశంలోని పరిస్థితి. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర విషయానికి వద్దాం. అరువై ఏండ్ల వలస పాలనలో తెలంగాణ ప్రాంత ప్రజల చేతులకున్న సంకెళ్లు రాష్ట్ర ఆవిర్భావంతో పటాపంచలయ్యాయి.
2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భవించడం, ఆ తర్వాత విజ్ఞులైన తెలంగాణ ప్రజలు రాష్ట్ర పాలనా పగ్గాలు ఉద్యమ సారథి కేసీఆర్‌కే అప్పగించడంతో రాష్ట్రంలో ఇటు అభివృద్ధి కార్యక్రమాలు, అటు సంక్షేమ పథకాలు జోడెడ్లలా పరుగులు తీశాయి. ‘మిషన్ కాకతీయ’ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులు పూడికతీత, మరమ్మతుల వంటి పనులతో చెరువులు కొత్తరూపును సంతరించుకున్నాయి. ఇదొక్కటే కాదు, ఇంటింటికీ నల్లా నీరు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, దళితబంధు, బీసీబంధు వంటి అనేక సంక్షేమ పథకాలు రైతు, బహుజనుల అభివృద్ధి కేంద్రంగానే అమలయ్యాయి. దీంతో ఉత్పత్తి కులాలకు ఉపాధి లభించింది. ఉదాహరణకు చేపపిల్లల పంపిణీని తీసుకుంటే… చేపలు పెద్దయ్యాక ముదిరాజు బిడ్డలు ఎప్పటికప్పుడు ఆ చేపలను వలవేసి పట్టుకుంటూ రోజువారీగా ఉపాధి పొందడం మనం చూశాం. గొల్లకుర్మలకు గొర్ల పంపిణీ వంటి కార్యక్రమాలతో ఏటికేడు వారికి ఉపాధి పెరుగుతూ వచ్చింది. ఇలా ఏ సంక్షేమ పథకం తీసుకున్నా… గత బీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ వర్గాలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపాధి కల్పిస్తూనే వచ్చింది.
వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు అందిస్తూ అండగా నిలిచింది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద ప్రజల చేతుల్లోనూ ఎంతోకొంత డబ్బు కనిపించింది. పేదల చేతుల్లో పైసలు చెలామణి అయ్యాయి. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం కొలువుదీరాక పైసక్కరువొచ్చింది. పైసలు కనపడక ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు.
పాలనపై కనీస అవగాహన లేని రేవంత్ రెడ్డి హయాంలో ప్రజల పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. అంతకుమించి అనక తప్పని పరిస్థితి. ఇందుకు కారణం ఒక్క ముక్కలో చెప్పాలంటే.. స్వపాలనలో తెలంగాణ సంపద ప్రజలకే చెందేది. ఢిల్లీ పాలకుల చేతుల్లో కీలు బొమ్మలైన కాంగ్రెస్ నాయకులు తెలంగాణ సంపదను ఇప్పుడు ఢిల్లీకి మూటలు మోస్తున్నారు. అందుకే తెలంగాణలో పైసక్కరువొచ్చింది. సుమారు పదకొండేండ్లుగా అధికారం లేక దోమలు కొట్టుకుంటున్న ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ ఒక ఏటీఎంలా మారింది.
కాంగ్రెస్ అంటే మొదట గుర్తుకువచ్చేది స్కీముల పేరిట చేసే స్కాములు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు ఏడాదిన్నర కావస్తున్నది. 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. వాటిని అమలుచేసేందుకు అష్టకష్టాలు, ఆపసోపాలు పడుతున్నది. ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు, స్కీములు అమలు చేయడానికి ఏం చేయాలో సర్కార్‌కు అంతుచిక్కడం లేదు.. సచివాలయం కింద లంకె బిందెల కోసం బుల్డోజర్లతో తవ్వుతూ వెతికిన రేవంత్ రెడ్డికి కనీసం ఖాళీ బింద్లైనా దొరకకపోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. అందుకే ఆయన ఖజానా ఖాళీ అయిందని మాటిమాటికి చెప్తూనే, సంపదను సృష్టించవచ్చనే విషయాన్ని మరిచిపోతున్నాడు.
ఖాళీ ఖజానాను నింపుకొనేందుకు కాంగ్రెస్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నది. ప్రభుత్వ పెద్దల కమీషన్లు, అధికార పార్టీ నేతల అక్రమ దందాలకు తోడు రేవంత్ రెడ్డి అవగాహనా రాహిత్యం, అర్థం పర్థం లేని విధానాలతో ప్రజల జేబులకు చిల్లులు పడ్డాయి. రేవంత్ రెడ్డి సర్కారు అసంబద్ధమైన చర్యలతో చేసేందుకు పనులు లేక, చేతిలో పైసలు లేక ప్రజలు అల్లాడుతున్నారు.
రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా కారణంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం ఘోరంగా పతనమైంది. కొత్త ప్రాజెక్టుల సంగతి దేవుడెరుగు, ఉన్నవాటిని ఊడగొట్టకుంటే చాలనే పరిస్థితి వచ్చింది. మహానగరం చుట్టుపక్కల ఉన్న ప్లాట్లన్నీ ముండ్ల కంపలతో నిండిపోయాయి. కొనేవారు లేక ఫ్లాట్లు బూజు పట్టిపోతున్నాయి. రియల్ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన బిల్డర్లు, రియల్టర్లు, నిర్మాణరంగ కార్మికులు మొదలుకొని సిమెంటు, ఇసుక, ఇటుక వంటి అనేక పరిశ్రమలు కుదేలయ్యాయి. వాటిలో పనిచేసే కార్మికులు చేతిలో చిల్లిగవ్వ లేక రోడ్డున పడ్డారు.
పైసలు లేక అక్కడక్కడా ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు దాపురిస్తున్నాయి. రియల్ రంగం ఒకటే కాదు, తెలంగాణలోని అన్ని రంగాల పరిస్థితి ఇంతే. పెట్టుబడి సాయం అందక, రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలుకాక, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. రైతన్నలు అప్పుల పాలవుతున్నారు. నేతన్నల సాంచల సప్పుడు ఆగిపోయి వారికి సైతం పైసక్కరువొచ్చింది. ఉచిత బస్సు కారణంగా ఆటో డ్రైవర్ల జేబులు ఖాళీ అయ్యాయి. ఆటో డ్రైవర్లు సైతం ఆత్మహత్యలకు పాల్పడటం కన్నీరు తెప్పిస్తున్నది. కనీసం ఆర్టీసీ అయినా బాగుపడిందా అంటే అదీ లేదు.
మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగింది తప్ప, ఆదాయం ఏ మాత్రం పెరగలేదు. ఉచిత బస్సు పథకం సొమ్మును చెల్లించేందుకు ప్రభుత్వానికి చేతులు రాకపోవడంతో ఆర్టీసీకి డీజిల్‌కు కూడా పైసలు ఎల్లడం లేదు. మినీ అంగన్వాడీ టీచర్లు, హోంగార్డులు, ఎక్సైజ్ సిబ్బంది మొదలుకొని అనేక శాఖల ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు సరిగా ఇవ్వడం లేదు. దీంతో ఆయా కుటుంబాలు నెలల తరబడి పస్తులుంటున్నాయి. ఇలా చెప్పుకుంటూపోతే రాష్ట్రంలోని ప్రజలది ఒక్కొక్కరిది ఒక్కో శర. అనేక వర్గాలు చేతిలో పైసలు లేక కొనుగోలు శక్తిని కోల్పోయి తిండికి నోచుకోవడం లేదు.
కేసీఆర్ హయాంలో పదేండ్ల పాటు తెలంగాణ ఖజానా నిండుకుండలా తొణికిసలాడింది. కానీ, రేవంత్ రెడ్డి అసమర్థత కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది. రిజిస్ట్రేషన్ సహా అనేక శాఖల రాబడి తగ్గిపోయింది. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ అట్టడుగున నిలిచింది. కేసీఆర్ పాలనలో ఇతర దేశాలతో పోటీపడిన తెలంగాణ… ఇప్పుడు మన దేశంలోని చిన్న చిన్న రాష్ర్టాలతో కూ డా పోటీ పడలేని దుస్థితికి చేరింది. రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న విధానాలను చూస్తుంటే తెలంగాణ ఖజానా, వ్యాపారుల గల్లా పెట్టెలు, ప్రజల చేతుల్లో పైసలు ఇక ఎప్పటికీ కనపడవేమోనని అనిపిస్తున్నది.
ఖాళీ ఖజానాను నింపుకొనేందుకు కాంగ్రెస్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నది. ప్రభుత్వ పెద్దల కమీషన్లు, అధికార పార్టీ నేతల అక్రమ దందాలకు తోడు రేవంత్ రెడ్డి అవగాహనా రాహిత్యం, అర్థం పర్థం లేని విధానాలతో ప్రజల జేబులకు చిల్లులు పడ్డాయి. రేవంత్ రెడ్డి సర్కారు అసంబద్ధమైన చర్యలతో చేసేందుకు పనులు లేక, చేతిలో పైసలు లేక ప్రజలు అల్లాడుతున్నారు.