‘ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని’ అంటారు. నిజమే రైతు బాగుంటేనే రాష్ట్రమైనా, దేశమైనా సుభిక్షంగా ఉంటుంది. సమైక్య పాలనలో తెలంగాణ రైతాంగం, వ్యవసాయం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. అప్పులు, ఆకలిచావులు, ఆత్మహత్యలు నిత్యం వార్తల్లో పతాక శీర్షికలయ్యేవి. కేసీఆర్ సీఎం అయ్యాక రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతోపాటు ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల ఉచిత విద్యుత్తు వంటివి వ్యవసాయాన్ని పండుగలా మార్చాయి.
2023లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక హామీలన్నింటినీ తుంగలో తొక్కింది. రుణమాఫీ బూటకమని తేలిపోయింది. రుణమాఫీ పేరుతో ప్రభుత్వం నెరిపిన డ్రామాకు ఎంతోమంది రైతులు బలయ్యారు. ఇంకా అవుతున్నారు. 40 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. రూ. 2 లక్షలపైన రుణముంటే ఆ పైన ఉన్నదాన్ని చెల్లిస్తే రుణమాఫీ చేస్తామని చెప్పడంతో రైతులు అప్పు తెచ్చి మరీ బ్యాంకులకు కట్టారు. కానీ, వారికి మాఫీ కాకపోగా, రుణమాఫీ పూర్తయిందని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించడంతో ప్రభుత్వంపై రైతులు దుమ్మెత్తి పోస్తున్నారు. అలాగే, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని మాట తప్పారు. ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు కూలీల ఖర్చు తగ్గుతుంది. కూలి రేట్లు ఉపాధి హామీ వేతనం కంటే ఎక్కువ ఉంటే రైతులు చెల్లించుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఆ దిశగా కాంగ్రెస్ సర్కార్ ఆలోచన చేయకపోవడం హేయం.
ధాన్యం టెండర్లలో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నది. అవినీతి జరిగిందని కోర్టుకు వెళ్తే కౌంటర్ వేసేందుకు కూడా ప్రభుత్వం జంకుతున్నది. దీనిని బట్టి రేవంత్‌రెడ్డి పాలన ఎలా ఉన్నదో ఊహించుకోవచ్చు. రైతు పండించిన ప్రతీ పంటకు బోనస్ చెల్లిస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్ ఇప్పుడు ఒక్క వరికి మాత్రమేనని, అది కూడా సన్నవడ్లకే ఇస్తామని చెప్తూ బోనస్‌ను బోగస్‌గా మార్చింది. ఆ డబ్బులను కూడా రైతులకు పూర్తిగా చెల్లించలేదు. రాష్ట్రవ్యాప్తంగా 86,40,000 క్వింటాళ్లకు సంబంధించి 432 కోట్ల రూపాయల బోనస్ డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే రైతులకు రూ. 89 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. వ్యవసాయ యాంత్రీకరణ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.
అకాల వర్షాలకు పంటలు నష్టపోతే కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం అందించింది. ఇప్పుడు కనీసం పట్టించుకునే వారే కరువయ్యారు. రాష్ట్రంలో పత్తి దిగుబడి 30 శాతంలోపే ఉన్నది. వరి దిగుబడి కూడా తగ్గింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం అటువైపు చూడకపోవడంతో రైతుల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఏఐసీసీ అధ్యక్షురాలి హోదాలో వరంగల్ ఉమ్మడి జిల్లా ఆరెపల్లి గ్రామంలో సోనియా మాట్లాడుతూ This is not Telangana region This is SUCIDE boul of India అని అభివర్ణించారు. ఇప్పుడు వారి పాలనలో తెలంగాణ అచ్చం అలాగే ఉన్నది. అప్పట్లో ఆత్మహత్యల తెలంగాణగా ఉన్న రాష్ర్టాన్ని కేసీఆర్ పదేండ్లలో ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’గా మార్చారు.
రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రుల మాటలకు పొంతన ఉండటం లేదు. చివరికి ఓ వాయిదాల పార్టీగా కాంగ్రెస్ మారిపోయింది. పదే పదే మాటలు మార్చడంతో ప్రజల్లో నమ్మకం కోల్పోయింది. రాష్ట్రంలోని మిర్చి రైతుల పరిస్థితి కూడా దారుణంగా ఉన్నది. హార్టికల్చర్ పంటలకు ఆదరణ కరువైంది. గత పదేండ్లలో శాస్త్రీయ కోణంలో పక్కా ప్రణాళికలతో రైతాంగాన్ని, వ్యవసాయాన్ని ముందుకు నడిపారు కేసీఆర్. బీఆర్ఎస్ పాలనలో గ్రామస్థాయిలో ఏఈవోల నియామకం, రైతు వేదికల నిర్మాణం, శిక్షణ, హార్టికల్చర్ యూనివర్సిటీల మంజూరు, పరిశోధనలు, గిట్టుబాటు ధరల కోసం నిత్యం సమీక్షలు జరిగేవి. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో అంతా అస్తవ్యస్తంగా తయారైంది.
వ్యవసాయ మార్కెట్లలో దోపిడీ వ్యవస్థ మళ్లీ తెరపైకి వచ్చింది. పలు మార్కెట్లలో ఇటీవల వ్యవసాయ అధికారుల సస్పెన్షన్లనే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన వరంగల్ ఎనుమాముల మార్కెట్లో అధికారిపై సైతం చర్యలు తీసుకోవడం చూస్తుంటే మార్కెట్లలో రైతులపై దోపిడీ ఏ విధంగా కొనసాగుతున్నదో గమనించవచ్చు. కాంగ్రెస్ పాలనలో ఖమ్మం, వరంగల్ మార్కెట్లలో రైతుల ఆందోళనలు చూస్తున్నాం. మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో కంది రైతులు, మహబూబ్‌నగర్‌లో వేరుశనగ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పత్తిపంట విషయంలో కొనుగోలు కేంద్రాలను సీసీఐ ఏర్పాటు చేయడంలో జాప్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. మంత్రుల పర్యవేక్షణ కూడా లేకపోవడంతో ప్రైవేటు మార్కెట్లను రైతులు ఆశ్రయిస్తున్నారు.
రైతులు ఆందోళనలకు దిగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను, ప్రజలను ఏమారుస్తున్నది. ఒక పథకం అమలైనట్టు చూపించి మరో పథకం ద్వారా రైతులను నష్టపరిచే చర్యలు చేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 420 రోజుల్లో 423 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి పాలన చూస్తుంటే నాడు సమైక్య పాలనలో సోనియాగాంధీ అన్న మాటలు గుర్తొస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఏఐసీసీ అధ్యక్షురాలి హోదాలో వరంగల్ ఉమ్మడి జిల్లా ఆరెపల్లి గ్రామంలో సోనియా మాట్లాడుతూ This is not Telangana region This is SUCIDE boul of India అని అభివర్ణించారు. ఇప్పుడు వారి పాలనలో తెలంగాణ అచ్చం అలాగే ఉన్నది. అప్పట్లో ఆత్మహత్యల తెలంగాణగా ఉన్న రాష్ర్టాన్ని కేసీఆర్ పదేండ్లలో ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’గా మార్చారు. దేశంలో పంజాబ్, హర్యానా ల్లాంటి అత్యధిక ధాన్యం పండించే రాష్ర్టాల కంటే అత్యున్నత స్థానంలో తెలంగాణను నిలిపారు. రాష్ర్టాన్ని ధాన్యాగారంగా మార్చిన ఘనత కేసీఆర్‌దే.
కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్‌ను చూసి రైతులు ఎంతో ఆశపడ్డారు. కానీ, ఆ పార్టీ విధానాలు, హామీల ఎగవేతలతో వారు మోసపోయారు. అప్పులు, ఆర్థిక భారాన్ని మోయలేక, హామీలు అమలు కాక రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రుణమాఫీ, రైతుభరోసా, కౌలు రైతు భరోసా, రైతు కూలీ సాయం, బోనస్ వంటివన్నీ పెద్ద బోగస్‌గా మిగిలిపోయాయి.
కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు చీదరించుకునే పరిస్థితి వచ్చింది. వరంగల్ పర్యటనకు వస్తే రైతులు నిలదీస్తారన్న భయంతో రాహుల్‌గాంధీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ రోజు కాకపోతే రేపైనా కాంగ్రెస్‌పై తిరుగుబాటు తప్పదు. ఇటీవల నర్సంపేటలో 179 గ్రామ పంచాయతీల రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఇదే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రమంతా నెలకొన్నది. గ్రామాల్లోకి కాంగ్రెస్ నాయకులు రాకుండా మున్ముందు గ్రామ పొలిమేరల్లో ము ళ్ల కంచెలు వేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి అబద్ధాలు, వాయిదాలు మానేసి రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పి ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేయాలి. లేనిపక్షంలో ఇకపై వచ్చే ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు కర్చు కాల్చి వాత పెట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.