‘ముందుదగా, వెనుక దగా, కుడి ఎడమల దగా దగా!’ అనుభవిస్తున్న శ్రామికవర్గం మన రైతాంగం. రైతులకు పెట్టుబడి దక్కని పంట మాత్రం మార్కెట్లో దళారులకు సిరుల పంట పండిస్తున్నది. సంచెడు కూరగాయలకు పది గిట్టనిది బజార్లో కిలోకు వందవుతుంది. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో వ్యాపారులు రైతును నిలువు దోపిడీ చేస్తున్నారు. వీటి బారి నుంచి రైతన్నను కాపాడలేని అశక్త ప్రభుత్వాలు రాయితీల కంటితుడుపుతో బుజ్జగిస్తున్నాయి.
నిజానికి రుణమాఫీ అనేదానికి లక్ష పరిమితి చాలు. ఆపై తీసుకునేవారికి కొం త మెరుగైన పరిస్థితే ఉంటుంది. అందుకోసం రూ.లక్ష రుణమాఫీ కోసమైనా పీఎం కిసాన్ నిబంధనలను సడలించి, తెల్ల రేషన్ కార్డు అర్హతను తొలగించాలి. రూ.నలభై, యాభై వేల అప్పు ఉన్నవాళ్లకు కూడా ఈ నిబంధనల వల్ల మాఫీ వర్తించకపోవడం శోచనీయం.
ఆ ఓదార్పునకు కూడా గండి కొడితే రైతు బాధ వినేదెవరు? లేస్తే చేను చెలకల్లో పొద్దు గడిపేవారికి లోకం పోకడలు తెలియవు. సంఘాలు, ఆందోళనలు తెలియ వు. రోడ్డెక్కి న్యాయాన్ని అడిగే తీరు తెలియ దు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తామని చెప్పిన పంట రుణం సొమ్ము బ్యాంకు ఖాతాలో పడకున్నా దిక్కుతోచని స్థితిలో బెంగ పడుతున్నారు. జవాబు చెప్పే నాథు డు లేక చేష్టలుడిగి కూచున్నారు. రుణమాఫీ అయిపోయింది కదా అన్నట్టే చేతులు దులుపుకొన్నా పాత లెక్కలు ముందేసి ప్రభుత్వాన్ని నిలదీసేవారు కరువయ్యారు.
నేను ఈ మధ్య ఇదే అంశంపై రాసిన వ్యాసాలను చూసిన రైతులు పదుల సంఖ్య లో తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. ‘మా అమ్మకు డిపెండెంట్ పింఛన్ వస్తుంది. రేష న్కార్డులో ఆమెతో పాటు మా పేరున్నది. పంట అప్పు కాలేదు. ఆమెను అడుక్కోవాలా?’ ఒక రైతు అన్నాడు. ‘నాకు పెండ్లయినా మా ఇంటి రేషన్ కార్డులోనే నా పేరున్నది. మా ఆయనకు భూమి లేదు. మా తల్లిగారిచ్చిన భూమిపై లోను తీసుకున్నాను. మాఫీ కాలేదు’ అని ఓ బాధపడింది. ఇలాంటి ఉదంతాలెన్నో ఉం టాయి. అందరికీ పంట రుణం మాఫీ చేస్తామని గద్దెనెక్కిన పొంతనలేని కిసా న్ సమ్మాన్ నిబంధనలను తెచ్చి మా కొంప ముంచడమేమిటని రాష్ట్ర రైతాంగం కుమిలిపోతున్నది.
అయితే, దీన్ని ఇలాగే వదిలేయాలా ఇదేం అన్యాయమని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం 35 లక్షల రైతు ఖాతాల్లో రూ.16,144 కోట్లను జమ చేసింది. అదేవిధంగా 2018లో 36.68 లక్షల రైతులకు లక్షలోపు రుణమాఫీ కోసం రూ.19,198 బ్యాంకులకు చెల్లించిం ది. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష లోపు రైతు రుణ మాఫీగా కేవలం 11.5 లక్షల రైతుల కోసం రూ.6,098 కోట్లు బ్యాంకుల్లో జమచేసింది. లక్షన్నర అప్పు మాఫీ కోసం రూ.6,190 కోట్లు విడుదల చేసింది. బ్యాంకుల లెక్కల ప్రకారమైతే ఏడాది మార్చి నాటికి పంట రుణాల మొత్తం రూ.64,940 కోట్లు ఉన్న ట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం నిర్ణయించిన కటాఫ్ తేదీ 2023, డిసెంబర్ 9 వరకు తీసుకున్నా రూ.49,500 కోట్లు తెలంగాణ రైతు లు బ్యాంకుల్లో చెల్లించాలి. ఇందులో అగ్రి గోల్డ్ లోన్లు తీసేస్తే కనీసం రూ.39,000 కోట్లయినా అసలైన పంట రుణాలు ఉండే అవకాశం ఉన్నది. మొదట ప్రభుత్వం కూడా ఇదే మాటన్నది. క్రమంగా మాఫీ మొత్తం తగ్గుతూ వచ్చింది. మూడు విడతల రుణమాఫీలో లబ్ధి కుటుంబాల సంఖ్య 35,49,870 కాగా, వారికి మాఫీ చేస్తున్న సొమ్ము రూ.24,449 కోట్లు అని వ్యవసా యశాఖ ఈ నెల 1న తేల్చింది. అంటే రుణమాఫీ సినిమాకు శుభం కార్డు పడ్డట్టే.
ఈ విషయంపై స్పందిస్తూ రుణమాఫీపై ప్రభుత్వం విధించిన నిబంధనల కారణంగా 70 శాతం రైతులకు మాత్రమే మాఫీ వర్తించిందని, దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. నష్టపోయిన అన్నదాతలు తమ కష్టాలు ఒక మొబైల్ నెంబ ర్ కూడా తెలిపారు. అయితే కాల్ చేసినా ఆ బిజీ వస్తున్నది. అందులో ఏదో మతలబు ఉండొచ్చు. కొత్త రైతు చట్టాలతో దేశంలోని రైతులను, వారి పంటలను, భూములను బడా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేయడానికి సిద్ధపడి, భంగపడిన బీజేపీ మన రైతులకు మేలు చేస్తుందని ఆశించలేం. బీఆర్ఎస్ నేతలు మాఫీ తొలి ప్రకటన నుంచే మాఫీ తప్పుల తడక అంటూ, మాఫీ అందని రైతుల గొంతును వినిపిస్తున్నారు. రైతు సంఘాలు, వేదికలు ప్రభుత్వ చర్యను ఖండించడం తప్ప ఎలాంటి కార్యాచరణను చేపట్టినట్టు లేదు. ఒక్క అసెంబ్లీ సీటుతో సీపీఐ మురిసిపోతూ బాధలను పట్టించుకోకుండా కాంగ్రెస్ వెంట తోకాడిస్తూ తిరుగుతున్నది.
అంతా అయిపోయింది అన్నట్టు ప్రవర్తిస్తున్న ప్రభుత్వాన్ని మీ హామీ ఏమిటి, ఈ నిబంధనలు ఏమిటి? అని అడిగేవారు కావాలి. 2014, 2018లో మాఫీ లభించిన వారిలో ఈసారి మాఫీ వర్తించని వారెందరో గ్రామాలవారీగా సమాచారం సేకరించాలి.
రైతు బృందాలతో కలిసి విపక్షాలు ఆయా ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రుల వద్దకు వెళ్లి రాతపూర్వక నివేదనలివ్వాలి. మాఫీ సాధన సమితిని ఏర్పాటుచేసి రైతుల పక్షాన నిలబడాలి. రూ.2 లక్షల దాకా రుణమాఫీ ఇస్తున్నందువల్ల నిధుల కొరతతో ఈ నిబంధనలు పెట్టవలసి వచ్చిందని ప్రభుత్వం నోట అనిపించాలి.
నిజానికి రుణమాఫీ అనేదానికి లక్ష పరిమితి చాలు. ఆపై తీసుకునేవారికి కొం త మెరుగైన పరిస్థితే ఉంటుంది. అం దుకోసం రూ.లక్ష రుణమాఫీ కోసమైనా పీఎం కిసాన్ నిబంధనలను సడలించి, తెల్ల రేషన్ కార్డు అర్హతను తొలగించాలి. నలభై, యాభై వేల రూపాయల అప్పు ఉన్నవాళ్లకు కూడా ఈ నిబంధనల వల్ల మాఫీ వర్తించకపోవడం శోచనీయం. తక్కువ రుణ పరిమితినో, భూ పరిమితినో దృష్టిలో పెట్టుకొని చిన్న, సన్నకారు రైతులకైనా ప్రభుత్వం మాఫీ వర్తింపజేస్తే ఆ లక్ష్యం నిజంగా నెరవేరినట్టవుతుంది.
-బి.నర్సన్
94401 28169