‘ప్రాణాలకు తెగించి, తెలంగాణ ను తెచ్చి, ప్రగతిపథాన పరుగెత్తిస్తున్న బీఆర్ఎస్’, ‘ఎన్నో బలిదానాల తర్వాత, కేసీఆర్ ఆమరణ దీక్షతో తప్పనిసరై తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్’, ‘విభజన హామీ ప్రకారం తెలంగాణకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా తెలంగాణకొచ్చిన పెద్ద ప్రాజెక్టులను గుజరాత్‌కు తరలించుకువెళ్లి, సింగరేణిని కూడా తెగనమ్మజూస్తున్న బీజేపీ’. తెలంగాణ పట్ల ప్రేమగల ఉత్తమ పార్టీ మాదే, మాకే ఓటేయమంటున్నయ్. ఇం తకూ ఏది ఉత్తమ పార్టీనో? ఏ పార్టీని ఎన్నుకోవాలో ఈ వ్యాసంలో విశ్లేషిద్దాం.
‘జ్ఞానమే విముక్తి మార్గమని’ ఆదిశంకరుడు, ‘జ్ఞానాన్ని మించిన శక్తి లేద’ని భగవద్గీతలు చెప్తున్నయి. కాబట్టి ‘సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిజ్ఞానంతో పాటు ప్రజల పట్ల అపార ప్రేమ కలిగిన నాయకుని పార్టీయే ఉత్తమ పార్టీ’ అని చరిత్ర రుజువు చేసింది. నిరంతర పరిశీలన, అన్వేషణ, అధ్యయనాలు అలాంటి నేతను రూపొందిస్తయి. అలాంటి నేతలే సమాజాన్ని సంస్కరిస్తారు, దేశాన్ని పరిగెత్తిస్తారు. ఉదాహరణకు వాషింగ్టన్, సైమన్ బొలీవర్, అబ్రహాం లింకన్, మార్క్స్, ఏంగెల్స్, లెనిన్, స్టాలిన్ గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, మావో, డెంగ్ సియావ్ పింగ్, చులలోంగ్ కోర్న్ వంటి నేతలంతా నిరంతర అధ్యయనశీలురే. ఒక్క మాటలకు చెప్పాలంటే సజీవ గ్రంథాలయాలు. అలాంటి మరో గ్రంథాలయమే తెలంగాణ పిత కేసీఆర్. చులలోంగ్ కోర్న్, నెహ్రూ, డెంగ్ సియావో పింగ్, కేసీఆర్‌లవి వ్యవసాయ దేశాలే.
వ్యవసాయక దేశాల మెజారిటీ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. కాబట్టి వ్యవసాయాభివృద్ధి ద్వారా వాళ్ల కొనుగోలు శక్తిని (ఆదాయాలను) పెంపొందిస్తే, పరిశ్రమలు, వాటిద్వారా ఉద్యోగాలు, తద్వారా విద్యావంతులు పెంపొందుతారు. వ్యవసాయక దేశ సర్వతోముఖాభివృద్ధికి వాళ్లు రూపొందించుకున్న ప్రణాళిక ఇదే.
ఉదాహరణకు… 1810లో థాయ్‌లాండ్ గద్దెనెక్కాడు 15 ఏండ్ల యువరాజు చులలోంగ్కోర్న్. ఐదేండ్ల పాటు అతను దేశదేశాల పాలనా విధానాలు, ప్రగతి మార్గాలను అధ్యయనం చేసి 1820 నుంచి వ్యవసాయక థాయ్‌లాండ్‌ను, పారిశ్రామిక దేశంగా రూపొందించే కృషిని ప్రారంభించాడు. నేడు కేసీఆర్ అడవులను కాపాడుకుంటూనే పోడు భూములకు పట్టాలిచ్చినట్టు.. తన రాజ్యంలోని అడవులను మినహాయించి, తక్కిన సాగు భూములన్నింటికీ రైతుల పేరిట పట్టాలిప్పించాడు. పంట కాలువలు తవ్వించి సాగునీటి ద్వారా గణనీయ వ్యవసాయాభివృద్ధిని, తద్వారా పారిశ్రామికాభివృద్ధి సాధించాడు.
ఐదేండ్ల పాటు చైనా బడ్జెట్లో 90 శాతం నిధులను వ్యవసాయ రంగానికి కేటాయించి గణనీయ వ్యవసాయాభివృద్ధినీ, తద్వారా అద్భుత పారిశ్రామిక ప్రగతితో చైనాను సూపర్ పవర్‌గా తీర్చిదిద్దాడు డెంగ్ సియావ్ పింగ్. పై నేతలందరినీ అధ్యయనం చేసిన పరిణత నేత కేసీఆర్. ప్రజల పట్ల అపార ప్రేమ ఉన్నందునే కేసీఆర్ ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చారు. అపార జ్ఞానశక్తితోనే మిషన్ కాకతీయ, నిరంతర విద్యుత్తు సరఫరా ద్వారా వ్యవసాయాభివృద్ధిని, తద్వారా గణనీయ పారిశ్రామికాభివృద్ధిని సాధించారు. గత 60 ఏండ్ల పాలనలో అట్టడుగున ఉన్న తెలంగాణ వ్యవసాయ, పారిశ్రామిక, విద్య, వైద్య, ఆధ్యాత్మిక, పర్యాటక, పర్యావరణ, పాలనా రంగాలలో తలసరి ఆదాయ సాధనలో అగ్రరాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ కేవలం తొమ్మిదేండ్లలో తీర్చిదిద్దారు.
బీఆర్ఎస్ ముందుచూపుతో చేపట్టిన మరో విశిష్ఠ కార్యక్రమం ‘అడవుల పునరుద్ధరణ’. ప్రాణుల మనుగడ కోసం వాతావరణ కాలుష్యాన్ని హరించి వర్షాలు కురిపించేందుకు భూ భాగంలో 33 శాతం అడవులను ప్రసాదించింది ప్రకృతి. ఈ సమతూకాన్ని కాపాడుకుంటేనే ప్రాణులకు భద్రత. ఈ జ్ఞానం లేని రాజకీయ వ్యాపారుల పాలనలో అడవులు 18.3 శాతానికి పతనమయ్యాయి. ఈ నష్ట నివారణ ఆవశ్యకతను గుర్తించారు కేసీఆర్. అటవీ పునరుద్ధరణకు పూనుకొని తొమ్మిదేండ్లలో 9 శాతం అడవులను పునర్నిర్మించింది బీఆర్ఎస్. అంతేకాదు, దీన్ని నిత్యకృత్యంగా రూపొందించారు. గ్రామ, గ్రామానికీ, ఇంటింటికీ, మొక్కలందేలా రాష్ట్రవ్యాప్తం గా నర్సరీలను పెంచుతున్నారు. ‘గ్రీన్ చాలెంజ్’ పేరిట తెలంగాణలోనే కాదు, ఇతర రాష్ర్టాల్లోనూ విరివిగా మొక్కలు నాటిస్తున్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాజధాని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. అదే మోదీ బీజేపీ పాలనలో భారతదేశ రాజధాని ఢిల్లీ, ప్రపంచాగ్ర కాలుష్యనగరంగా అపఖ్యాతి పాలైంది.
బీజేపీ, బీఆర్ఎస్లది అంతర్గత మైత్రి అని తెగ ఊదరగొడుతున్నారు. ఆ పార్టీపై దాడులు ఆగటం, బీజేపీపై బీఆర్ఎస్ పల్లెత్తు మాటనకపోవటమే అందుకు నిదర్శనం అంటున్నది కాంగ్రెస్. ఈ అనుమానాన్ని రేకెత్తించి బీఆర్ఎస్కు దన్నుగా ఉన్న ముస్లిం ఓటర్లను తమ వైపుకు మళ్లించుకోవాలన్నదే కాంగ్రెస్ కుయుక్తి.
కాంగ్రెస్, బీజేపీలు తమ అబద్ధపు మాటలద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా తెలంగాణ ప్రగతి సాధన కోసం తమ విధానాలేమిటో ప్రకటించి ఓటర్లను ఆకర్షించాలి. అంతేకానీ మోదీ నుంచి ఈటెల దాకా బీజేపీ నేతలు, రాహుల్ నుంచి రేవంత్ దాకా కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌ను గద్దె దించటమే మా లక్ష్యం అంటున్నారు. అదే బీఆర్ఎస్ పార్టీ ‘వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధిని, తద్వారా తెలంగాణ సర్వతో ముఖాభివృద్ధిని సాధించటం, ప్రభుత్వరంగ సంస్థల్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించటం మా విధాన’మని గత తొమ్మిదేండ్లుగా అచరించి చూపించింది కూడా. అందుకే బీఆర్ఎస్సే ఉత్తమ పార్టీ. తెలంగాణ ప్రజలు మరోసారి ఎన్నికోవలసింది బీఆర్ఎస్ పార్టీనే. వన్స్ మోర్ బీఆర్ఎస్.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
-పాతూరి వెంకటేశ్వరరావు
98490 81889