ఈనాడు మనదేశంలో యువతను పట్టి పీడిస్తున్న రెండు ప్రధాన సమస్యల్లో ఒకటి నిరుద్యోగ సమస్య, మరొకటి ఉపాధి అవకాశాలు లేకపోవటం. ఈ రెండు మనిషి గౌరవంగా తలెత్తుకొని బతకటానికి కావాల్సిన కనీస అవసరాలు. ప్రపంచంలో నేడు ఏ దేశానికీ లేనంత యువశక్తి భారతదేశానికి ఉన్నది. వారిలో ఉన్నత చదువులు చదివిన లక్షలమంది నిరుద్యోగులుగా, ఉపాధి అవకాశాలు లేక బాధపడుతున్నారు.
ప్రధాని మోదీ తొమ్మిదేండ్ల పాలనలో 2023 జూలై నాటికి కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం నిరుద్యోగిత రేటు పెరుగుతూ పోయింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ప్రకారం నేటికి దేశంలో నిరుద్యోగిత రేటు 7.95 శాతంగా ఉన్నది. పట్టణ ప్రాంతంలో 7.93, గ్రామీణ ప్రాంతంలో 7.44 శాతంగా ఉన్నది.
చదువుకున్న యువత ఒకవైపు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకక, వయసు మీద పడటంతో పెండ్లిండ్లకు దూరమవుతున్నారు. పెండ్లయినవారు కుటుంబాలను పోషించలేక ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అవమానాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాస్తవం ఇలా ఉంటే మోదీ మూఢభక్తులు మాత్రం అంతా సక్రమంగా, ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌తో కొనసాగుతుందంటూ సోషల్ మీడియా గ్రూపుల్లో నీరాజనాలు అర్పిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వంలోని, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలు, ఆర్బీఐ, ప్రైవేటు పరిశోధనా సంస్థలు, అంతర్జాతీయ సంస్థ ల నివేదికలు ప్రకటించిన గణాంకాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. మోదీ వర్గం ప్రచార వ్యూహంలో పడిపోయి, నిత్యజీవితం లో ఎదురయ్యే యువతీ, యువకుల నిరుద్యోగ, ఉపాధి సమస్యలను కండ్లారా చూస్తూ కూడా మోదీని ఆరాధించటం. ఆయన పాలనకు వంత పాడటం విచిత్రం.
పార్లమెంటులోగానీ, మన్ కీ బాత్లోగానీ, ఎన్నికల ప్రచార సభల్లో కానీ మోదీ చేసే ప్రసంగాల్లో దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను ఎక్కడా ప్రస్తావించరు. దేశం ఎదుర్కొనే ప్రతి కీలక సమస్యపై మోదీ మౌనం దాల్చుతారు. దేశ సమైక్యతకు, సమగ్రతకు ఎంతమాత్రం పనికిరాని,అవసరంలేని హిందూత్వం, హిందూ మతోన్మాదం వంటి అంశాలలో, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉపన్యాసాలు ఇస్తారు. దేశ ఆర్థిక పురోగతికి ఉద్యోగ, ఉపాధి రంగాలే కీలకం. గతంలోఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో దేశంలో నిరుద్యోగం 47 ఏండ్ల గరిష్ఠానికి చేరుకున్నది. 18-25ఏండ్ల లోపు పట్టభద్రుల్లో నిరుద్యోగిత గణాంకాలు చూస్తే ఏకంగా 42 శాతానికి చేరుకున్నది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాలలో ఎక్కడ చూసినా నిరుద్యోగం, ఉపాధి కొరత విలయ తాండవం చేస్తున్నది. ఉన్నత చదువులు చదివిన వారికి వృత్తినైపుణ్యాలు కొరవడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో నూతన పెట్టుబడులు తిరోగమనంలో ఉన్నాయి.
ముఖ్యంగా డీమానిటైజేషన్ ప్రభావం నేటికీ కనిపిస్తున్నది. 65 శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగంలో పేలవమైన ఉత్పాదకతను చూపిస్తుంది. ధనికులు మాత్రం విదేశీ బాట పడుతున్నారు.‘తమకు ఉపాధి దొరకదని నిరాశతో యువత కనీసం పేపర్లలో వచ్చే ఉద్యోగ ప్రకటనలకు దరఖాస్తులు కూడా చేసుకోవడంలేదు. అంతగా యువతను మానసిక కుంగుబాటుకు గురిచేసింది ఈ కేంద్ర ప్రభుత్వం’అని ‘అజీజ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ’ కి చెందిన సెంటర్ ఫర్ సస్టెయినబుల్ ఎంప్లాయిమెంట్ సంస్థ చేసిన సర్వే నివేదిక వెల్లడించింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాను విడుదల చేసిన ప్రకటనలోనూ ఈ సమస్య తీవ్రతను వెల్లడించింది. అయినా కేంద్ర ప్రభుత్వానికి నిరుద్యోగ యువతపై చీమకుట్టినట్టు కూడా స్పందన లేదు. ఎన్నికల సమయంలో ఏడాదికి రెండు కోట్ల కొత్త ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేశారు. ఈ లెక్కన ఇప్పటికే 18 కోట్ల ఉద్యోగాలు రావాలి.
2014 నాటికి 389 ప్రభుత్వరంగ సంస్థల్లో 16.9 లక్షల ఉద్యోగులు ఉంటే, 2022 నాటికి ఆ సంఖ్య 14.6లక్షలకు తగ్గింది. ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీలతో పాటు ఇతర బడా కార్పొరేటు సంస్థలకే కట్టబెట్టడంతో ఉన్న ఉపాధి అవకాశాలు కూడా మాయమయ్యాయి. మన ప్రధాని మోదీ తన శక్తి యుక్తులన్నీ కార్పొరేట్ వర్గాల ఎదుగుదలకే వినియోగించారు. వారి అడ్డగోలు వ్యాపార దోపిడీకి, మోసాలకు వెన్నుదన్నుగా, అండగా నిలిచారు.
మనదేశ నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టాలంటే, కనీసం ఏటా 80 లక్షల చొప్పున కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం ఉంటుందని ప్రపంచ బ్యాంకు నివేదిక గతంలోనే వెల్లడించింది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయాలని, ఉపాధి హామీ చట్టానికి నిధులు అధికంగా కేటాయించాలని దేశ,విదేశీ ఆర్థిక రంగ నిపుణులు సూచించినా మోదీ ప్రభుత్వం లక్ష్యపెట్టదు. అలాంటి సలహాలు ఇచ్చిన ఆర్బీఐ ఉన్నత శ్రేణి అధికారులు ఇంటిదారి పట్టారు.
మోదీ దృష్టి మొత్తం మీడియా కవరేజీ పై మాత్రమే ఉంటుంది. ఎవరైనా దేశం ఎదుర్కొనే సమస్యలపై ప్రశ్నిస్తే వారంతా దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్లు, పాకిస్తానీ ఏజెంట్లు అని ముద్ర వేస్తారు. వారిని జైళ్లలో వేసి అక్రమ కేసులు పెడుతారు. ప్రభుత్వ ఉద్యోగులు, దర్యాప్తు సంస్థలు సకల స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలూ, బీజేపీ చెప్పుచేతల్లో నడవాల్సిందే. రాబోయే ఎన్నికల్లో యువతరం, దేశ ప్రజలు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ ,బీసీ,మైనారిటీ పేద ప్రజలు, మధ్యతరగతి వర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. విజ్ఞత, వివేచన, విచక్షణతో ఓటు వేసే బాధ్యత వారికే వదిలేయాలి.
-కోలాహలం రామ్‌కిశోర్
98493 28496