(నవంబర్ 29న కేసీఆర్ దీక్షా దివస్ సందర్భంగా…)
అది కరీంనగర్, తీగలగుట్టపల్లెలోని కేసీఆర్ భవన్.. 2009 నవంబర్ 29వ తేదీ. ఒకవైపు దేశవ్యాప్తంగా ఉత్కంఠ.. మరోవైపు ఏం జరుగుతుందోనన్న ఆతృత.. కేసీఆర్ భవన్ చుట్టూ జరిగే ప్రతి కదలికను 24 గంటలు డేగకళ్లతో చూస్తున్న నాటి ప్రభుత్వం.. గుక్క తిప్పుకోకుండా పోటాపోటీగా లైవ్ ప్రసారాల కొనసాగింపు.. ఇసుకేస్తే రాలనంత పోలీసు బలగాల మోహరింపు.. నలుదిశలా కదిలివచ్చిన ప్రజలు.. వీటి మధ్య ఇంట్లో నుంచి కేసీఆర్ బయటకు వచ్చారు. ఒక్కసారిగా జై కేసీఆర్ అంటూ పిడికిలెత్తిన జనాలు.. నినదించిన కళాబృందాలు.. చుట్టూ రక్షణ కవచంలా నిలిచిన ప్రజలు.. వీర తిలకం దిద్దిన మహిళలు.. ప్రజల అభిమానానికి శిరసు వంచి రెండు చేతులతో నమస్కరించిన ఉద్యమ వీరుడు.. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అంటూ ఉద్వేగభరితంగా ఇచ్చిన నినాదం మధ్య విజయ సంకేతాన్ని చూపిస్తూ.. గమ్యాన్ని ముద్దాడేందుకు కేసీఆర్ బయలుదేరారు.
చుట్టూ పోలీసు జీపులు.. ముందూవెనకా కిలోమీటర్ల పొడవునా ప్రజల పరుగులు.. కేసీఆర్ భవన్ నుంచి మానేరు బ్రిడ్జి వరకు కేసీఆర్‌ను దీక్షకే సాగనంపుతున్నట్లుగా నటించిన పోలీసులు అక్కడికి రాగానే సీన్ మార్చి.. కేసీఆర్ వాహనాన్ని మాత్రమే ముందుకు పోనిచ్చారు. ఆ వెంటే అల్గునూర్ చౌరస్తా వద్ద అరెస్టుల పరంపరలు.. ఎదురు తిరిగిన ప్రజలు… సంఘటన స్థలానికి ప్రధాన నాయకులు చేరుకునేలోపే కేసీఆర్‌ను తీసుకొని పరుగులు పెట్టిన పోలీసు వాహనాల దృశ్యాలు.. నేటికీ కళ్లముందే కదలాడుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆ రోజు కేసీఆర్ చేసిన నిరాహార దీక్షే మలిదశ ఉద్యమం ఉగ్రరూపం దాల్చడానికి ప్రధాన కారణం. ఆ దీక్ష ఫలితమే నేటి తెలంగాణ.
నాడు స్వాతంత్య్ర సాధనకు గాంధీజీ దేశాన్ని ఒక్కతాటిపైకి తెస్తే.. బానిస సంకెళ్ల మధ్య బందీ అయిన తెలంగాణ దాస్య శృంఖలాలు తెంచడానికి కేసీఆర్ యావత్ తెలంగాణను ఒక్కతాటిపైకి తెచ్చారని చెప్పడం అతిశయోక్తి కాదు. అదే వాస్తవం. అతని పిలుపు మేరకే తెలంగాణ సమాజం సమరాంగణంలో దూకింది. సంఘటిత శక్తిగా నిలిచింది. చరిత్ర ఎరుగని ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించింది. దేశమే దిగివచ్చి తెలంగాణ రాష్ర్టాన్ని ప్రకటించాల్సిన అనివార్యతను, అగత్యాన్ని సృష్టించింది. మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని నడిపించి గమ్యాన్ని ముద్దాడింది.
సుదీర్ఘ పోరాటం ద్వారానే తెలంగాణ సిద్ధించింది తప్ప, పాలకుల దయాదాక్షిణ్యాలతో కాదు. ఈ రోజు కొంతమంది కుహనా రాజకీయ నాయకులు స్వరాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర లేదన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నాటి వాస్తవాలను ముఖ్యంగా నేటి యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.
ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అడుగడుగునా జరుగుతున్న అన్యాయంపై అనేక ఉద్యమాలు జరిగాయి. కానీ, నాటి పాలకుల కుట్రలు, కుతంత్రాల ముందు ఏ ఉద్యమం గమ్యాన్ని ముద్దాడలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ‘తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో’ అన్న నినాదంతో 2009, నవంబరు 29న ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. ఈ దీక్షకు బయలుదేరడానికి ఒక రోజు ముందే కరీంనగర్‌లోని కేసీఆర్ భవన్‌కు ఆయన చేరుకున్నారు. 2009, నవంబరు 29న కరీంనగర్‌లోని కేసీఆర్ భవన్ నుంచి సిద్దిపేట పరిధిలోని రంగధాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షాస్థలం వద్దకు కేసీఆర్ బయలుదేరారు. కానీ, కరీంనగర్ మానేరు బ్రిడ్డి వద్ద గల అల్గునూర్ చౌరస్తాలో కేసీఆర్‌ను ఆరెస్టు చేశారు. ఎదురుతిరిగిన ప్రజలను తప్పించుకొని ఖమ్మం జైలుకు కేసీఆర్‌ను తరలించారు. ఖమ్మం జైల్లోనే కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నారు. కేసీఆర్ అరెస్టుతో తెలంగాణవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సబ్బండ వర్గాలు ఒక్కటై కేసీఆర్‌కు అండగా నిలిచాయి. ‘నా దీక్ష వల్ల తెలంగాణ వస్తే జైత్రయాత్ర, లేకుంటే నా శవయాత్ర ఉంటుంద’ని కేసీఆర్ చెప్పడంతో కేంద్రం దిగి రాక తప్పలేదు.
స్వరాష్ట్ర సాధన కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా కేసీఆర్ ముందుకు సాగారు. ఈ పోరాటంలో అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి అవమానాలు భరించారు. అరాచకాలకు, కుట్రలకు, కుతంత్రాలకు ఎదురొడ్డి నిలిచారు. ఒక్కడితో మొదలైన ఉద్యమం ఆ తర్వాత నాలుగు కోట్ల మందిని కదిలించింది. బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఏర్పాటు నాటికి సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్.. స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న టీడీపీకి, తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అక్కడి నుంచి ఆరంభమైన రాజీనామాల పర్వం స్వరాష్ట్ర సాధన వరకు కొనసాగింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ నిర్వహించిన సభలు చరిత్ర సృష్టించాయి. 2001 మే 17న కరీంనగర్లో నిర్వహించిన సింహగర్జన సభ చరిత్రను తిరగరాసింది. 2003 జనవరి 6న పరేడ్ మైదానంలో తెలంగాణ గర్జన పేరిట సభ నిర్వహించి అన్ని వర్గాలను కేసీఆర్ ఆకట్టుకున్నారు. ఉద్యమ ప్రస్థానంలో తెలం గాణవాదాన్ని బతికించుకునేందుకు కేసీఆర్ అనేకసార్లు రాజీనామా అస్ర్తాన్ని సంధించారు. అయినా పాలకుల్లో చలనం రాకపోవడంతో.. తన ప్రాణాన్ని పణంగా పెట్టేందుకు సిద్ధమై ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కేసీఆర్‌కు మద్దతుగా యావత్ తెలంగాణ రోడ్లపైకి రావడంతో తెలంగాణ కల సాకారమైంది.
ఉద్యమ ప్రస్థానంలో బీఆర్ఎస్ చరిత్ర ఉప్పెన తరంగం వంటిది. ఇలా ఎన్నో త్యాగాల పునాదుల మీద ఏర్పడిందే తెలంగాణ. ఉద్యమ ప్రస్థానం తెలియక నేటి యువత సోషల్ మీడియాలో జరిగే విష ప్రచారాన్ని నమ్మే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్వరాష్ట్ర సాధనకు కారణమైన కేసీఆర్‌ను.. ప్రజల అకాంక్షను సాధించడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన 2009 నవంబర్ 29వ రోజును ప్రతి తెలంగాణ పౌరుడు ఒక్కసారైనా మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఉద్యమ చరిత్ర భావితరాలకు చేరుతుంది. భవిష్యత్ పోరాటాలకు ఒక వేదికగా నిలుస్తుంది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
కడపత్రి ప్రకాశ్‌రావు
80966 77022