ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన 9 నెలల పాలనలో రైతులను, మహిళలను, యువతను దారుణంగా వంచించారు. ఇస్తామన్నవి ఇవ్వలేదు సరికదా కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో మంచి మంచి పథకాలకు మంగళం పాడేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల వంతు వచ్చింది. వీరిని కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వంచించబోతుందా? కేంద్రానికి దాసోహం అంటుందా? అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను గంగలో కలపనుందా? అనే సందేహాలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లు ఏకంగా ‘పింఛన్ విద్రోహ దినం’ పాటించారు.
OPS | గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు సంబంధించి.. పాత పింఛన్ విధానాన్ని అమలుపరుస్తామని, ఏకీకృత, జాతీయ పింఛన్ విధానాలను అమలు పరచబోమని పెండింగ్‌లో ఉన్న మూడు డీఎలను వెనువెంటనే చెల్లిస్తామని, ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లోపే పీఆర్సీ ఆమోదించి అమలు పరుస్తామని పేర్కొన్నది. ఇవన్నీ నిజమని నమ్మారు ఉద్యోగులు. కానీ ఈ తొమ్మిది నెలల కాలంలో (మొదటివారంలో జీతాలు, పింఛన్లు తప్ప) ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు సంబంధించిన ఇతర ప్రధాన హామీలేవీ అమలు కాలేదు సరికదా ఈ 9 నెలల కాలంలో ముఖ్యమంత్రి గాని, ఇతర మంత్రులు గాని ఆ ఊసే ఎత్తడం మానేశారు. ఇటీవల ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు అన్నారే తప్ప పాత పింఛన్ విధానాన్ని మాత్రమే అమలుపరిచి తీరుతానని ఒక్క మాట అనలేదు. విశేషమేమిటంటే ఎన్నికల సందర్భంగా రాహుల్‌గాంధీ నోటి నుంచి కూడా పాత పింఛన్ హామీ వెలువడ లేదు. పీఆర్సీ అమలు, పెండింగ్‌లో ఉన్న డీఏలు, పాత పింఛన్ వంటి ప్రధానమైన అంశాల్లో ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక సమీక్ష జరిపిన దాఖలాలు కనిపించలేదు. ముఖ్యమంత్రి సర్వస్వతంత్రుడని, తమ సమస్యలు చిటికలో పరిష్కారమవుతాయని ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లు పెట్టుకున్న గంపెడాశలు నానాటికి అడుగంటుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వం ఏర్పడిన 9 నెలలకే ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లు వీధుల్లోకి రావాల్సిన దుస్థితి ఏర్పడింది.
పీఆర్సీ, డీఏ బకాయిల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లు దశాబ్దాలుగా సర్దుబాటు ధోరణి ప్రదర్శిస్తున్నారు. కొంత అటూ ఇటు అయినా భరిస్తూ వస్తున్నారు. కానీ, అలవికాని అలసత్వం ప్రభుత్వ యంత్రాంగ సంక్షోభానికి కారణమవుతున్నది. పులి మీద పుట్రలా కేంద్రం ఇటీవల ఆమోదించిన ‘యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్’ ప్రభుత్వ ఉద్యోగుల, పింఛనర్ల పాలిట అశనిపాతంగా మారింది. ఆ గండం నుంచి గట్టెక్కడానికి వారంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు ఆశగా చూస్తున్నారు.
2004 జనవరి 1న జాతీయ పింఛన్ విధానాన్ని నాటి ప్రధాని వాజపేయి ప్రవేశపెట్టగా ఆరు నెలల తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దానిని తోసిపుచ్చలేదు, సరికదా పకడ్బందీ విధి విధానాలను రూపొందించింది. 2013లో పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించింది. ఇటీవల ప్రధాని మోదీ క్యాబినెట్ కొత్త సీసాలో పాత సారా పోసినట్టు వాజపేయి జాతీయ పింఛన్ విధానానికి బదులుగా ఏకీకృత పింఛన్ విధానాన్ని ఆమోదించింది. ఇదొక అద్భుతమైన పింఛన్ విధానమని ప్రకటించింది. కానీ, కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లయింది. ఈ తలతిక్క విధానాల ఫలితంగా గత 20 ఏండ్లుగా పింఛనర్లు తమ బతుకు భరోసా అయిన న్యాయమైన పింఛన్‌ను పొందలేని దుస్థితిలో కునారిల్లుతున్నారు.
2004 కంటే ముందు నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు రిటైరైన తర్వాత దర్జాగా న్యాయమైన, హక్కుగా సంక్రమించిన పింఛన్ అనుభవిస్తుంటే, ఈ 20 ఏండ్ల కాలంలో నియమితులైన వారు పాత పింఛన్ విధానం అమలుకోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. కొత్త పింఛన్ విధానాల్లో ఉన్నదేమిటంటే… ఉద్యోగి 10 శాతం వేతనం కంట్రిబ్యూట్ చేస్తే ప్రభుత్వాలు అంతకంటే కొంత ఎక్కువ 18 శాతం వరకు మ్యాచింగ్ చేసి ఉద్యోగి రిటైరయ్యే సమయంలో ఇస్తాయట. ఈ లోగా సదరు రొక్కాన్ని ఎక్కడో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి వచ్చిన లాభాలను రిటైరైనప్పుడు ఇస్తాయట. అంటే కేంద్రం ఒకరకంగా ఉద్యోగుల శేష జీవితాలను పణంగా పెట్టి జూదం ఆడాలనుకుంటున్నది. ఇదెక్కడి సంక్షేమ రాజ్యం? తక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగి రిటైరైతే ఈ విధానం వల్ల నష్టపోయేది ఎంత? ప్రపంచ బ్యాంక్ విధానాలకు అనుకూలంగా కేంద్రం ఆమోదించిన ఈ కొత్త పింఛన్ విధానం పద్మవ్యూహంలోకి పింఛనర్లు వెళ్తే తిరిగి రాగలరా? పాత పింఛన్ విధానం కంటే కొత్త ఏకీకృత పింఛన్ లాభదాయకంగా ఉంటే ఉద్యోగులు ముక్తకంఠంతో వ్యతిరేకించరు కదా! ఇంటికి ధనలక్ష్మి వస్తుందంటే తలుపులు మూసుకోరు కదా!
ఇప్పటికే పశ్చిమబెంగాల్, కేరళ, పంజాబ్, రాజస్థాన్ సహా కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టా లు కొత్త పింఛన్ విధానాన్ని పక్కనపెట్టాయి. దక్షిణాదిన అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఈ బాధ్యత మరింత ఉన్నది. ఎందుకంటే, గత ఎన్నికల మ్యానిఫెస్టోలో వారు పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి. ఈ సందర్భంగా చాలామంది ప్రభుత్వ ఉద్యోగ మిత్రులు, తోటి పింఛనర్లు అంతర్గత చర్చల్లో… వ్యవసాయ మోటార్లకు మీటర్ల విషయంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏకంగా ప్రధాని మోదీని ఢీకొని, కేంద్రం నిధులు ఇవ్వనని బెదిరించినా ధర్నాకు దిగి ‘చావనైనా చస్తాను గానీ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించను’ అని నినదించిన సందర్భం గుర్తుచేసుకుంటున్నారు. ఆ స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోట పాత పింఛన్ ఇస్తాననే నొక్కి వక్కాణింపు కోసం కొత్త పింఛన్ బాధితులు ఎదురుచూస్తున్నారు.
అసలు ముఖ్యమంత్రి బడేభాయ్ మాటను కాదనే సాహసం చేస్తారా? అన్న సందేహం కొందరిని పీడిస్తున్నది. అందుకు మరో కారణం కూడా ఉన్నది. ఏపీ సీఎం నోటివెంట ఇంకా పాత పింఛన్ ఇస్తానన్న మాట రాలేదు మరి. కేసీఆర్ హయాంలో 95 శాతం లోకల్ రిజర్వేషన్, 43 శాతం ఫిట్మెంట్, తెలంగాణ ఇంక్రిమెంట్, ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వంలో గౌరవప్రదమైన పదవులు, వివిధ విభాగాల్లో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడం, వంటి చరిత్రాత్మకమైన ఉద్యోగ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలయ్యాయని చెప్పుకోవడానికి ఉన్నాయి. ఈ తొమ్మిది నెలల్లో అలాంటి చారిత్రక సందర్భాలు ఏవీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తారసపడలేదు. (చెప్పుకుంటున్న ఆరు నెలల్లో 30 వేల ఉద్యోగాలు కూ డా కేసీఆర్ ప్రభుత్వం వల్లనేనని అందరికీ తెలిసిందే). ఇప్పుడు సమయం ఆసన్నమైంది. గత ప్రభుత్వం కంటే ఒక చేయి పైన ఉండేట్లుగా ఫిట్మెంట్, పాత పింఛన్ విధానం అమలు, డీఏ బకాయిల చెల్లింపు అంశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించాలని ఉద్యోగులు, పింఛనర్లు ఆశిస్తున్నారు. సమస్యలు పాలకుల ముందుకొచ్చినప్పుడల్లా గతం మీద తోసేయడం, సంచలనాలు సృష్టించి దృష్టి మళ్లించడం, దరిద్ర దేవత దండకాలు వినిపించడం ఇంకానా… ఇకపై చెల్లవు.
-డాక్టర్ అయాచితం శ్రీధర్
98498 93238