ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని పాలకులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రజల ఆస్తులకు ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ భవిష్యత్ తరాల బాగుకోసం దార్శనికతతో ప్రణాళికలురచించాలి. వాటిని అంకితభావంతో ఆచరణలో పెట్టాలి. సమాజం పట్ల సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలి. రాష్ట్ర భౌగోళిక, సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలిసి ఉండాలి. ప్రజలకు మంచి చేయాలనే తపనతో ప్రజా సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పాటుపడాలి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలి. కానీ, పాలన పట్ల తన ప్రాథమిక కర్తవ్యాన్ని మరిచి ప్రజల జీవితాలతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. ఏమీ చేయకుండా.. ఏదో చేస్తున్నట్టు ప్రకటనలకే పరిమితమై కాలయాపన చేస్తున్నది.
తెలంగాణ చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనూ కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. నెత్తురు చుక్క నేల రాలకుండా అహింసా మార్గంలో ఓ మహత్తర పోరాటాన్ని సాగించిన ఘనత కేసీఆర్‌ది. స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతటి మహత్తర పోరాటం తెలంగాణ ఉద్యమమే.
Telangana | అసలు కాంగ్రెస్ ప్రభుత్వం గాడిలో లేదు, పాలన ముందుకుసాగడం లేదు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం రోజుకో బడాయి ప్రకటన చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇప్పటివరకు ఆరు గ్యారెంటీలు అమలుకు నోచుకోలేదు. రైతు రుణమాఫీ తూతూమంత్రంగా మారిపోయింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జరిపిన సమావేశంలో కీలకమైన హామీ ‘మహాలక్ష్మి’ పథకంపై చర్చించినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ పథకం అమలు సాధ్యం కాదని ఇరువురు చర్చించుకున్నట్టు ఆ కథనాలు ఉటంకించాయి. ప్రతీ మహిళకు నెలకు రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ చెప్పిన మాటలను నమ్మి ఆడపడుచులు కాంగ్రెస్‌కు ఓట్లు వేశారు. ఇప్పుడు సాధ్యం కాదని చేతులు దులుపుకొంటే సరిపోతుందా? తప్పుడు వాగ్దానం చేసినందుకు ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు క్షమాపణలు చెప్పాలి. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేసినందుకు ముక్కు నేలకు రాయాలి.
ప్రస్తుత కాంగ్రెస్ పాలన.. ఉమ్మడి రాష్ట్రంలోని పదేండ్ల కాంగ్రెస్ పాలన కంటే భిన్నంగా నడుస్తున్నది. కనీసం ఇది కాంగ్రెస్ పాలనలా కూడా కనిపించడం లేదు. ప్రభుత్వ ఆర్భాటపు ప్రకటనలు, మీడియాను మేనేజ్ చేస్తూ ‘ఆహా, ఓహో’ అంటూ ఆకాశానికి ఎత్తించుకోవడం, ఓ వర్గం మీడియా అంతా అధికారం చుట్టూ ముసురుకోవడం స్పష్టంగా కనిపిస్తున్నది. తెరవెనుక శక్తుల కోసం కొందరు మీడియా అధినేతలు సీఎం రేవంత్‌రెడ్డికి తాము ఎంత చెప్తే అంత అన్నట్టుగా పతాక శీర్షికల్లో ఉచిత సలహాలు ఇవ్వడం గతంలో ఎక్కడో చూసినట్టు ఉంది కదా! అవును.. ఇది ముమ్మాటికీ నిరంకుశ చం ద్రబాబు పాలనకు కాపీ- పేస్ట్‌లా కనిపిస్తున్నది. పాలన ముందుకు సాగకపోయినా మేనేజ్మెంట్ రాజకీయాలు చేయడంలో రేవంత్‌రెడ్డి.. తన ‘సహచరుడు’ చంద్రబాబును ఫాలో అవుతున్నా రు. రాష్ట్రంలో బడిపిల్లల నుంచి వృద్ధుల దాకా రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. రైతుబం ధు, రుణమాఫీ కోసం అన్నదాతలు, ఏక్ పోలీస్ నినాదంతో టీజీఎస్పీ బెటాలియన్ పోలీసులు ఆందోళన బాటపట్టారు. ఫించన్ రూ.4 వేలకు ఎప్పుడు పెంచుతారని వృద్ధులు ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగ భృతికి ఎప్పుడు మోక్షం కలుగుతుందోనని యువతీయువకులు నిరీక్షిస్తున్నారు. ఈ హామీలన్నీ ఎప్పటికి సాధ్యమవుతాయో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.
ప్రజాపాలన, ప్రజాస్వామిక పాలన, ఇందిరమ్మ రాజ్యం అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన కాంగ్రెస్ హక్కుల కోసం గొంతెత్తేవారిని అణచివేయడానికి, ప్రశ్నించేవారిపై కుట్రపూరిత కేసులు పెట్టడానికి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నది. ‘ఎవరిని, ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు’ అంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన స్థాయిని మరిచి చిట్చాట్లలో మాట్లాడుతున్నారు. హ్యాండిల్ చేయడం, మేనేజ్ చేయడంలు చంద్రబాబు దగ్గర నేర్చుకున్న విద్యలేమో మరి! చెప్పిన హామీలు ఆచరణలో పెడితే ఉద్యమాలను అణచివేయాల్సిన అవసరం, ఎవరినో మేనేజ్ చేయాల్సిన అనివార్యత, హ్యాండిల్ చేయాల్సిన అగత్యం ఎందుకు వస్తుంది? పాలకుల ప్రథమ కర్తవ్యం ప్రజలకు మంచి పాలన అందించడమేనని గుర్తిస్తే.. సొంత భావోద్వేగాలకు, రాగద్వేషాలకు తావుండదు. ఈ ప్రభుత్వం చెప్తున్నవి కాంగ్రెస్ మార్క్ నినాదాలు.. కానీ, పాలన మాత్రం ముమ్మాటికీ చంద్రబాబు తరహాలోనే నడుస్తున్నది.
పాలకుడికి విశాల దృక్పథం ఉండాలి. మంచిని మంచి అని, చెడును చెడు అని విమర్శించే దృక్పథం ఉండాలి. గత ప్రభుత్వాలు చేసిన మంచిని మెచ్చుకునే పెద్ద మనసు ఉండాలి. గతంలో ఆరోగ్యశ్రీ, 108 పథకాల ఘనత దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డిదేనని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కొనియాడారు. రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమ కోణంలో చూసినప్పుడు రాజశేఖర్‌రెడ్డి అంటే వ్యతిరేక భావన ఉండొచ్చు. కానీ, చాలామంది ప్రాణాలు కాపాడిన పథకాలను కొట్టిపారేయలేం కదా? అయితే, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తానంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. కేసీఆర్ ఆనవాళ్లంటే ఏమిటి? కాళేశ్వరం ప్రాజెక్టు, జిల్లాకో మెడికల్ కళాశాల, రైతుబంధు, రైతుబీమా. కేసీఆర్ ఆనవాళ్లంటే పసిగుడ్డుకు అందించే కేసీఆర్ కిట్ నుంచి పండు ముసలికి అందించే ఫించన్ వరకు. పేదింటి ఆడబిడ్డకు అందించే కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్, గర్భిణులకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్. హైదరాబాద్‌లో ప్రజా జీవనం సులభతరం చేసే ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఐటీ అభివృద్ధి, మూడింతలు పెరిగిన ధాన్యం దిగుబడి, పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు. దేశంలో అన్ని రాష్ర్టాల ముందు సగర్వంగా నిలిచే అద్భుతమైన సచివాలయం. ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసే అంబేద్కర్ విగ్రహం. అమరుల త్యాగాలను తల్చుకునేలా నిర్మించిన స్మారకం. ఇవన్నీ కేసీఆర్ ఆనవాళ్లే. అంతెందుకు… తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాలు. వేటిని చెరిపేస్తారు రేవంత్‌రెడ్డి?
తెలంగాణ చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనూ కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. నెత్తురు చుక్క నేల రాలకుండా అహింసా మార్గంలో ఓ మహత్తర పోరాటాన్ని సాగించిన ఘనత కేసీఆర్‌ది. స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతటి మహత్తర పోరాటం తెలంగాణ ఉద్యమమే. కేసీఆర్ పోరాటం, పదేండ్ల అభివృద్ధి, సంక్షేమ ప్రస్థానం సువర్ణాక్షరాలతో లిఖించిదగినది. తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్‌కు ఇచ్చిన అధికార అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ఆ అధికారంతో ఏం చేయాలో కూడా తెలియక తికమకపడుతూ పది నెలల కాలంలోనే ప్రజాగ్రహాన్ని మూటగట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. చేతనైతే చరిత్రలో కొన్ని మంచి ఆనవాళ్లు లిఖించుకోవడంపై రేవంత్‌రెడ్డి దృష్టిపెట్టాలి. అది చేతగాదని పది నెలల పాలనతో స్పష్టమైంది. ఇక కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానంటూ ఆర్భాటపు ప్రగల్భాలు పలికితే ప్రజలు మరింత ద్వేషించుకుంటారని గుర్తించాలి. ఆనవాళ్లు చెరిపేయడమంటే ఏదైనా ఓ కేసులో ఆధారాలు చెరిపేయడం లాంటిది కాదని, కేసీఆర్ ఆనవాళ్లు అంటే ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్న ఆత్మబంధం అని అర్థం చేసుకోవాలి. జై తెలంగాణ.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
ఇనుగుర్తి సత్యనారాయణ
97046 17343