ఇప్పుడు బీజేపీ నేతల చేతుల్లో రామబాణం లేనే లేదు. ఆ పార్టీ నేతలు శకుని పాచికలు పట్టుకొని చాలాకాలమే అయ్యింది. నిజానికి కమలం పార్టీ ఆవిర్భావం నుంచి విస్తరణ వరకు వాజపేయి, అద్వానీ సుదీర్ఘకాలం భిన్నాభిప్రాయాలతో జుగల్బందీ నేస్తం కొనసాగించినా, రాజకీయ వ్యవస్థను బుద్ధిమాంద్యంగా మార్చే ప్రయత్నం చేయలేదు. కానీ దురదృష్టవశాత్తు 2001 అక్టోబర్ 7న నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీజేపీ పని విధానానికి కార్పొరేట్ క్రూరత్వం కూడా జతకలిసి వ్యవస్థలను అవాస్తవాల అగాధంలో పడేయడం మొదలైంది.
ఆనాటి ఢిల్లీ పెద్దల చెవుల్లో చాడీల స్తోత్రం నింపి, కేశూభాయ్ పటేల్ పీఠాన్ని లాకున్న తర్వాత మోదీ మరింత అందంగా అబద్ధాలను ఆవిష్కరించే నైపుణ్యం సంపాదించారు. వాజపేయితో అద్వానీలా కాకుండా తందాన పాటలో ఏకీరాగం కలిగిన అమిత్ షా కూడా కలువడంతో బీజేపీ పనితీరులోనే కాదు..రాజకీయ రంగంలోనూ అనారోగ్యకర ధోరణులు వ్యవస్థీకృతం అయ్యాయి. ఫలితంగా ప్రచారం, ప్రదక్షిణలు మాత్రమే కొలమానంగా మారి రాజకీయాల్లో వాట్సప్ వీరులు, పైజమాదారులు, సూటు, బూటు, సోషల్ మీడియా సమరయోధులు మాత్రమే శరవేగంగా ఎదగగలిగే రోగ రాజకీయ సమూహం భారత్‌లో భారీగా పెరిగిపోయింది. సరిగ్గా ఇలాంటి కొంగొత్త కోటరీతరం నుంచే తళుక్కుమన్న తేజస్వీ సూర్యకు కూడా తెలంగాణ చరిత్ర తెలిసే అవకాశం లేనేలేదు.
వాట్సప్ వర్సిటీ విద్వేష విజ్ఞానంలో వికసించిన సూర్యకు, కేసీఆర్ నాయకత్వంలో మానవ సమూహమొక్కటి ఏకీకృతంగా జరిపిన సామాజిక సమరం గురించి అర్థం చేసుకునే మానసిక పరిణతి ఉంటుందని ఎవరమూ అనుకోలేం. సహజంగానే ఫార్వార్డ్ పరిజ్ఞానంలో నైపుణ్యం కలిగిన తేజస్వీ లాంటి నాయకులు బీజేపీ మనసెరిగి, మోదీ మెప్పు మరిగి మాత్రమే నోరు విప్పుతారనేది పార్లమెంట్లో తాజాగా మరోసారి బట్టబయలైంది. వాస్తవానికి మనం ఏమరుపాటుగా ఉన్న ప్రతి దశలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నేతలు తెలంగాణను ఎంతలా ద్వేషిస్తున్నాయో వెళ్లగక్కుతూ మన కండ్లు తెరిపించేలా ప్రవర్తిస్త్తూనే ఉన్నారు. చర్చ ఏదైనా తెలంగాణపై ఏడుపే ఢిల్లీ పార్టీలకు అలవాటు. సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు చెడు చేయడానికే ఆ రెండు జాతీయ పార్టీల తండ్లాట.
కమలం నోట్లో, కాంగ్రెస్ గూటిలో విద్వేషమే తప్ప తెలంగాణపై విశ్వాసం మచ్చుకైనా కనిపించదు. ఆ ధోరణి వల్లే మోదీ మొదలు తేజస్వీ సూర్య వరకు పార్లమెంట్ సాక్షిగా విషం వెళ్లగక్కుతూనే ఉన్నారు. తలాతోక లేని తల్లీబిడ్డల హత్య సామెతతో తెలంగాణను పలుమార్లు అవమానించిన ప్రధాని, రాష్ట్రంపై పగ సాధించే ప్రయత్నాన్ని ఇప్పటికీ ఆపనేలేదు. పదేండ్లపాటు కేసీఆర్ ప్రభుత్వానికి సహాయనిరాకరణ చేయడమే కాదు, రాష్ర్టానికి రావాల్సిన నిధులు, దక్కాల్సిన హక్కులను కూడా దూరం చేశారు.
ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాలను గుంజుకోవడంతోపాటు తెలంగాణకు న్యాయంగా తిరిగి ఇవ్వాల్సిన జీఎస్టీ నిధులనూ వేలాది కోట్లు ఎగ్గొట్టారు. పోలవరాన్ని ప్రేమించిన ప్రధాని..పాలమూరు ఎత్తిపోతలను తొక్కేసే ఎత్తులేశారు. ఏవిధంగా తోడ్పాటును ఇవ్వకపోగా ఎప్పుడూ లేనివిధంగా కార్పొరేషన్ల ద్వారా సేకరించే రుణాలను కూడా ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి చేర్చి పరుగందుకునే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ కాళ్లల్లో కట్టెలు పెట్టింది కేంద్రంలోని కాషాయ సర్కార్. పైగా ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, ఆర్బీఐ అడ్డగోలు నిబంధనల మార్పులు తొలి అడుగులోనే తెలంగాణకు గండాలెన్నో తెచ్చిపెట్టాయి. ఫెడరలిజంపై ఫ్యాక్షనిజం ప్రయోగించినట్లుగా కేసీఆర్ సర్కార్‌పై మోదీ ప్రభుత్వం అడుగడుగునా పగనే ప్రసరించింది. ఇలా ప్రధానే పగదారిలా ప్రవర్తించినప్పుడు వారి ట్విటర్ టీమ్‌కు మాత్రం తెలంగాణపై ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది?
అందుకే మహిళా బిల్లు, డీలిమిటేషన్ లాంటి భిన్నాభిప్రాయాలు కలిగిన కీలకమైన బిల్లులపై అర్థవంతమైన చర్చ జరగాల్సిన సందర్భంలో అసందర్భోచితంగా తెలంగాణ ప్రస్తావన తెచ్చి అలవాటైన పాకిస్థాన్ పేరును అలవోకగా తెలంగాణకు తేజస్వీ తగిలించగలిగాడు. దేశ విభజనను, తెలంగాణ ఆవిర్భావాన్ని మెదడున్న ఎవరైనా ఒక గాటనకట్టి చూడగలరా? దేశ విభజన సందర్భంగా జరిగిన దుస్సంఘటనలను, తెలంగాణ పోరాటంలో ధారపోసిన వేలాదిమంది వీరుల త్యాగాలను మానవీయత గల ఏ నాయకుడైనా ఒకే రకంగా వర్ణించగలడా? సుదీర్ఘకాలంగా కాంగ్రెస్, బీజేపీ కుటిల కొట్లాటలు, గురివిందగింజ ప్రగల్భాలు, నిందానాటకాలు చూసి చూసి దేశం విసిగిపోయింది.
ఆ రెండు బిల్లులపై పార్లమెంటులో చర్చ సందర్భంగా హఠాత్తుగా తెలంగాణను దారుణమైన వ్యాఖ్యలతో బాధించడం ఎంత దారుణమో మన రాష్ట్ర బీజేపీ నేతలకు తలకెక్కదు. దేశ విభజన వివాదం సరే, 2002లో గుజరాత్లో పారిన నెత్తురుకు నాటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ బాధ్యత వహించగలరా? ఇలా జాతీయ పార్టీల వైఫల్యాలు, నేరాలకు న్యాయం కోసం చరిత్ర నెత్తిన నినాదమై మొలకెత్తిన తెలంగాణకు అసలు పోలికున్నదా?
తరాల పాటు తలవంచలేక తెలంగాణ ఎంత నెత్తురు, చెమట ధారపోసిందో కట్టుకథలను పట్టుకొని ఊరేగే కమలం పార్టీకి ఎలా అర్థమవుతుంది? తల్లడిల్లుతున్న తెలంగాణను తీరానికి చేర్చడం కోసం కేసీఆర్ దశాబ్దాల పాటు నిప్పుల గర్భాన్ని మోసిన మాతృమూర్తిలా ఎన్ని పోరు నదులను భుజాలపై మోసారో..మతం, మృతదేహాల భుజాలపై నిలబడే బీజేపీ నాయకులెలా చూడగలరు? ఇక తేజస్వీ లాంటి రీల్స్ రాయుళ్లకు, ఇన్ స్టాగ్రామ్ గోబెల్స్‌లకు త్యాగాల తెలంగాణ తలకిందులుగా తపస్సు చేసినా అర్థం కానేకాదు. ఆ మరుగుజ్జు మనస్తత్వం కలిగిన బీజేపీ, కాంగ్రెస్ నేతలే త్యాగాల తెలంగాణపై నోరు పారేసుకుంటున్నారు. పార్లమెంట్ సాక్షిగా తేజస్వీ విషం కక్కుతుంటే, కండ్లు మూసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు, తెలంగాణ కన్నెర్ర చేయడంతో మేల్కొని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఒక్కసారి తప్పుచేస్తే ఎంత అవమానం భరించాల్సి వస్తుందో, ఆత్మ గౌరవమెలా ఎగతాళికి గురవుతున్నదో, అభివృద్ధి ఎండమావిగా ఎలా ఎదురొస్తుందో తెలంగాణ సమాజం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి.
1940లో తమిళనాడు ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా మహాత్మాగాంధీని సైతం ఎదిరిస్తూ ‘ఓపిక పట్టాం.. చాలా ఓపిక పట్టాం..మౌనం వహించాం.. కానీ ఆత్మగౌరవ పరిరక్షణ కోసం మహాత్మునికీ ఎదురు నిలిచి పోరాడక తప్పదు‘ అంటూ పెరియార్ కుండబద్దలు కొట్టినట్లు వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం మీద, సంస్కృతి మీద పదేపదే దాడికి దిగుతున్న బీజేపీ, కాంగ్రెస్‌పై ఏకోన్ముఖంగా తిరగబడక తప్పదు. పునాదిని మార్చాలంటే ముందు దానిపై నిర్మించిన అబద్ధపు భవంతిని కూల్చాలని అంబేద్కర్ అన్నట్టు అసత్యాల, అసమర్థ, అన్యాయాల వేదికలైన కమలం, కాంగ్రెస్‌లను సమూలంగా కూల్చక తప్పదు. అందుకే అనుభవశీలి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి గులాబీ జెండా పట్టుకోబోతున్నారు. నాగళ్లు కండ్లు తెరిచినట్లు, బీళ్లు ఒళ్లు విరిచినట్లు మళ్లొకసారి అందరం చారిత్రక జగిత్యాల సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవ పోరుకు కదులుదాం. తెలంగాణ అప్పుడప్పుడు ఓడిపోవచ్చు…కానీ అక్కడే ఆగిపోదు.
– (వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
ఆంజనేయ గౌడ్