అందరికీ అన్ని అంటూ అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ కలం కార్మికులకూ ఎన్నెన్నో ఆశలు కల్పించింది. చివరికి మాట ఇచ్చింది తప్పడానికే.. అడుగు వేసింది మడమ తిప్పడానికే అన్నట్టుగా ఇప్పుడంతా తూచ్ అంటున్నది. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో అట్టహాసంగా ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు. సహాయనిధిని పెంచుతామన్న హామీ కూడా అంతే సంగతులు. రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ ఇస్తామన్నారు. మరణించిన పాత్రికేయుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తామన్నారు. ఇక ఇండ్ల స్థలాల విషయంలోనూ ఊరించి ఉసూరుమనిపించారు.
కోర్టు కేసుల్లో చిక్కుకొని అందని ద్రాక్షగా మారిన ఇండ్ల స్థలాల విషయంలో చెయ్యివ్వడం కాంగ్రెస్ మార్కు ద్రోహానికి పరాకాష్ఠ. నగర పరిధిలో స్థలాల కేటాయింపు అసాధ్యమని ఉప ముఖ్యమంత్రి చావుకబురు చల్లగా చెప్పారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయకపోగా అధికార పగ్గాలు చేపట్టిన దగ్గరనుంచి కలంపై కక్ష గట్టింది కాంగ్రెస్ సర్కార్. అరెస్టులు, కేసులతో జర్నలిస్టులను వేధించింది. ఇక అక్రెడిటేషన్ల విషయంలో నమ్మించి గొంతు కోసింది. జర్నలిస్టులకు కొత్తగా భుజకీర్తులు తగిలించడం మాట అటుంచి ఉన్నవి ఊడగొట్టింది. రెండేండ్ల తర్వాత జీవో నం.252 జారీచేసి రెండు రకాల గుర్తింపుకార్డులు ఇస్తామంటూ విభజించు పాలించు విధానాన్ని కాంగ్రెస్ సర్కార్ ముందుకుతెచ్చింది.
తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన వర్గాల్లో కలం వీరులు ప్రథమ శ్రేణిలో ఉంటారనేది ఎవరూ కాదనలేని వాస్తవం. వారి కృషికి గుర్తింపుగా సీఎం పదవి చేపట్టకముందు జర్నలిస్టుల సంబురాలకు హాజరైన కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమం కోసం తన విజన్‌ను ప్రకటించారు. ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి లడాయి చేసిన జర్నలిస్టులను మన రాష్ట్రంలో మనం గౌరవించుకుందామని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డు ఇద్దామని ప్రకటించిన వేదిక అదే. అన్నమాట ప్రకారమే 2016లో 239 జీవో ఇచ్చి జర్నలిస్టులందరికీ న్యాయం చేశారు. గుర్తింపు పొందకుండా తెరవెనుకే ఉండిపోయిన డెస్క్ జర్నలిస్టులకు గౌరవం కల్పిస్తూ చరిత్రలో మొదటిసారిగా అక్రెడిటేషన్లు, వాటితో పాటే వైద్యబీమా సహా పలు సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులోకి వచ్చేలా చూశారు. పెన్షన్లు, ఎక్స్‌గ్రేషియాలు, కుటుంబ పెన్షన్ల కోసం రూ.100 కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటిం చారు.
దశలవారీగా రూ.42 కోట్లు సమకూ ర్చారు. వివిధ సందర్భాల్లో ఆ నిధి నుంచే జర్నలిస్టులను, జర్నలిస్టు కుటుంబాలను ఆదుకున్నారు. కరోనా కల్లోలంలో జర్నలి స్టులకు రూ.10 వేల చొప్పున సహాయమూ అందించారు. కాగా, జర్నలిస్టు సంక్షేమనిధిని రూ.100 కోట్లకు పెంచుతామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. ఆ మధ్య రూ.10 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఇంతవరకూ పది రూపాయలూ విదిల్చలేదనేది వాస్తవం. మొదటి విడత 18 వేల కార్డులతో ప్రారంభమై ప్రతి రెండేండ్లకు ఒకసారి పెరుగుతూపోయి 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జర్నలిస్టులకు ఇచ్చుకున్న మొత్తం అక్రెడిటేషన్ కార్డుల సంఖ్య ఎంత అంటే అక్షరాలా 23 వేలు. మన జర్నలిస్టులకు కార్డులు ఇచ్చుకుంటే తప్పేందని ఆలోచించింది ఆ ప్రభుత్వం. ఇప్పుడు అందులో నుంచి సగం, అంటే సుమారు 13 వేల మేరకు కోత పెట్టేందుకు జీవో 252 తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ప్రభుత్వ సమాచార సేకరణలో కీలకపాత్ర పోషించే అక్రెడిటేషన్ల విషయంలో రెండు తరగతులను ప్రవేశపెట్టింది. అక్రెడిటేషన్, మీడియా కార్డు అంటూ ఫీల్డు జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టుల మధ్య తేడాలను ప్రవేశపెట్టింది.
బడేభాయ్ నరేంద్ర మోదీ తరహాలోనే ఛోటేభాయ్ రేవంత్ రెడ్డికి కలం యోధులంటే గిట్టదు. సీఎం రేవంత్‌రెడ్డికి జర్నలిస్టులపై ఉన్న గౌరవం ఏపాటిదో తెలియనిది కాదు. పలు సందర్భాల్లో పాత్రికేయులపై ఆయన ఘోరమైన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. జర్నలిజం ముసుగులో ఎవడెవడో వస్తున్నాడనీ, పొట్టకోస్తే అక్షరం ముక్కరానివారు జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారని ఆయన ఎగిరిపడటం ఒక ఎత్తయితే, స్టేజీ దిగి చెంప పగులగొట్టాలని అనిపిస్తున్నదని నోటిదురుసు ప్రదర్శించడం మరొకెత్తు. బహుశా దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇలా మాట్లాడిన సీఎం రేవంత్ ఒక్కరేనేమో. కేంద్ర సర్కారు కరోనాను సాకుగా తీసుకుని జర్నలిస్టులకు రైల్వే పాసులు ఎగరగొడితే, ఈయన అక్రెడిటేషన్లకు కోతపెట్టి కక్ష తీర్చుకుంటున్నారు. విభజన రాజకీయాలకు స్వస్తి పలికి కేసీఆర్ ఇచ్చిన 239 జీవో స్ఫూర్తితో మరింత మెరుగ్గా నూతన జీవో తేవాలని డిమాండ్ చేస్తూ కలం యోధులు కదం తొక్కడం నేటి రాష్ట్ర పరిస్థితికి అద్దం పడుతున్నది.