చట్టబద్ధత లేకుండా దేశానికి ఆదర్శమా?-2
ఏకసభ్య బూసాని కమిషన్ కొద్ది రోజుల్లోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికలను అసెంబ్లీ, మండలిలో సమర్పించలేదు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం విద్య, ఉద్యోగ, రాజకీయ (స్థానిక సంస్థలు) రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బిల్-3, బిల్-4లను రూపొందించింది. వీటికి 31-సీ కింద రాజ్యాంగ రక్షణ కోరింది. కానీ, సమగ్ర ఆధారాలతో కూడిన నివేదికలను చట్టసభల్లో టేబుల్ చేసి చర్చించలేదు. అలాగే 31-బీ కింద 9వ షెడ్యూల్లో చేర్చాలని ఎలాంటి ఏకగ్రీవ తీర్మానాలు ఆమోదించలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని కోరలేదు.
సామాజిక న్యాయానికి తగిన పద్ధతులు అవసరం. న్యాయనిపుణులు, సామాజికవేత్తలు ప్రభుత్వ నిర్వాకంపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు. 42 శాతం రిజర్వేషన్ల అవసరాన్ని నిరూపించే రుజువులు, అందుకు డేటా, కమిషన్ న్యాయబద్ధత, అసెంబ్లీ, మండలిలో నివేదికలను సమర్పించకపోవడంపై నిలదీస్తూనే ఉన్నారు. గతంలో బీహార్ ఇదే మార్గాన్ని అనుసరించింది. ఆ రాష్ట్రం చేసిన రిజర్వేషన్ల చట్టాన్ని పాట్నా హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణ SEEEPC సర్వే వలె బీహార్లో జీఏడీ ద్వారా సామాజిక గణాంక సర్వే నిర్వహించారు. ఆ సర్వే ఆధారంగా అక్కడి ప్రభుత్వం రిజర్వేషన్లను పెంచింది. అయితే, దీన్ని పాట్నా హైకోర్టు రద్దు చేసింది. దాని నుంచి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పాఠాలు నేర్వలేదు. స్వతంత్ర కమిషన్ను నియమించకుండా, ప్రణాళిక శాఖ ద్వారానే సర్వే చేయించింది. చెల్లుబాటు కాదని తెలిసినా సర్వే చేయించింది.
50 శాతానికి మించి రిజర్వేషన్లను అమలు చేయాలంటే అసాధారణ పరిస్థితులు, సమగ్ర విశ్లేషణ అవసరం. కుల గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు పెంచడం రాజ్యాంగ విరుద్ధం. బీహార్ సర్కార్ సమగ్ర డేటా లేకుండానే ఆ నిర్ణయం తీసుకుందని పాట్నా హైకోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పు అనంతరం బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ఈ తీర్పు స్పష్టమైన సందేశం ఏమిటంటే.. రిజర్వేషన్ల విషయంలో న్యాయపరమైన ప్రామాణికతను, రాజ్యాంగ బద్ధతను తప్పకుండా పాటించాల్సిందే. కేవలం రాజకీయ లక్ష్యాల కోసం రిజర్వేషన్ల చట్టాలను తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధం.
భారత సుప్రీంకోర్టు Indra Sawhney vs Union of India(1992) తీర్పులో పేరా 667లో ఇలా స్పష్టం చేసింది: The identification of backward classes must be done with reference to social and educational criteria and on the basis of a proper and scientific study& The Comm ission [like the Mandal Commi ssion] collected extensive data and applied a comprehensive methodology involving public hearings, field visits, statistical indicators and expert consultations. This method of determination is commendable and necessary to ensure fairness, objec tivity, and constitutional legitimacy.
అంటే, సామాజిక, విద్యారంగాల్లో వెనుకబాటుని గుర్తించాలంటే అది ఎప్పుడూ శాస్త్రీయంగా, సమగ్రంగా, ప్రజలతో సంప్రదింపులతో కూడిన అధ్యయనంతోనే ఉండాలి. ఈ నియమాన్ని తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం పక్కనబెట్టి, కేవలం ప్రభుత్వ ఆదేశాలతో ఏర్పడిన చట్టబద్ధత లేని ఏకసభ్య కమిషన్ల నివేదికల ఆధారంగా ముందుకెళ్లడం రాజ్యాంగబద్ధతకు విరుద్ధం. ఇదిలా ఉండగా, 2024లో Gaurav Kumar Bansal vs State of Bihar కేసులో పాట్నా హైకోర్టు ఇలా స్పష్టం చేసింది: In the absence of a valid statutory commission or a commission constituted under the Constitution, any exercise undertaken by the executive through internal surveys or special committees cannot form the legal basis for providing reservations exceeding 50%. The process lacks legal sanctity and violates the ratio laid down in Indra Sawhney.
దీనికి అనుగుణంగా, బీహార్ రాష్ర్ట ప్రభుత్వం నిర్వహించిన సామాజిక ఆర్థిక సర్వే ఆధారంగా 65 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు కొట్టివేసింది. అదే లాజిక్, అదే రాజ్యాంగం తెలంగాణకూ వర్తించాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా చట్టబద్ధమైన కమిషన్ లేకుండా, న్యాయపరంగా సమర్థవంతంగా వ్యవహరించకపోవడం వల్ల తీసుకున్న చర్యలు భవిష్యత్తులో న్యాయస్థానాల్లో నిలబెట్టుకోలేనివిగా మారే ప్రమాదం ఉంది.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం స్పష్టమైన పద్ధతులను అవలంబించింది. కానీ, నేడు అన్ని పద్ధతులకు తిలోదకాలిచ్చారు. 2015 మార్చి 3న తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జి.సుధీర్ నేతత్వంలో ఒక కమిషన్ను నియమించింది. కమిషన్ సమగ్రంగా అధ్యయనం చేసి 2016 డిసెంబరులో నివేదికను సమర్పించింది. ఆ నివేదికను ప్రభుత్వం బీసీ కమిషన్ పరిశీలన నిమిత్తం పంపింది.
బీసీ కమిషన్ ఇచ్చిన సూచనల ఆధారంగా ప్రభుత్వం రాజ్యాంగపరమైన, చట్టబద్ధమైన ప్రక్రియలో బిల్లులను శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టి, ఆమోదించుకొని రాష్ర్టపతికి పంపింది. ఈ ప్రక్రియ వ్యవస్థాపిత నిబద్ధతకు ప్రతీకగా నిలిచింది. అయితే ఆ బిల్లులు ఇప్పటికీ రాష్ర్టపతి ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2025 మార్చి 17న బీసీ బిల్లులు ప్రవేశపెట్టిన రోజే రాష్ర్టపతి సమీక్షలో ఉన్న ఆ బిల్లులను కేసీఆర్పై ఉన్న అక్కసుతో ప్రస్తుత ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని గమనించాలి.