హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ఆర్థిక అవకతవకలు, బ్యాంకులను మోసగించడం వంటి ఆర్థిక నేరాలు కలిగిన తన బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాను కాపాడుకొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అధికారులపై ఒత్తిడి తెచ్చి సాక్ష్యాధారాలు తారుమారు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితుల్లోనే విచారణలో భాగంగా సేకరించిన కీలక ఆధారాలు పోయాయంటూ అధికారులు కోర్టులో చెప్పారని అనుమానం వ్యక్తంచేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా తక్షణమే స్పందించి ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తిచేశారు.
ఈ మేరకు శుక్రవారం ఆయనకు అమిత్‌షాకు లేఖ రాశారు. సీఎం రేవంత్‌రెడ్డి బినామీ కంపెనీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాకు అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టారని పేర్కొన్నారు. సదరు కంపెనీకి సంబంధించిన కేసులపై విచారణ సందర్భంగా సీఎం ఆదేశాల మేరకే ప్రభుత్వం సాక్ష్యాలను మాయం చేసిందని ఆరోపించారు. ఈ వ్యవహారం రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలు, దర్యాప్తు విభాగాలపై ఉన్న ఒత్తిళ్లకు అద్దంపడుతున్నదని పేర్కొన్నారు.
సీఎంతోపాటు కొందరు ప్రభుత్వ పెద్దలతీరుతో విచారణ సంస్థలు, పోలీసు వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. దివాలా కంపెనీల జాబితాలో ఉన్న కేఎల్ఆర్ఎస్కు సీఎం రేవంత్‌రెడ్డి భారీగా కాంట్రాక్టులు కేటాయిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే సుమారు రూ.2,500 కోట్ల విలువైన పనులు అప్పగించినట్టు ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయని గుర్తుచేశారు. సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సరఫరా పనులు, ప్రధాన రహదారుల నిర్మాణ పనులు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రాజెక్టులు అప్పగించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి అనుమానాలకు తావిస్తున్నదని వ్యాఖ్యానించారు.
కేఎల్‌ఎస్‌ఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్న అనుబంధం జగమెరిగిన సత్యమని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో జరిగిన ఆదాయపు పన్ను శాఖ విచారణలో ముఖ్యమంత్రి సుదీర్ఘకాలంగా వినియోగిస్తున్న టొయోటా ల్యాండ్ క్రూజర్ (టీఎస్ 07 ఎఫ్ఎఫ్ 0009) వాహనం కేఎల్ఎస్ఆర్ పేరిట నమోదైన విషయం బయటపడిందని తెలిపారు. సదరు కంపెనీకి సంబంధించిన దివాలా వ్యవహారం నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ముందు విచారణలో ఉండగా, విచారణను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో 2025 ఆగస్టు 13న ట్రిబ్యునల్ సభ్యుడు జస్టిస్ శరద్‌కుమార్ కేసు విచారణ నుంచి తప్పుకొన్నారని నివేదికలు వెల్లడించాయని గుర్తుచేశారు.
అలాగే 2022లో కేఎల్ఎస్ఆర్పై దివాలా ప్రక్రియ ప్రారంభించిన ‘యాస్ మెట్ కార్ప్’ సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగిందని నివేదికలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతీకార చర్యల్లో భాగంగా 75 ఏండ్ల వయస్సు కలిగిన క్యాన్సర్ పేషెంట్‌ను అరెస్ట్ చేసిన తీరు ఎంతగానో ఆందోళన కలిగించిందని తెలిపారు. తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్న రిట్ పిటిషన్ నంబర్ 18267/2025 సందర్భంగా కీలకమైన సాక్ష్యాధారాలుగా స్వాధీనం చేసుకున్న పత్రాలు అధికారిక కస్టడీ నుంచి కనిపించకుండా పోయిన విషయం బయటపడిందని, దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఆందోళన వ్యక్తం చేశారని గుర్తుచేశారు.
కేఎల్ఎస్ఆర్ కంపెనీ విచారణ వ్యవహారంతోపాటు తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం కూడా సాక్ష్యాధారాల భద్రతపై మరింత అనుమానాలు పెంచిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, కేఎల్ఎస్ఆర్పై ఉన్న ఆర్థిక ఆరోపణలు, కాంట్రాక్టుల కేటాయింపులో జరిగిన అక్రమాలు, మనీ ల్యాండరింగ్ అనుమానాలపై పక్షపాత రహితంగా సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు (ఎస్ఎఫ్ఐవో)తో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర హోం శాఖ మంత్రిని లేఖ ద్వారా కేటీఆర్ అభ్యర్థించారు. ప్రభుత్వ నిధులను కాపాడటం, పాలనలో పారదర్శకత, చట్టబద్ధమైన వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని కాపాడేందుకు ఈ అంశంపై తక్షణమే స్వతంత్ర విచారణ చేపట్టడం అత్యవసరమని పేర్కొన్నారు. అమిత్‌షాకు పంపిన లేఖ ప్రతులను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కు కూడా పంపించానని కేటీఆర్ వెల్లడించారు.