సంఖ్యాబలంతో లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు-2025ను ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదింపజేసుకున్నది. జేడీయూ, టీడీపీ వంటి మిత్రపక్షాల సహకారం బీజేపీకి తోడైంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. అయితే వక్ఫ్ బిల్లు విషయంలో దూకుడుగా వెళ్లిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ.. డీలిమిటేషన్ విషయంలోనూ అలాగే వ్యవహరించే అవకాశమున్నది. ఎన్డీఏ, ఇండియా కూటములతో సంబంధం లేకుండా దక్షిణాది రాష్ర్టాలు కలిసికట్టుగా పోరాడకపోతే.. దక్షిణాది రాష్ర్టాలకు, ఇక్కడి ప్రజలకు తీరని నష్టం జరిగే ప్రమాదముంది. జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరిగితే లోక్‌సభ స్థానాల సంఖ్య భారీగా పెరుగుతుంది. అదే జరిగితే ఉత్తరాది రాష్ర్టాలు భారీగా లబ్ధి పొందుతాయి. అదే సమయంలో దక్షిణాది రాష్ర్టాల ప్రాతినిధ్యం తగ్గి, భవిష్యత్తులో దక్షిణాది గళానికి విలువ లేకుండాపోతుంది.
1951-52లో దేశ జనాభా 36 కోట్లు కాగా, అప్పుడు లోక్‌సభ సీట్లు 489. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన 1971లో దేశ జనాభా 54 కోట్లు. అప్పుడు సీట్ల సంఖ్యను 545కు పెంచారు. 1976లో కుటుంబ నియంత్రణ కార్యక్రమం జోరుగా సాగుతున్నది. తాము జనాభాను నియంత్రిస్తే లోక్‌సభ స్థానాల సంఖ్య తగ్గే ప్రమాదముందని అప్పట్లోనే దక్షిణాది రాష్ర్టాలు అనుమానం వ్యక్తం చేశాయి. దీంతో 1976లో లోక్‌సభ సీట్ల సంఖ్యకు మరో 25 ఏండ్లపాటు 1971 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకోవాలని 42వ రాజ్యాంగ సవరణ చేశారు. 2001లో నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉన్నా.. అప్పటి ప్రధాని వాజపేయి 84వ రాజ్యాంగ సవరణ చేశారు. లోక్‌సభ సీట్ల సంఖ్య పెంపు అంశాన్ని 2026కి వాయిదా వేశారు. దీంతో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 2026లో ఎలాగైనా నియోజకవర్గాలను పునర్విభజించాలని భావిస్తున్నది. జనగణనను పూర్తి చేసి నియోజకవర్గాలను పునర్విభజిస్తారా? లేదా 2011 డేటాను పరిగణనలోకి తీసుకొని పునర్విభజన చేస్తారా? అనేది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉన్నది.
ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం 80 లోక్‌సభ స్థానాలున్నాయి. పునర్విభజనతో ఆ రాష్ట్రంలో సీట్ల సంఖ్య 120కి చేరుకునే అవకాశం ఉంది. రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ సహా ఇతర ఉత్తరాది రాష్ర్టాల్లో సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగే ఆస్కారం ఉంది. 1952లో పార్లమెంట్ స్థానాల సంఖ్య 489 ఉన్నప్పుడు, అందులో దక్షిణాది వాటా 25.35 శాతం. 1967లో సీట్ల సంఖ్య 522కి కాగా, దక్షిణాది వాటా 24.13 శాతానికి పడిపోయింది. 1977లో సీట్ల సంఖ్య 545కు చేరగా, దక్షిణాది సీట్ల వాటా 23.85 శాతానికి పడిపోయింది. అయితే, ప్రస్తుతం డీలిమిటేషన్‌తో తెలంగాణలో లోక్‌సభ సీట్ల సంఖ్య 17 నుంచి 20కి మాత్రమే పెరుగుతాయి. ఏపీలో 25 నుంచి 28కి, తమిళనాడులో 39 నుంచి 41కి సీట్లు పెరిగే ఆస్కారం ఉంది.
జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాదిలోని నాలుగైదు రాష్ర్టాల్లో సత్తా చాటే పార్టీ సులభంగా కేంద్రంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుంది. దీంతో దక్షిణాది రాష్ర్టాలు తమ హక్కులను కోల్పోయే ప్రమాదముంది. ఇప్పటికే జాతీయ భాష అంటూ హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. నిధుల విషయంలోనూ మొదటి నుంచీ అన్యాయం జరుగుతున్నది. ఈ తరుణంలో పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గితే దక్షిణాదిని కేంద్రం అస్సలు పట్టించుకోదు.
డీలిమిటేషన్ వల్ల మనకు జరిగే అన్యాయంపై దక్షిణాదికి చెందిన మెజారిటీ రాజకీయ పార్టీలు ఏకమై జేఏసీగా ఏర్పడి పోరాటానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే తమిళనాడులో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, పినరయి విజయన్, భగవంత్ మాన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇందులో పాల్గొన్నారు. పలు తీర్మానాలను ఆమోదించి కేంద్రం ముందుంచారు. డీలిమిటేషన్‌ను మరో 25 ఏండ్లు వాయిదా వేయాలన్నది ఇందులో ముఖ్యమైనది. జేఏసీ రెండో సమావేశాన్ని తెలంగాణలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలిపిన టీడీపీ, జనసేనతోపాటు వైఎస్ఆర్సీపీ సైతం ఈ దక్షిణాది రాజకీయ పార్టీల జేఏసీలో యాక్టివ్‌గా కనిపించడం లేదు. సీట్ల వాటాలో దక్షిణాదికి నష్టం జరిగితే అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుందని ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీల నాయకులు గుర్తించాలి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు దక్షిణాదికి అన్యాయం చేసే డీలిమిటేషన్‌పై పోరాడాలి. లేకపోతే ప్రజల ముందు ముద్దాయిలుగా నిలబడాల్సి ఉంటుంది.
-ఫిరోజ్ ఖాన్
96404 66464