బీఆర్ఎస్; కారుచీకట్లో కాంతిరేఖ
సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నట్టు, నాడు తెలంగాణ, నేడు జాతీయ రాజకీయాలు కేసీఆర్ చుట్టూ, వారి రాజకీయ ఎజెండా చుట్టూ తిరుగుతున్నాయి. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం మొదలు, నేటి బీఆర్ఎస్ వరకు నాడు జై తెలంగాణ అన్నా, నేడు ’
సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నట్టు, నాడు తెలంగాణ, నేడు జాతీయ రాజకీయాలు కేసీఆర్ చుట్టూ, వారి రాజకీయ ఎజెండా చుట్టూ తిరుగుతున్నాయి. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం మొదలు, నేటి బీఆర్ఎస్ వరకు నాడు జై తెలంగాణ అన్నా, నేడు ’అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ అని నినదించిన వారి ఎజెండాయే రాజకీయాలకు కేంద్ర బిందువైంది.
కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ను ప్రారంభించినప్పుడు చంద్రబాబు, వైఎస్సార్ లాంటి బలమైన నాయకులున్నారు. 1952, 1969 ఉద్యమ వైఫల్యాల నైరాశ్యం తెలంగాణ సమాజంలో ఆవరించి ఉన్నది. గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని హింస తెలంగాణ సాధనకు ఆటంకమని కేసీఆర్ బలంగా నమ్మారు. గాంధేయ మార్గంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య మార్గంలో తెలంగాణ సాధనకు నడుం బిగించారు. శాంతియుత ఉద్యమం, ఎన్నికలు, ఉప ఎన్నికలను తెలంగాణ భావవ్యాప్తికి వాడుకొని తెలంగాణను ఒక అజేయమైన రాజకీయశక్తిగా మార్చారు. కఠోర శ్రమ, అకుంఠిత దీక్షతో 2014 జూన్ 2న తెలంగాణ సాధించారు.
తెలంగాణ ఏర్పడగానే కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణం జరగాలని కోరుకున్నారు. దానికి సుస్థిర ప్రభుత్వం అవసరమని, రాజకీయ పునరేకీకరణ జరగాలని కోరుకున్నారు. అందులో భాగంగా అనేకమంది అనుభవజ్ఞులను టీఆర్ఎస్లో చేర్చుకొని, పునర్నిర్మాణం వైపు అడుగులు వేశారు. నాడు కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణం జరగాలన్నప్పుడు చాలామంది సంశయించినట్టుగానే, నేను కూడా అపోహపడ్డాను. తెలంగాణలో రాళ్లూ రప్పలు తప్ప ఏమీ లేవు.
పునర్నిర్మాణం ఎలా సాధ్యమని. ఎందుకంటే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చాలామంది రాజకీయ నాయకులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు అనేక నినాదాలు, వాగ్దానాలు, హామీలు ఇస్తూనే ఉన్నారు. గరిబీ హఠావో, వ్యవసాయ విప్లవం, పారిశ్రామిక విప్లవం, కూడు, గూడు, గుడ్డ ఇలా ఎన్నో నినాదాలుగానే మిగిలిపోయాయి. అందుకే నాకు ఆ సంశయం.
తెలంగాణ ఏర్పడకముందు తెలంగాణ అంటే కరువు. నెర్రెలువారిన బీళ్ళు, నీళ్లు లేక ఎండిన చేన్లు. ఎండిన బోర్లు, కాలిన మోటార్ల కరెంటు కష్టాలు. కానీ ఇప్పుడు తెలంగాణ అంటే పచ్చని పొలాలు, నీటితో నిండిన చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, 24 గంటలు నిరంతరం నీళ్లు పోసే బోర్లు. కేవలం తొమ్మిదేండ్ల వ్యవధిలో ‘Bottom of Strategy’తో రూరల్, అగ్రికల్చరల్ ఎకానమీ అనే అభివృద్ధి నమూనాతో కేసీఆర్ తెలంగాణను పునర్నిర్మించారు. సాగు, తాగునీరు, నిరంతర విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు, దళితబంధు, కల్యాణలక్ష్మి లాంటి పథకాలతో తెలంగాణను కేసీఆర్ సంక్షేమ రాజ్యంగా మార్చారు. తద్వారా కేసీఆర్ సంప్రదాయ రాజకీయ నాయకుడు, పాలకుడు కాదని, దేశంలోనే ఒక విజినరీగా, కార్యదక్షుడిగా నిరూపితమైంది.
బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఖమ్మం, నాందేడ్ బహిరంగ సభల్లో బీఆర్ఎస్ విధానపర నిర్ణయాలను, ఎజెండాను ప్రకటించారు. భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందని, భారత్‌ను పునరావిష్కరించాల్సిన (India Reinvent) అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. దానికోసం వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక, న్యాయ, రాజ్యాంగ, పాలనాసంస్కరణలను వివరంగా దేశం ముందుంచారు. సకలజనుల సంక్షేమం, సర్వధర్మ సమ భావనలతోనే భారత జాతి నిర్మా ణం (Nation Building) సంపూర్ణమవుతుందని, ఇదే భారతదేశ సనాతన హైందవ ధర్మమని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్ల తర్వాత భారత్‌ను పునరావిష్కరించుకోవలసిన అగత్యం ఏర్పడటం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారకులు దేశాన్ని ఎక్కువకాలం పాలించిన కాంగ్రెస్, బీజేపీలే అన్నది వాస్తవం. స్వాతంత్య్రం వచ్చిన తరువాత నెహ్రూ, అంబేద్కర్, పటేల్ లాంటివారు దేశాభివృద్ధికి అనేక ప్రణాళికలు రచించి పునాదులు వేశారు. కానీ తర్వాత వచ్చిన పాలకులు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో సూచించిన సంక్షేమ రాజ్య భావనకు తిలోదకాలిచ్చారు. వ్యవసాయ విప్లవం, పారిశ్రామిక విప్లవం, గరీబీ హఠావో లాంటివి నినాదాలకే పరిమితమయ్యాయి. గ్రామీణ భారతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. సరళీకృత ఆర్థిక విధానాలతో పాటు అదనంగా పేదల సంక్షేమాన్ని కొనసాగించకపోవడం వల్ల గ్రామీణ ఆర్థికవ్యవస్థ సంక్షోభంలోకి నెట్టివేయబడింది.
గుజరాత్‌ను వెలిగించినట్టే, భారత్‌ను వెలిగిస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ ఒక అడుగు ముందుకేసి దేశాన్ని పూర్తిస్థాయిలో పెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థగా మార్చాడు.
1975లో ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధిస్తే, నేడు నరేంద్ర మోదీ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చటం, ఈడీ, ఐటీ దాడులకు పాల్పడుతున్నది. వీరి ఆగడాలు ఇలాగే కొనసాగితే 2024 ఎన్నికలే ఈ బీజేపీకి చివరి ఎన్నికలు కానున్నాయి. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రమాదంలోపడిన ఈ సందర్భంలో కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారు. ఈ పార్టీ ఇప్పుడు దేశానికి కారుచీకట్లో కాంతిరేఖగా కనిపిస్తున్నది. ఇప్పటికే దేశంలో కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ప్రగతిశీల ప్రాంతీయ పార్టీలు కేసీఆర్ వెంట తాము నడుస్తామని బాహాటంగానే మద్దతు ప్రకటిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలో కిసాన్ సర్కార్ ఏర్పడబోతున్నది. ఆయనతోనే ఈ దేశంలో మార్పు రానున్నది.
దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెట్టి దేశాన్ని ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థగా మార్చాడు. దీంతో దేశంలో అత్యంత ధనికులు, అత్యంత పేదలనే 2 వర్గా లు ఏర్పడ్డాయి. ఈ ఆర్థిక సంక్షోభానికి తోడు బీజేపీ దేశంలో మతాల మధ్య, కులాల మధ్య విభజన రేఖలు గీస్తూ దేశంలో రాజ్యాంగ వ్యతిరేక భావనలను, అసహనం, విద్వేషం, మూక దాడులను ప్రోత్సహిస్తున్నది. దీనికితోడు ఏక పార్టీ రాజ్యాంగాన్ని తీసుకురావాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తున్నది.
డి.రాజారాం యాదవ్
97051 31472
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
- Tags
- BRS
- CM KCR
- national politics
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

