భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా ప్రమాణం చేసి పదవిలో కొనసాగిన నాయకులు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందు ముగ్గురున్నారు. ఈ ముగ్గురు మహా నేతలు పండిత జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజపేయి తమ మూడో పదవీకాలాల్లో ప్రజాదరణ కోల్పోయారు. 18వ లోక్‌సభ ఎన్నికల్లో పదేండ్లుగా పాలకపక్షం బీజేపీ మెజారిటీ సాధించడంలో విఫలమయ్యాక మొదలైన నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం కూడా జనాదరణ కోల్పోయే అవకాశాలే కనిపిస్తున్నాయి.
1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన రాజ్యాం గం ప్రకారం జరిగిన 1952 సాధారణ ఎన్నిక ల నుంచే నెహ్రూ పాలన మొదలైనట్టు భావిస్తే ఆయన నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు వరుసగా మూడు పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించింది. మొదటి ఎన్నికలతో పోల్చితే ఐదేండ్ల నెహ్రూ పాలన తర్వాత రెండో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం 1952 నాటి 44.99 శాతం నుంచి 47.78 శాతానికి (1962) పెరిగింది. మూడో లోక్‌సభ ఎన్నికల్లో కూడా నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ సీట్ల పరంగా భారీ మెజారిటీ సాధించింది గాని ఈ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 44.7 శాతానికి పడిపోయింది.
తొలిసారి అవిశ్వాస తీర్మానం: యుద్ధంలో ఓటమి ఇంటా బయటా నెహ్రూ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చింది. 1962 లోక్‌సభ ఎన్నికల నుంచి 1963 జూలై మధ్య 10 ఎంపీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 4 మాత్రమే నిలబెట్టుకోగా, ప్రతిపక్షాలు 6 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ప్రతిపక్ష దిగ్గజాలు డాక్టర్ రాం మనోహర్ లోహియా, జేబీ కృపలానీ 1963 ఏప్రిల్ ఉప ఎన్నికల్లో వరుసగా ఫారూఖాబాద్, ఆమ్రోహా (యూపీ) నుంచి పార్లమెంటుకు ఎన్నికవడం విశేషం. 1952 నుంచీ నల్లేరుపై బండిలా సాగుతున్న నెహ్రూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మొదటిసారి 1963 పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కృపలానీ చొరవతో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. కాంగ్రెస్‌కు మూడింట రెండొంతులకు పైగా ఉన్న మెజారిటీ కారణంగా తీర్మానం వీగిపోయింది. కానీ, నెహ్రూకు ఇది మరచిపోలేని పరిణామం. ప్రధాని అనారోగ్యం, కాంగ్రెస్ కోల్పోతున్న ప్రజాదరణ ఫలితంగా ‘నెహ్రూ తర్వాత ఎవరు?’ అనే సమస్య జటిలం కాకుండా చూడటానికి 19 63 అక్టోబర్‌లో తిరుపతిలో కాంగ్రెస్ అగ్రనేత కె.కామరాజ్ ఆధ్వర్యంలో కొందరు కాంగ్రెస్ సీనియర్లు ‘సిండికేట్’ అనే ఒక గ్రూపుగా ఏర్పడ్డారు.
‘నెహ్రూ అనంతర కాంగ్రెస్’ను గట్టెక్కించే బాధ్యతను సిండికేట్ తలకెత్తుకున్నది. మొదట్నుంచీ కశ్మీర్ విషయంలో అప్రజాతంత్ర పోకడలకు బాటలేసిన నెహ్రూ కశ్మీర్ సింహంగా పేరొందిన షేక్ అబ్దుల్లాను ఎలాంటి విచారణ లేకుండా జైల్లో వేసి 11 ఏండ్లు ఉంచడాన్ని కశ్మీరీలు జీర్ణించుకోలేకపోయారు. ఈ పరిస్థితుల్లో శ్రీనగర్‌లోని హజ్రత్ బల్ నుంచి 1963, డిసెంబర్ 26న ప్రవక్త మహ్మద్ పవిత్ర కేశాన్ని ఎవరో తస్కరించడంతో కేంద్ర సర్కారుకు పెద్ద సమస్య ఎదురైంది. హజ్రత్ బల్ పరిణామంతో అనేక ప్రాంతాల్లో హిందూ ముస్లిం ఘర్షణలు జరిగాయి. పవిత్ర కేశం దొరికినా ఉద్రిక్తతలు చల్లారలేదు. ఈ నేపథ్యంలో 1964, జనవరి 7న భువనేశ్వర్‌లో నెహ్రూకు స్వల్ప గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత ఆయనకు మే 27 ఉదయం గుండెపోటు రాగా మధ్యాహ్నం కన్నుమూశారు.
మూడో భారీ విజయమే ఇందిరమ్మ కొంప ముంచింది: నెహ్రూ మరణానంతరం ప్రధాని అయిన లాల్‌బహదూర్ శాస్త్రి రెండేండ్లు నిండకుండానే 1966, జనవరిలో కన్ను మూశారు. 13 రోజుల తర్వాత ఢిల్లీ గద్దెనెక్కిన ఇందిరా గాంధీ ఏడాదికే 1967 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నడిపించాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో 520 సీట్లకు గాను మెజారిటీకి (261) అవసరమైన దానికంటే కొద్ది సీట్లు (283) కాంగ్రెస్‌కు దక్కాయి. 1969 రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా పార్టీలో తలెత్తిన సంక్షోభం చివరికి నవంబర్ లో కాంగ్రెస్ చీలికకు దారితీసింది. అత్యధిక ఎంపీలు ఇంది ర వెంటే నడవడంతో ఆమె బయటినుంచి సీపీఐ, డీఎంకే వంటి పార్టీల మద్దతుతో 1971 ఆరంభం వరకూ మైనారి టీ సర్కారును నడపగలిగారు.
1969 నుంచీ రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ, భూ సంస్కరణల అమలుకు శ్రీకారం చుట్టడం వంటి ‘ప్రగతిశీల’ చర్యల ద్వారా ఏడాదిన్నర కాలంలో ఇందిరకు దేశ ప్రజల్లో ఆదరణ పెరిగింది. అనుకూల వాతావరణం ఉందని పసిగట్టిన ఇందిరమ్మ ఏడాది ముందే లోక్‌సభను రద్దు చేయించి 1971 ఆరంభంలో మధ్యంతర ఎన్నికలు జరిపించగా, ఆమె హయాంలో తొలిసారి కాంగ్రెస్‌కు మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చింది. 1972 ఫిబ్రవరి, మార్చిలో అనేక రాష్ర్టాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ఇందిర పార్టీ తిరుగులేని మెజారిటీలతో ప్రభుత్వాలు ఏర్పాటుచేసింది. ఆ తర్వాత దేశంలో అనావృష్టి, ధరల పెరుగుదల, గుజరాత్, బీహార్ వంటి అనేక కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో పెచ్చుమీరిన అవినీతి, నిరుద్యోగం ఫలితంగా 1974 నాటికి విద్యార్థుల ఆందోళనలు, అశాంతితో దేశం అట్టుడికింది.
ఎమర్జెన్సీ ప్రయోగంతో భారత రాజ్యాంగానికి తాత్కాలికంగా తిలోదకాలు: 1971లో యూపీలోని రాయబరేలీ నుంచి ఇందిర ఎన్నిక చెల్లదని 1975 జూన్‌లో అలహాబా ద్ హైకోర్టు తీర్పు ఇచ్చించి. ఇది జరిగిన కొద్దిరోజులకే 1975, జూన్ 25న ప్రజల అన్ని ప్రజాస్వామ్య హక్కులకూ తిలోదకాలిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. లక్ష మందికి పైగా ప్రతిపక్ష నేతలను ఎలాంటి విచారణ లేకుండా జైళ్లకు పంపించారు. చిన్న కొడుకు సంజయ్ గాంధీ, మరి కొందరితో కూడిన కోటరీ సాయంతో మొదట పరిపాలన సజావుగా సాగినా 1977 ఆరంభం నాటికి అంతర్జాతీయంగా తనకు వచ్చిన చెడ్డ పేరు, అప్పుడు ఎన్నికలు జరిపితే కాంగ్రెస్ తిరుగులేని మెజారిటీ సాధిస్తుందనే ‘ఇంటెలిజెన్స్’ సర్వేల జోస్యాల ఫలితంగా 1977 ఫిబ్రవరి, మార్చిలో ఇందిర జరిపించిన ఆరో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. తండ్రి నెహ్రూ మాదిరిగానే ముచ్చటగా మూడోసారి ప్రమాణం చేశాక తన పాలనాకాలంలో చేసిన తప్పులు, నేరాల ఫలితంగా ఇందిరమ్మ పరాజయంతో ఇంటి బాట పట్టక తప్పలేదు.
ప్రస్తుత బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ మూడో విడత పాలన ఈ నెల ఆరంభంలో మొదలైంది. రెండో పదవీకాలంలో కేంద్ర సర్కారును నడుపుతున్న బీజేపీ అనేక సవా ళ్లు ఎదుర్కొన్నది. మణిపూర్ సంక్షోభం, తీవ్ర నిరుద్యోగం, గుజరాత్ సహా అనేకచోట్ల చిన్న, మధ్యతరహా వ్యాపారాల దివాళా వంటి సమస్యలన్నింటినీ అయోధ్య రాముడి గుడి నిర్మాణంతో జనం విస్మరించేలా చేయవచ్చనే కాషాయ శిబిరం పన్నిన పథకం పారలేదు. మెజారిటీకి అవసరమైన 272 సీట్లకు 32 తగ్గి మోదీ-షా బండి 240 సీట్ల దగ్గరే ఆగిపోయింది. నిరుద్యోగం, వ్యవసాయరంగ సంక్షోభం వంటి ప్రధాన సమస్యలు మోదీ నాయకత్వంలోని మూడో ఎన్డీయే సర్కారును ఏ క్షణాన కుదేలయ్యేలా చేస్తాయో చెప్పడం కష్టమన్నట్టుంది పరిస్థితి. గుజరాత్ నుంచి వెళ్లి కాశీ ఎంపీగా పదేండ్లు పూర్తిచేసుకున్న మోదీ చివరికి యూపీ ప్రధానులు నెహ్రూ, ఇందిర మాదిరిగా తన మూడో పదవీకాలంలో జనాదరణ కోల్పోతారా? లేక రెండేళ్ల తర్వాత తనకు అనుకూలంగా కనిపించిన సమయంలో 18వ లోక్‌సభ రద్దుకు సిఫారసు చేయించి మధ్యంతర ఎన్నికలు జరిపిస్తారా? అనేది ఇప్పుడెదురవుతున్న ప్రశ్న.
-నాంచారయ్య మెరుగుమాల