మావోయిస్టు పార్టీ వామపక్ష ఉగ్రవాద పార్టీ అని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తున్నది. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇదే రకమైన ప్రకటన చేశారు. తెలంగాణను మావోయిస్టుల కేంద్రంగా మార్చొద్దని ఆయన హెచ్చరించారు కూడా. అయితే, కేంద్రం చెప్తున్నట్టుగా మావోయిస్టు పార్టీ వామపక్ష ఉగ్రవాద పార్టీ కానే కాదు.
మావోయిస్తు పార్టీపై 1992 నుంచి అమలవుతున్న నిషేధం ప్రజాస్వామ్య బద్ధమైనది కాదు. ఈ నిషేధంపై దేశవ్యాప్తంగా మేధావులు, హక్కుల సంఘాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. రాజ్యాంగం ప్రజలకు న్యాయం చేసే స్థితిలో లేదని విప్లవ భావాలతో, ఒక శాస్త్రీయమైన ఆచరణతో మావోయిస్టు పార్టీ మొదటినుంచీ పోరాడుతున్నది. ప్రజల హక్కుల కోసం పోరాడుతూ ఇప్పటికే 1,600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 10 రాష్ట్రాల ప్రజలను, 175 జిల్లాల్లోని 35 శాతం జనాభాను ఆ పార్టీ ప్రభావితం చేసిందని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. బలమున్నా, లేకపోయినా మావోయిస్టు పార్టీ దృష్టికి వచ్చిన ప్రతీ సామాజిక సమస్యపై తన వైఖరిని ప్రకటిస్తూనే ఉన్నది. ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తూ అనేక విజయాలు కూడా సాధించింది. ఇది ఆ పార్టీ చరిత్ర. అందుకే, 2004లో తప్పనిసరి పరిస్థితుల్లో నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం శాంతి చర్చలు జరిపింది. ఈ చరిత్రను బీజేపీ సర్కారు విస్మరించింది.
వాస్తవానికి బీజేపీ రాజ్యాంగాన్ని పక్కకుపెట్టేసింది. బాబ్రీ విధ్వంసం అయినా, గుజరాత్ అల్లర్లు అయినా, ముజఫర్‌నగర్ లైంగికదాడి అయినా, కాందమాల్ క్రైస్తవులపై దాడి అయినా.. రాజ్యాంగం అమల్లో ఉన్నదనే విషయాన్ని మరిచి ఏకపక్ష దాడులు, దారుణాలతో దేశం భయపడేలాగా చేసిందే బీజేపీ. ఇప్పటికీ దేశంలో మైనారిటీలు భయం భయంగా బతుకుతున్నారు. ఈ పరిస్థితి కల్పించింది ఎవరో మనందరికి తెలిసిందే.
మన దేశంలో ఉన్న సహజ వనరులను కాపాడే బాధ్యతను, భూస్వాముల దగ్గర ఉన్న వేలాది ఎకరాలను పేదలకు పంచే బాధ్యతను మావోయిస్టు పార్టీ తన భుజాలపై వేసుకున్నది. తెలంగాణ పోరాటంలో, జగిత్యాల, సిరిసిల్ల రైతాంగ పోరాటాల్లో దున్నేవాడికే భూమి దక్కేలా ప్రయత్నం చేసింది. ఆ తర్వాత వచ్చిన నిర్బంధం కారణంగా పోరాటానికి దండకారణ్యం కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో దండకారణ్యంలో కనుగొన్న అన్ని ఖనిజాలను కార్పొరేట్లకు అప్పగించాలన్న ఉద్దేశంతో 1992 నుంచి అణచివేత ప్రారంభమైంది.అ అందులో భాగంగానే జనజాగరణ అభియాన్ పేరుతో హత్యాకాండ కొనసా గింది. 2005లో అది సల్వాజుడుం రూపా న్ని సంతరించుకున్నది. ఆ తర్వాత 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్, 2017లో ఆపరేషన్ సమాధాన్ అనేక మంది ఆదివాసీలను, ఉద్యమకారులను బలితీసుకున్నది. అయినప్పటికీ కార్పొరేట్లకు ఖనిజ సంపదను పంచడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఈ కారణంగానే ఆదివాసీలే మావోయిస్టులనే ప్రచారం మొదలుపెట్టారు.
న్యాయస్థానాల విధులను కూడా ప్రభుత్వాలే ఆక్రమించి తూటాలతోనే తీర్పులు ఇస్తున్నాయి. ఈ కారణంగానే మేధావులు చర్చల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా స్పందించింది. మావోయిస్టు పార్టీతో కేంద్రం చర్చలు జరపాలని, ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని వరంగల్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ ప్రకటనను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. మావోయిస్టులకు తెలంగాణ అడ్డాగా మారుతున్నదని పేర్కొన్నారు.
శాంతి చర్చల కోసం మావోయిస్టు పార్టీ ఐదు నెలలుగా ప్రయత్నిస్తున్నది. అయినా కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజా ఆందోళనలు, పోరాటాలు సహజం. చర్చలు జరిపి, ఆ పోరాటాలకు పరిష్కారాన్ని కనుగొనడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల విధి. ఈ సూత్రాన్ని మోదీ సర్కారు విస్మరిస్తున్నది. ఇప్పటికే 18 నెలల్లో 600 మందిని ఎన్కౌంటర్ పేరిట కేంద్రం హత్యాకాండ చేసింది. ఎన్కౌంటర్ అంటే ప్రభుత్వం చేస్తున్న హత్యలని ప్రజలకు కూడా అర్థమైపోయింది. ప్రభుత్వాలే హత్యలు చేస్తే న్యాయస్థానాలు ఎందుకు? రాజ్యాంగం ఎందుకు? ప్రజాస్వామ్యం ఎందుకు?
నిరసన తెలిపినవారిని, ప్రశ్నించినవారిని అంతమొందించి ప్రజాస్వామ్యం బతికే ఉందని ప్రజలను భ్రమింపజేయడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అణచివేతను ప్రజలు ఎల్లకాలం భరించరు. ఇప్పటికైనా మోదీ, అమిత్ షా తమ విధానాన్ని మార్చుకొని మావోయిస్టులతో చర్చించాలి.