నాటి ఎమర్జెన్సీ రోజులను నేటి నరేంద్ర మోదీ పాలన గుర్తుకుతెస్తున్నది. ఇందిరా గాంధీ పాలనలో 21 నెలలు మాత్రమే ఎమర్జెన్సీని చూస్తే, నేడు మోదీ నాయకత్వంలో ఎనిమిదిన్నరేండ్ల నిరంకుశ, నియంతృత్వ పాలన కొనసాగుతున్నది. 2015లోనే మోదీ చర్యలను గమనించిన అద్వానీ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో మళ్లా ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి తలెత్తదని చెప్పలేమని పరోక్షంగా హెచ్చరించిన సందర్భం గుర్తుకొచ్చింది.
ఎమర్జెన్సీకి ముందు ఇందిరాగాంధీ కనీసం కంటితుడుపుగానైనా ఫ్యూడల్ వ్యతిరేక చర్యలను చేపట్టారు. కానీ, నేడు మోదీ అదే ఫ్యూడల్ పాలనను పునరుద్ధరించడానికి ఏకంగా హిట్లర్ పాలనను కొనసాగిస్తున్నారు. అందుకోసం ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేస్తున్నారు.
మోదీ పాలనపై తిరుగుబాటే శరణ్యమని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీకి ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. దీంతో అసమ్మతి స్వరాలను ఆదిలోనే అణచివేయాలని, ఏదోరకంగా భయోత్పాతాన్ని సృష్టించాలని బీజేపీ మౌత్ పీస్‌గా ఉన్న రాజ్యాంగ సంస్థలు ఈడీ, సీబీఐలను ఉసిగొల్పి బీజేపీ విధానం ఇదేనని చెప్పకనే చెప్తున్నది. సరిగ్గా 47 ఏండ్ల కిందట దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన చీకటి దినం మరువకముందే ఏడు నెలలుగా ఢిల్లీ మద్యం కేసులో ఇరికించాలని ఎందుకంత తాపత్రయపడుతున్నారో అర్థం చేసుకోలేనంత అమాయక ప్రజలు తెలంగాణలో లేరు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేసీఆర్‌ను సూటిగా ఎదుర్కొనలేకనే కుటుంబసభ్యులపై దాడికి దిగింది. మార్చి 11న విచారణ పేరుతో 9 గంటలు అరాచకం సృష్టించింది. ఉద్దేశపూర్వకంగా దర్యాప్తు పేరిట వాయిదాలు వేస్తూ, పైశాచిక ఆనందం పొందుతున్నది.
ప్రస్తుత కాలంలో రాజకీయాలంటే ప్రతీకార రాజకీయాలే. అధికార పార్టీలు ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకునే, వాటిని కలుపుకొనిపోయే రాజకీయాలు ఏనాడో అంతరించాయి. ప్రతిపక్షాలు అవసరమైనప్పుడు ప్రభుత్వానికి సహకారమందించే రాజకీయాలు ఎప్పుడో కనుమరుగయ్యాయి. ఒకరినొకరు ఎలా బలహీనపరుచుకోవాలనే రాజకీయాలే ఇప్పుడు నడుస్తున్నాయి. మోదీ-షాల ద్వయం తమ రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను మతోన్మాదీకరించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. దీన్ని ప్రతిఘటించడానికి తెలంగాణ ప్రజాస్వామిక, ప్రగతిశీల, విప్లవ శక్తులన్నీ ఏకమవుతున్నాయి. కేసీఆర్ నాయకత్వంతో చరిత్ర పునరావృతం కాబోతున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో విపక్షాల మూలాలను నరికివేసి కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగానే జాతీయవాదాన్ని ఎత్తుకున్న బీఆర్ఎస్, ఆప్‌లపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నది. ఢిల్లీ మద్యం పాలసీని అడ్డుపెట్టుకొని విపక్షాల నాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నది. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశంతో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోగానే మోదీ నిస్పృహకు లోనయ్యారు. దీంతో నిరంకుశ విధానాలకు తెరలేపారు.
మోదీ పాలనలో అత్యవసర పరిస్థితి విధించకుండానే హక్కులు హరించబడుతున్నాయి. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి రాజ్యాంగ సంస్థలను గుప్పిట పెట్టుకొని ప్రశ్నించినవారిని అక్రమ కేసుల్లో నిర్భందించడం సాధారణమైంది. ఇలాంటి పరిస్థితుల్లో విపక్షాలన్నింటిని ఏకం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజల మద్దతు ఉందని విర్రవీగిన ఇందిరను, ఆమె పార్టీని 1977లో దేశ ప్రజలంతా ఘోరంగా ఓడించారు. అదో చారిత్రక తీర్పు. ఇప్పుడు కూడా అదేరీతిలో ప్రజల తిరుగుబాటు రావలసిన అవసరం ఉన్నది. చాలా రాష్ర్టాల్లో గవర్నర్లు అక్కడి ప్రజా ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అక్కడ కూడా గవర్నర్ల వ్యవస్థపై తిరుగుబాటు మొదలైంది. నాడు జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో మొదలైన తిరుగుబాటు నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తిరిగి పురుడుపోసుకుంటున్నది. బీఆర్ఎస్ నాయకత్వంలో దేశంలో సమర్థపాలన రావడం ఎంతో దూరంలో లేదు.
(వ్యాసకర్త: జర్నలిజం శాఖ విభాగాధిపతి, కేయూ)
-డాక్టర్ సంగని మల్లేశ్వర్
98662 55355