అది 2012. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజులు. వరంగల్ జిల్లా కేంద్రంగా ఎక్కడ ఉద్యమం జరిగినా, ఆ ఉద్యమాన్ని అణిచివేయజూసిన నాటి వలసాంధ్ర అధికారుల ముందుండే నాకు ఒక్కసారిగా ఏమైందో తెలియదు. కానీ, మృత్యువు అనారోగ్యం రూపంలో వచ్చింది. వరంగల్ డాక్టర్లు ‘మేం కూడా ఏమీ చేయలేమ’ని చేతులెత్తేశారట. ‘నరేందర్ ఇక బతుకడం కష్టమని తేల్చేశారట’. ఒకానొక సందర్భంలో నా భార్య వాణితో వీలునామా కూడా తీసుకున్నారట! ఈ విషయం నాటి ఉద్యమ నాయకుడు, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిసింది. ఆయన నిమిషం కూడా ఆలస్యం చేయలేదట.
మీరేం చేస్తారో తెలియదు, నరేందర్ బతుకాలి. ఎంత ఖర్చయినా పర్లేదు, ఆయనకు మెరుగైన వైద్యం అందాలి, తను మళ్లీ ఆరోగ్యవంతుడై ఉద్యమంలో చురుకుగా పాల్గొనాలని’ యశోద డాక్టర్లకు చెప్పారట. అంతే నాకు మెరుగైన వైద్యసేవలు అందాయట. డాక్టర్ సుధాకర్‌రావు ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు దూతగా ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ రోజూ నా ఆరోగ్య పరిస్థితిని కేసీఆర్‌కు తెలియజేశారట. ఇప్పటి యువమంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవితలు నిత్యం నన్ను చూసి, నా భార్య వాణిని ఓదారుస్తూ, నా ఆరోగ్య పరిస్థితిని రోజురోజుకు తెలుసుకున్నారట. రోజూ పరామర్శించారట. ఇలా… మృత్యువు దాకా వెళ్లివచ్చిన నేను మృత్యుంజయుడై మళ్లీ ఉద్యమ కదనరంగంలోకి అడుగుపెట్టడానికి కారణం నాటి ఉద్యమనేత, ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన నేను ఇప్పటికీ బతికి ఉండటానికి, నా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకే అప్పట్నుంచి కేసీఆర్ రూపంలో మా నాన్న నరసింహమూర్తిని చూసుకుంటాను.
అటా.. అటా.. అని నేనెందుకంటున్నానంటే.. వరంగల్‌లో స్పృహ తప్పిపోయిన నాకు అప్పటి దృశ్యాలేవీ గుర్తుకులేదు. నన్ను కాపాడుకోవడానికి నా సతీమణి వాణి పట్టుదలతో అడుగుముందుకేస్తే.. నన్ను కాపాడుకున్నది, నాకు పునర్జన్మనిచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం. అయితే 2012లో జరిగిన సన్నివేశం గుర్తుకువచ్చినప్పుడల్లా వాణి నాతో ‘మిమ్మల్ని సజీవంగా ఇలా చూసుకునే భాగ్యం కల్పించిన ఆ దేవునికి నేనెప్పుడూ రుణపడి ఉంటా’నని తరచూ చెప్తూ ఉంటుంది. ఏటా ఫిబ్రవరి 17న జరిగే ముఖ్యమంత్రి ‘కేసీఆర్ బర్త్ డే’ వేడుకలను మనం వినూత్నంగా చేయాలనే తన ఆలోచననూ పంచుకున్నది నాతో.
అంతే.. నాకు ఒక్కసారిగా ఖమ్మంలో జరిగిన తొలి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సమావేశం గుర్తుకువచ్చింది. ఆ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రులు కండ్లముందు మెరిశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను, ప్రజా సంక్షేమ పథకాలను వారు కీర్తించిన తీరు నన్ను ఆనదింపజేసింది. ముఖ్యంగా యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మాట్లాడిన తీరు నన్ను వినూత్న దిశగా ఆలోచింపజేసింది. ‘కేసీఆర్ జీ మీ తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తున్నది. మీ ప్రభుత్వం చేస్తున్నది ఎక్కువ, చెప్పుకొంటున్నది తక్కువ’ అని ఆయన నోట కేసీఆర్‌ను పొగుడుతూ అన్న మాటలు గుర్తుకువచ్చాయి. ఫిబ్రవరి 17 ముఖ్యమంత్రి పుట్టినరోజు కానీ…
సీన్ కట్ చేస్తే… ఫిబ్రవరి 15 రోజునే అజాంజాహీ మిల్స్ గ్రౌండ్స్ లైట్లతో వెలిగిపోయింది. 16, 17, 18 ఈ నాలుగు రోజులు కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలు సాగాయి. 2001 ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా… సాగరహారం.. సకలజనుల సమ్మె, అల్గునూరు అరెస్టు, ఖమ్మం జైలుకు తరలింపు, కేసీఆర్ నిరాహార దీక్ష ఇలా అన్ని ఉద్యమ కార్యక్రమాల ఫొటో ప్రదర్శనను ఏర్పాటుచేశాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం సెట్ తళతళా మెరిసింది. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాల గురించి అవగాహన సదస్సులు జరిగాయి.
ఎందుకోసం కేసీఆర్ ఈ పథకాలు ప్రవేశపెట్టారో ప్రజలకూ స్క్రీన్ల ద్వారా వివరించడమూ జరిగింది. రాష్ట్ర నలుమూలల టీవీ లైవ్ కార్యక్రమాలు సాగాయి. కేసీఆర్ సార్ బర్త్ డే సందర్భంగా ఓ పాటనూ విడుదల చేశాం. ఆ నాలుగు రోజులు అజాంజాహీ మిల్స్ గ్రౌండ్స్‌కు వచ్చిన ప్రజలు కేసీఆర్‌ను వేనోళ్ల కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వందేండ్లు వర్ధిల్లాలని, బీఆర్ఎస్ పార్టీ దేశ గతిని మార్చాలని దీవెనలందించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అధోగతి పాలవుతున్నది. మళ్లీ గాడిలో పడాలంటే ఈ దేశానికి కేసీఆర్ నాయకత్వం తప్పనిసరి అని ప్రజలు కోరారు. స్వరాష్ట్రం వస్తే తెలంగాణ అంధకారమవుతుందన్నారు, కానీ నేడు తెలంగాణ 24 గంటల నిరంతర విద్యుత్తు వెలుగులతో విరాజిల్లుతున్నది. ఈ దేశానికి మాడల్‌గా తెలంగాణను తీర్చిదిద్దింది ఉద్యమ నేత కేసీఆర్. అందుకే యావత్ దేశం ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నదని ప్రజలు ఆకాంక్షించారు.
నాకు పునర్జన్మనిచ్చి, నాకు రాజకీయ భిక్షపెట్టిన కేసీఆర్ కోసం నేనేం జేసినా తక్కువే. తెలంగాణ ప్రజల కోసమే తన జీవితాన్ని పణంగా పెట్టిన దీరోధాత్తుడు కేసీఆర్. ఆయన నిండు నూరేండ్లు సల్లగా బతుకాలని ఆశిస్తూ నేను తలపెట్టిన ఈ కార్యక్రమం నన్ను, వాణిని, నా కుటుంబాన్నే కాదు, వరంగల్‌లో ప్రజలందరినీ ఆనందింపజేసింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలందరూ వచ్చారు. వినూత్నంగా సాగిన ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే వేడుకలు రాష్ట్ర ప్రజలను, నాయకులను ఆలోచింపజేసిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా..
(వ్యాసకర్త: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే)
-నన్నపనేని నరేందర్