‘నా ఇంటి పేరు ప్రపంచం
ప్రజలే నా కుటుంబం
వెదజల్లుతా దిగ్ దిగంతం
అభ్యుదయ సుగంధం అప్పుడు నా జీవితమే ఒక ప్రబంధం’
అని చాలా రోజుల కిందట సినారె ఒక కవిత రాశారు. కవితలు కవుల ఊహల్లో, జీవితానుభవాల్లో ఊపిరి పోసుకుంటాయి. అవి పుస్తకాల పేజీల మధ్య బందీగా ఉండి చదువరులకు ప్రేరణ ఇస్తాయి. అలాంటి ఒక కవిత నిండైన మనిషి రూపం దాల్చి మనలో ఒకడిలా ఒక ఇంటికి పెద్ద కొడుకులా, ఒక చెల్లికి అన్నలా, ఒక రాష్ర్ర్టానికి మార్గదర్శకుడిలా ఉంటే ఎలా ఉంటుంది. మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లా ఉంటుంది.
అయితే, తెలంగాణ వచ్చిన దగ్గరనుంచి కొందరు కేసీఆర్ కుటుంబపాలన అంటూ విష ప్రచారాన్ని లంకించుకున్నారు. ఈ విష ప్రచారం అసలు లక్ష్యం వాళ్లు అధికారాన్ని పొందటం కోసమేనన్నది స్పష్టమే. తెలంగాణ వచ్చాక జరిగిన అభివృద్ధితో పాటుగా గతంలో పాలనను కొనసాగించిన ఆధిపత్యవర్గాల చేతుల్లోంచి అధికారం బదలాయింపు జరిగింది. తెలంగాణ వస్తే వచ్చింది కానీ, తమ పాత ఆధిపత్యం కోటలు పడిపోతాయని ఎవరూ ఊహించలేదు. అందుకే కేసీఆర్ పాలనపై ద్వేషాన్ని పెంచటానికి కుటుంబపాలన అంటూ అడ్డగోలుగా రాజకీయ ప్రకటనల విధ్వంసాన్ని సృష్టించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత వేగవంతంగా జరుగుతున్న మార్పులపై ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అన్న అంశంపై జరగాల్సిన చర్చను బరాబర్ ముందుకుతెచ్చి మాట్లాడాలి. పంటలు సమృద్ధిగా పడటం, దేశానికే తెలంగాణ ధాన్యాగారంగా మారటం, కోటి ఎకరాలకు నీళ్లందించడమే లక్ష్యంగా కాళేశ్వరం మహా ప్రాజెక్టుతో గంగమ్మ ప్రవాహం, ఫార్మా సిటీలు, ఐటీలో దూసుకుపోవటాలు, రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలు, ప్రైవేటురంగం, ఐటీ రంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పన, పూసిన పున్నమిలా పచ్చబడ్డ తెలంగాణ, పట్టణాభివృద్ధి, దళితబంధు, బీసీ కులవృత్తులకు అండగా జరుగుతున్న కార్యక్రమాలు, బీసీల ఆత్మగౌరవ భవనాలు, గురుకులాలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఇట్లా చెప్పుకొంటూపోతే ఎన్నో ఆసరా పథకాలు వచ్చాయి. వీటిపైన పరిశోధనలు జరగాలి. తెలంగాణ ఎకనామిక్ పాలసీ తెలంగాణ మోడల్‌గా దేశ రాజకీయ అజెండాగా రూపుదాల్చబోతున్నది. కానీ తెలంగాణలో మాత్రం కుటుంబపాలన అన్న ఒక తేలిపోయే మాటతో అరిస్తే లాభం ఉండదని తెలిసి కూడా అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారు. ‘సంపద పెంచాలి-సంపద పంచాలి’ అన్న దీర్ఘకాలిక ఆలోచనలతో కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అది సత్యం.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడిన మూడు గంటల సుదీర్ఘ ప్రసంగంలో చాలా అంశాలు తడిమారు. అందు లో ఆయన మాట్లాడుతూ
‘అవును మాది కుటుంబ పాలనే’ అన్నారు. ‘మాది అవిభక్త తెలంగాణ కుటుంబపాలన’ అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు.
‘అవిభక్త తెలంగాణ కుటుంబం అనే స్ఫూర్తివంతమైన భావజాలాన్ని మా జెండా చేసుకునే ముందుకుసాగుతున్నాం. దీన్నుం చి మమ్మల్ని ఎవరూ వేరు చేయలేర’ని విజ్ఞతగా కేటీఆర్ మంచి సమాధానమిచ్చారు. ‘ఆ తెలంగాణ సమాజ కుటుంబ పాలన కోసం కావలి కుక్కలుగానే ఉంటాం. బరాబర్ ఉంటాం. ఈ తెలంగాణ కుటుంబాన్ని పర్యవేక్షిస్తున్నాం. దీన్ని కాపాడుకుంటాం. తల్లి కోడిలాగా తమ రెక్కల కింద దాచుకుంటాం. అధికారమే పరమావధిగా తన్నుకపోజూస్తున్న ఆధిపత్య గద్దల గోర్ల నుంచి తెలంగాణ కుటుంబ సమాజాన్ని సెంట్రీలా కాపలా కాస్తూ ఉంటాం. అవును ఎవరేమన్నా మాది బరాబర్ అవిభక్త తెలంగాణ కుటుంబ పాలనే’ అని కేటీఆర్ చెప్పటం బాగుంది.
కేటీఆర్ అయినా, కవిత అయినా, హరీశ్‌రావు అయినా అయాచితంగా ఎవరు రాలేదు. వీళ్లను ప్రజలు నెత్తిన పెట్టుకొని గెలిపించారు. ప్రజల ఓట్ల సాక్షిగా ఎన్నికై ప్రజా ప్రతినిధులుగా చట్టసభల్లో అడుగుపెట్టారు. మొత్తం తెలంగాణ సమాజం బాధ్యతను, అవిభక్త తెలంగాణ కుటుంబం బాధ్యతను కుటుంబపెద్ద కేసీఆర్‌కు అప్పగించారు. దీన్ని తెలంగాణ సమాజం కాదనదు. ఫిబ్రవరి 27న ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో 14 గ్రామాలకు నీళ్లందించేందుకు 124 కోట్లతో చేపట్టే 3 లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగసభలో కేటీఆర్ మాట్లాడుతూ ‘మాది బరాబర్ కుటుంబ పాలన’ అంటూ పునరుద్ఘాటించి మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీల నేతలు మాట్లాడితే రాష్ట్రంలో కుటుంబపాలన అంటున్నారు.
నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పా ఇప్పుడు చెప్తున్నా.. బరాబర్ కుటుంబ పాలనే. నాలుగు కోట్ల ప్రజల తెలంగాణ రాష్ట్రం వసుధైక కుటుం బం. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది మా కుటుంబసభ్యులే. 44 లక్షల మంది ఆసరా పింఛన్‌దారులకు 20 వేల కోట్ల పింఛన్లు ఇస్తున్న పెద్ద కొడుకు కేసీఆర్. 12 లక్షల మంది యువతులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద 800 కోట్లు అందించి, 14 లక్షల మందికి ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు చేయించి కేసీఆర్ కిట్లు అందించిన మేనమామ కేసీఆర్. 978 గురుకులాలు ఏర్పాటుచేసి ఐదున్నర లక్షల మంది విద్యార్థులు ఒక్కొక్కరికి ఒక 1 లక్ష 20 వేల చొప్పున 7 వేల కోట్లు అందించి ఉన్నత చదువులు చదివిస్తున్న తాతగా కేసీఆర్‌ను చూస్తున్నారు. అందుకే ‘బరాబర్ మాది ముమ్మాటికీ కుటుంబ పాలనే’ అని కేటీఆర్ అనటంతో మాది అవిభక్త తెలంగాణ కుటుంబమని చాటి చెప్పినట్లయింది.
(వ్యాసకర్త: తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్)
జూలూరు గౌరీశంకర్