దక్షిణపథానికి చెందిన ఒక వర్తకుడు తన 50వ ఏట వ్యాపారాన్ని కొడుకులకు అప్పగించి, తాను తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. ఆ రోజుల్లో యాత్రలన్నీ కాలినడకనే సాగేవి. అందువల్ల యాత్రలన్నీ తిరిగిరావడానికి ఏండ్లు పట్టేది. ఇక మన వర్తకుడు పుణ్య క్షేత్రాలన్నీ దర్శిస్తూ యాత్రలో భాగంగా ఒకానొక సమయంలో ఎడారి లాంటి ఒక నిర్జన ప్రదేశాన్ని చేరుకున్నాడు.
అక్కడ ఆయనకు కనిపించింది ఒక ఎత్తయిన నల్లని కొండ మాత్రమే. చుట్టూ కనుచూపు మేరలో ఒక చెట్టు కూడా కనిపించదు. ఉదయం నుంచి నడుస్తున్నాడేమో, మధ్యాహ్నమయ్యే సరికి కడుపులో ఆకలి దహించి వేస్తుంటుంది. నెత్తిమీది మూటలో రెండు పెద్ద మామిడి పండ్లు తప్ప తినడానికేమీ లేవు. అందువల్ల గత్యంతరం లేక ఆ రెండు పళ్ళతోనే కడుపు నింపుకొని తృప్తిపడ్డాడు. తినగా మిగిలిన పండ్ల పిక్కలను దూరంగా విసిరేసి తిరిగి యాత్ర ప్రారంభించాడు.
అంతలోనే ఆకాశం మేఘావృతమై పెద్ద వర్షం కురువసాగింది. వర్షంలో తల దాచుకొనేందుకు ఒక చిన్న చెట్టయినా కనిపించలేదు. అందువల్ల వర్షంలో తడుస్తూనే నడక సాగించాడు. తర్వాత కొంతసేపటికి వర్షం వెలిసింది. అప్పుడు ఆయనకు అనిపించింది అక్కడ కనీసం ఒక చెట్టయినా ఉంటే తాను తడిచేవాణ్ణి కాదు కదా అని. ఇంతలో ఆయన మస్తిష్కంలో ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఆలోచన రావడమే తడవుగా ఆ యాత్రికుడు వెనక్కి తిరిగాడు. తాను మామిడి పండ్లను తిన్న ప్రదేశానికి చేరుకొన్నాడు. మామిడి పండ్ల పిక్కలు దూరంగా పడి ఉన్నాయి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాటిని తీసుకొని తన చేతిలోని కత్తితో రెండు గోతులు తవ్వి ఆ గోతుల్లో ఆ పిక్కలను వేశాడు. ఏదో మంచి పని చేశానన్న తృప్తితో ముందుకు సాగాడు.
కాల చక్ర పరిభ్రమణంలో కొన్నేండ్లు గడిచిపోయాయి. మన యాత్రికుడు యాత్రలన్నీ ముగించుకొని ఇంటికి తిరుగు ముఖం పట్టాడు. యాత్రలో భాగంగా మళ్ళీ పాత కొండ ప్రదేశాన్ని చేరుకున్నాడు. మళ్ళీ ఆకాశం మేఘావృతమైంది. పెద్ద వర్షం కురువసాగింది. గతంలో వలెనే మళ్ళీ వర్షంలో తడుస్తానేమోనన్న భయం ఆయన్ను అవహించింది. అటూ- ఇటు తిరిగి చూస్తే దూరంగా చెట్లలాంటివి కనిపించాయి. పరుగు పరుగున ఆ ప్రాంతం చేరుకొని చూస్తే అక్కడొక పెద్ద మామిడి తోట కనిపించింది. ఒకటికాదు రెండుకాదు వందల సంఖ్యలో మామిడి చెట్లున్నాయి. గబగబా పరిగెత్తి ఆ తోట చేరుకొని గమనిస్తే ఆ తోటలో ఎందరో యాత్రికులు తలలు దాచుకొన్నారు. మరికొందరు ఆ చెట్ల కింద వంటలు చేసుకొని భోజనాలు చేస్తున్నారు. వాస్తవంగా గతంలో అక్కడ తాను మంచి ఉద్దేశ్యంతో నాటిన పిక్కలు రెండు మాత్రమే. అయితే అవి చెట్లయి ఫలించినప్పుడు ఆ పండ్లను వచ్చి పోయే యాత్రికులు తిని పారవేయడంతో కొత్త మొక్కలు పుట్టి ఆ ప్రాంతమంతా ఒక పెద్ద తోటగా మారింది. ఆశ్చర్యంతో చూస్తున్న ఆ యాత్రికుడికి ఆ వర్షంలో వినిపించిన తోటి యాత్రికుల మాటలు ‘ఈ చెట్లను నాటిన మహానుభావుడెవరో ఆయనకు మనమంతా రుణపడి ఉంటామని’ ఆ మాటలు విన్న యాత్రికుడి హృదయం పులకించి పోయింది. తాను ఎన్ని యాత్రలు చేసినా కలుగని తృప్తి ఆ మాటలతో ఆయనకు లభించింది
ఇక ఈ పిట్టకథ ఇచ్చే సందేశం, మనం చేసే ప్రతి మంచి పని, సమాజంలో మంచిని ఎన్నింతలో పెంచుతూ మన జీవితాల్లో పన్నీటి జల్లుల్ని కురిపిస్తుందని.ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే రుద్ర రచన అని పిలువబడే ఒక అమ్మాయి మన ప్రభుత్వ ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్కు ఒక లక్ష రూపాయల విరాళమిచ్చిందన్న వార్త ఈ మధ్య అందరినీ ఆకర్షించడం.
ఇక వివరాల్లోకి వెళితే, జగిత్యాల జిల్లా, కథలాపూర్ మండలంలోని తండ్రియాల గ్రామానికి చెందిన రుద్ర రచన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి ఒక అనాథ అయింది. అయితే చదువు మీద ఆ చదువుల తల్లికి ఉన్న పట్టుదల వల్ల స్థానిక బాలసదన్‌లో ఉంటూ జగిత్యాల హైస్కూల్లో పదవ తరగతి పూర్తి చేసింది. తర్వాత హైదరాబాద్ యూసఫ్‌గూడలోని స్టేట్‌హోమ్‌లో ఉంటూ పాలిటెక్నిక్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఈసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా హైదరాబాద్ సీబీఐటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో ఇంజినీరింగ్ సీట్ సంపాదించింది. అయితే తల్లిదండ్రులు లేని ఆ అమ్మాయి కాలేజీ ఫీజులు భరించలేక ఇంజినీరింగ్ సీటు మీద ఆశ వదలుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయం తెలుసుకొన్న మంత్రి కేటీఆర్ ఆ అమ్మాయిని ప్రగతి భవన్ పిలిపించుకొని ఆమె ఇంజినీరింగ్ కాలేజీ ఫీజుతోపాటు, హాస్టల్ ఖర్చులు కూడా భరిస్తానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ అమ్మాయికి ఆర్థిక సహాయమందించి అండగా నిలువడంతో ఆ అమ్మాయి ఇంజినీరింగ్ పూర్తిచేసి మంచి కొలువు సంపాదించింది.
కేటీఆర్ సహాయంతో ఒక మంచి ఉద్యోగంలో చేరిన రచన, కేటీఆర్‌ను ఆదర్శంగా తీసుకొని తానుకూడా ఒక మంచి పని చేయాలని నిశ్చయించుకున్నది. అందువల్ల చదువు మీద ఆసక్తి ఉండి చదువలేకపోతున్న అనాథలకు తోడ్పడే సదాశయంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి తన జీతం నుంచి లక్ష రూపాయల విరాళం అందించింది. అంతేకాదు ఒక టీవీ చానల్లో మాట్లాడుతూ భవిష్యత్తులో తాను కూడా తనలాంటి చదువుమీద ఆసక్తి ఉన్న ఒక అమ్మాయిని చదివించి ప్రయోజకురాలిని చేస్తానని తెలిపింది.
పైన చెప్పిన కథకు, కేటీఆర్ సహాయానికి ఉన్న సారూప్య సందేశం, మంచి ఎల్లప్పుడూ సమాజంలో ఎన్నోరెట్లు మంచిని సృష్టిస్తుందని. ఒక అనాథ జీవితాన్ని నిలబెట్టిన కేటీఆర్ దాతృత్వం ఆ అమ్మాయి జీవితంలో వెలుగును నింపడం మాత్రమే కాదు, సమాజంలో ఒక మంచి ఆదర్శాన్ని స్థాపించింది
ఇక ఈ ఉదంతాన్ని విన్న సంపన్నులు గాని, కార్పొరేట్ సంస్థలు గానీ, కేవలం రుద్ర రచనను పొగడడం మాత్రమే కాకుండా, ప్రతి వారు చదువు మీద ఆసక్తి కలిగిన ఒక విద్యార్థిని దత్తత తీసుకోగలిగితే సమాజంలో మంచి పరిమళిస్తుంది. ఈ మంచి పరిణామం త్వరలో వస్తుందని ఆశిద్దాం.
బసవరాజు నరేందర్ రావు
99085 16549