తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ డిక్లరేషన్ పేరిట విద్యార్థి, నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను గుప్పించింది. కానీ, తీరా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. జీవో నంబర్ 46 రద్దుపై కుంటిసాకులు చెప్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాటవేత ధోరణిని అవలంబిస్తుండగా.. గ్రూప్ 1లో 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులకు అవకాశం కల్పించటంపై డిప్యూటీ సీఎం భట్టి అసలు నోరు మెదపటం లేదు. అంతేకాకుండా, ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని నాడు మాటిచ్చి.. అధికారంలోకి వచ్చి 7 నెలలవుతున్నా మెగా డీఎస్సీపై స్పందించడం లేదు. జాబ్ క్యాలెండర్ హామీని అటకెక్కించారు. నిరుద్యోగ భృతిపై మాటమార్చారు.
18 ఏండ్లు పైబడిన విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీ, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, బాసర ట్రిపుల్ ఐటీ తరహాలో మరో నాలుగు విద్యాసంస్థల ఏర్పాటు, విద్యార్థులకు ఫ్రీ వైఫై సౌకర్యం, ప్రతి మండలానికి అంతర్జాతీయ స్థాయి స్కూల్ ఏర్పాటు హామీలన్నీ గాల్లో కలిసిపోయాయి.
ప్రజాపాలన అంటూనే హామీల అమలు కోసం దీక్షలు చేస్తున్నవారిని నిర్బంధిస్తుండటం సిగ్గుచేటు. విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ తొమ్మిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కానీ, కాంగ్రెస్ అనుబంధ కుహనా మేధావులు గానీ కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. జూలై 5న నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పలు విద్యార్థి సంఘాలు టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి పిలుపునిస్తే.. ప్రజల హక్కులను రక్షిస్తామని చెప్పుకొనే కాంగ్రెస్ ప్రభుత్వమే నిరసన తెలియజేయకుండా ప్రజల హక్కును కాలరాసింది. తెలంగాణ యువత సమస్య రాజకీయ నాయకుల నిరుద్యోగ సమస్యను తీర్చుతున్నదే కానీ, తమ సమస్యను మాత్రం తీర్చడం లేదు. ఈ విషయం మరోసారి తేటతెల్లమైంది.
కొంతమంది కుహనా మేధావులు తమ స్వప్రయోజనాల కోసం పాకులాడుతూ నిరుద్యోగులను వాడుకుంటున్నారని మరోసారి నిరూపితమైంది. ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో వారు యువతను పట్టించుకున్న పాపానపోలేదు. ఈ విషయాన్ని యువత గ్రహించి పార్టీలకతీతంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరు సలిపినప్పుడే నిరుద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయి.
-అనంతుల మధు
95058 66698