అధికారంలోకి రావడం కోసం ప్రతి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తుంటాయి. ఎన్నో హామీలు గుప్పిస్తుంటాయి. ప్రస్తుతం పరిపాలిస్తున్న పార్టీ కన్నా ఇంకా మేలైన పనులు చేస్తామంటాయి. ఇలా అవకాశం కోసం పూటకో మాట మాట్లాడే రాజకీయ పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
‘ఎన్నికలు షురువవుతున్నా యి. పంట కల్లం అయినప్పుడు ధాన్యం కోసం వచ్చే వాళ్ల లెక్క ఎంతోమంది వస్తుంటారు..ఏమో చేస్తామని అరచేతిలో స్వర్గం చూపిస్తారు..ఆగం కావద్దు, నమ్మొద్దు..వాస్తవాలు తెలుసుకోవాలి. తెలంగాణ కోసం ఎవరు పనిచేశారో వారికే ఓట్లు వేయాలి’ – ఇటీవల మెదక్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని మరొక్కసారి ఓటర్లు గుర్తు చేసుకోవాలి.
2014లోనే దేశానికి, తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చినట్టు.. తాము అధికారంలోకి వస్తే ఏమేమో చేస్తామని అన్ని పార్టీలు చెప్తున్నాయి. అయితే 2014 వరకు తెలంగాణ ప్రాంతాన్ని పాలించింది కాంగ్రెస్, టీడీపీలే కదా? వారి పాలన నిర్వాకం తెలంగాణ ప్రజలకు తెలియదా? ఏం చేశారని వారికి అవకాశం ఇవ్వాలి? వారి పాలనలో కరెంట్‌తో రైతులు ఎన్ని బాధలు పడ్డారో తెలియదా? అయినా వ్యవసాయానికి 3 గంటల కరెంటు మస్తవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డే చెప్తుంటే వారికి వ్యవసాయం పట్ల, రైతు కష్టాల పట్ల ఎంత అవగాహన ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలకు, బాధలకు ప్రత్యేక రాష్ట్ర సాధనే పరిష్కారమని భావించి ఉద్యమించి తెలంగాణను సాధించిన నాయకుడు కేసీఆర్. ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై ఆయన తెలంగాణను అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిపారు. మరోవైపు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ, బోలెడన్ని సాధ్యం కానీ హామీలు ఇస్తూ అధికారంలోకి రావాలని చూస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు.
కాంగ్రెస్ పార్టీ హామీలను చూస్తే ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టమవుతున్నది. చాటుమాటుకు దళితబంధు పథకాన్ని విమర్శించే కాంగ్రెస్ నాయకులు, దానికి దీటుగా పేరు మార్చి అధికారంలోకి రాగానే దళితులకు రూ.12 లక్షలు ఇస్తామని పేర్కొంటున్నారు. ఇలా హామీల వర్షం కురిపిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ వాటి మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో తెలంగాణకు దీటుగా పథకాలు ఎందుకు అమలుచేయడం లేదనే వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలి.
డబుల్ ఇంజిన్ సర్కార్‌గా చెప్పుకొంటున్న బీజేపీ పాలిత రాష్ర్టాలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కరెంటు కోసం ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. తెలంగాణలో మాదిరి ఆయా రాష్ర్టాల్లో 24 గంటల కరెంటు ఎందుకు సరఫరా చేయడం లేదో ఆయా పార్టీల నాయకులు సమాధానం చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు గుప్పిస్తున్న హామీలు ముందుగా వారు అధికారంలో ఉన్న రాష్ర్టాలలో అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలి.
కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవు. తాము అధికారంలోకి వస్తే ఇంతకన్నా ఎక్కువ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్, బీజేపీలు చెప్పే ఆ మాటలను నమ్మడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి, సంక్షేమం జరిగిందో ఇక్కడికి ఉపాధి కోసం వస్తున్న ఇతర రాష్ర్టాల కూలీలను అడిగితే తెలుస్తుంది.
తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంతో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. పార్లమెంటు సాక్షిగా ఆగస్ట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరీ చెప్పిన సమాధానాన్ని మరొక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. 2021 నుంచి 2023 వరకు జీఎస్డీపీలో రాష్ర్టాల అప్పులను పరిశీలిస్తే తెలంగాణ కింది నుంచి ఐదో స్థానంలో(28.2 శాతం) ఉన్నది. ఎన్నికల్లో హామీలిచ్చే నాయకులు కాదు.. పరిష్కారాల కోసం చిత్తశుద్ధితో పనిచేసే నాయకులు తెలంగాణకు కావాలి. అలా పని చేసేది కేసీఆర్ ఒక్కరేనని ప్రజలు గమనించాలి. కష్టాల్లో ఉన్న తెలంగాణను దశల వారీగా ఆయన అభివృద్ధిలోకి తీసుకొచ్చిన వైనాన్ని ప్రజలు మరిచిపోరు. తెలంగాణ వస్తే కారు చీకట్లే అన్న మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాటలను చెరిపేసి 24 గంటల కరెంటుతో రాష్ర్టానికి వెలుగులు పంచిన దార్శనికుడు కేసీఆర్.
రైతులతో పాటు సబ్బండ వర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. తక్కువ సమయంలోనే ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేసిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కుతుంది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇచ్చే హామీలను ఆచరణలో చూపినప్పుడే వారిని ప్రజలు నమ్ముతారు.
-జీడిపల్లి రాంరెడ్డి
96666 80051