నాగరికత నదీ తీరప్రాంతాల్లోనే మొదలైంది. పర్యావరణం, నీరు వేర్వేరు కావు. నీరు ఉన్నచోటే సకల జీవరాశులు బతకగలుగుతాయి. పర్యావరణ పరిరక్షణ అంటే నీటి సంరక్షణ. అదే ఇపుడు అత్యంత కీలకమైనది. పాలకుడు పర్యావరణ పరిరక్షకుడు కావాలి. నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఆహార ఉత్పత్తి బాధ్యతలపై చాలా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి.
తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మారుమూల ఆదివాసీ గూడేల నుంచి రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధికి నోచుకొనే ప్రదేశాలను కాలుకు బలపం కట్టుకొని తిరిగారు. ప్రజలకు కావలసిన కనీస అవసరాలు, పర్యావరణ పరిరక్షణకు అవసరమయ్యే అంశాల మీద విస్తృత అధ్యయనం జరిపారు. అనంతరం ఆయా అంశాలపై ప్రత్యక్ష కార్యాచరణ, సామాజిక అభివృద్ధిపై భవిష్యత్తులో రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాల మీద పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి రోజుల్లోనే పెరుగుతున్న జనాభా, తగ్గుతున్న వ్యవసాయ భూమి, కలుషితమవుతున్న నేల, నీరు, గాలి, వాతావరణ మార్పుల వల్ల పెనుసవాళ్లు ఏర్పడవచ్చునని కేసీఆర్ ముందుగానే పసిగట్టారు. ముఖ్యంగా గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాల వల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరగటం, ఎల్ నినో ప్రభావం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పు, నీటి అవసరాలు, సుస్థిర ఆహార ఉత్పత్తికి విఘాతం కలిగిస్తాయని గుర్తించారు. రూ.5,349 కోట్లతో మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని ఎన్నో చెరువులను పునరుద్ధరించారు. చెరువుల్లో పేరుకుపోయిన మట్టిని తీసి పంట పొలాల్లో చల్లటం ద్వారా నేల సారవంతానికి తపనపడి, గ్రామీణ వ్యవసాయాన్ని పటిష్టపరిచారు. 8.93 టీఎంసీల సామర్థ్యంతో 15.05 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు కృషిచేశారు.
ప్రజలు పీల్చే గాలి, తాగే నీళ్లు, తినే ఆహారం స్వచ్ఛంగా ఉండాలంటే నేలలు ఆరోగ్యంగా ఉండవలసిన అవసరాన్ని కేసీఆర్ గ్రహించారు. అనుకున్నదే తడవుగా రాష్ట్రవ్యాప్తంగా హరితహారం కార్యక్రమం ద్వారా కోట్లాది మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ చేపట్టిన ఈ మహత్కార్యంతో దేశంలో పలు పెద్ద రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో పచ్చదనం రికార్డుస్థాయికి పెరిగింది.
2015లో 19,854 చదరపు కిలోమీటర్లు ఉన్న అటవీ విస్తీర్ణం 2023 నాటికి 21,214 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. 2019 నుంచి 2021 వరకు రెండేండ్లలో అటవీ విస్తీర్ణం ఏకంగా 632 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది. పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, ఎవెన్యూ ప్లాంటేషన్, అటవీ పునరుద్ధరణ వంటి కార్యక్రమాలతో విస్తీర్ణం పెరిగింది.
సహజ వనరుల నిర్వహణ, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించటం, వ్యవసాయ యాంత్రీకరణకు కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో రూ.963.26 కోట్లతో 6.66 లక్షల మంది రైతులకు లబ్ధ్ది చేకూర్చారు. పండ్ల తోటల పెంపకం, పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల సాగుకు పాలీహౌస్‌ల నిర్మాణానికి రూ.1,847.10 కోట్ల సబ్సిడీతో 7.79 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్య సాగుకు ప్రోత్సాహకాలు అందించారు. పంట కోత అనంతరం యజమాన్య పద్ధతుల్లో భాగంగా మార్కెట్ యార్డుల అభివృద్ధి, చేతికొచ్చిన పంట నష్టపోకుండా దాచుకోవటానికి వీలుగా గోడౌన్ల నిర్మాణం చేపట్టారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన కొత్తలో గోడౌన్ల సామర్థ్యం 39.01 లక్షల మెట్రిక్ టన్నులు కాగా 2023-24 నాటికి 73.82 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ చేసుకునే విధంగా కొత్త గోడౌన్లు నిర్మించారు.
రాష్ట్రంలో వంటనూనెల ఉత్పత్తి పెంచాలని కేసీఆర్ ఎంతగానో తపనపడ్డారు. తక్కువ భూమిలో ఎక్కువ వంట నూనె ఉత్పత్తి పామాయిల్ ద్వారానే సాధ్యమని ఐదేండ్ల క్రితమే గ్రహించి, కార్యాచరణను అమలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ వాతావరణంలో తేమ శాతం పెరుగుతుందని, తద్వారా సంప్రదాయేతర పంట పామాయిల్ సాగు చేపడితే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని తలచారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తృతంగా చేపట్టేందుకు నిర్ణయించారు. పలు జిల్లాల్లోని రైతులను ఒప్పించి పంట మార్పిడికి, ముఖ్యంగా వంటనూనె ఉత్పత్తి, పంట విస్తీర్ణం పెంచటానికి ఎంతో కృషి చేశారు. ఒకప్పుడు ఎక్కడో కోస్తాంధ్ర ప్రాంతాల్లో పెరిగే పామాయిల్ పంట ఈ రోజు మారుమూల తెలంగాణ పల్లెల్లో చూస్తున్నామంటే అది కేసీఆర్ ముందుచూపు వల్లనేనని చెప్పకతప్పదు. మనదేశం దిగుమతి చేసుకుంటున్న ప్రధాన వ్యవసాయ ఉత్పత్తుల్లో మొదటిదైన వంటనూనె ఉత్పత్తిని రాష్ట్రస్థాయిలో పెంచి విదేశీ మారకద్రవ్య వినియోగాన్ని తగ్గించారు. వీటన్నింటి వల్లనే నేల, గాలి, నీటి సంరక్షకుడు, అసలైన ప్రజారక్షకుడు కేసీఆర్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
– (వ్యాసకర్త: పరిశోధక విద్యార్థి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం)
సత్యమూర్తి నాయక్