పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. ఆ ఉగ్రదాడికి కారణమైన, ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలను పెంచిపోషిస్తున్న పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పే ఉద్దేశంతో ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ దేశ ప్రజల్లో ఎన్నో ఆశలను రేకెత్తించింది. ఉగ్రవాదులందరినీ మట్టుబెడతారని, తద్వారా పహల్గాంలో అమరులైన అమాయక పర్యాటకుల ఆత్మ శాంతిస్తుందని, ఉగ్ర స్థావరాలకు అడ్డాగా మారిన పాకిస్థాన్ నుంచి ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ స్వాధీనం చేసుకుంటుందని, తద్వారా భవిష్యత్తులో ఇక అక్కడి నుంచి ఉగ్రవాదుల చొరబాట్లు ఉండవని ప్రజలు భావించారు.
సింధూ నది నీళ్లను ఆపివేసిన తర్వాత పాక్ కరువు కోరల్లో చిక్కుకొని కాళ్ల బేరానికి వస్తుందనే ప్రచారాలనూ దేశ ప్రజలు విశ్వసించారు. 1971లో బంగ్లా ఏర్పాటు చేసినట్టు బలుచిస్థాన్ ఏర్పాటువరకు మోదీ ప్రభుత్వం వెనుకడుగు వేయదని గాఢంగా నమ్మారు. దేశాన్నేలిన గత ప్రభుత్వాలు, పార్టీల చేతికానితనం వల్లె పాకిస్థాన్ రెచ్చిపోతుందని, నెహ్రూ తప్పిదం వల్లనే కశ్మీర్ సమస్య ఏర్పడిందని, ఇప్పుడు మోదీ పాక్‌కు బుద్ధి చెప్తాడని బీజేపీ ప్రచారం చేసింది. దానితో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈసారి మోదీ కోసమైనా భారత్‌కు మద్దతు పలుకుతారని ప్రజలు నమ్మారు. అందుకే ఆపరేషన్ సిందూర్‌కు దేశ ప్రజలు మద్దతు తెలిపారు. ప్రతిపక్షాలు సైతం తమ రాజకీయ విభేదాలు, సైద్ధాంతిక వైరుధ్యాలను పక్కనబెట్టి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి.
వరల్డ్ బ్యాంక్ (ఐఎంఎఫ్) మన అభ్యంతరాన్ని పెడచెవిన పెట్టి పాక్‌కు అప్పు ఇవ్వడం ద్వారా ముందే సంకేతాలిచ్చింది. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా విఫలమైంది. ఇక ఆపరేషన్ సిందూ ర్ జరిగిన మూడు రోజులు ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, ఫైసలాబాద్, గుజర్న్వాలా, పెశావర్, క్వెట్ట, రావల్పిండి, సియాల్కోట్, సర్గోద, బహావల్పూర్ వంటి పాక్‌లోని ప్రధాన పట్టణాలు మన సైన్యం చేసిన దాడులతో అతలాకుతలమయ్యా యి. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఎయిర్ బేస్ లులంచ్ ప్యాడ్లు అన్ని ధ్వంసమయ్యాయి. మన దేశం ఇన్ని విజయాలు సాధించిన తర్వాత అమెరికా ఒత్తిడితో కాల్పుల విరమణకు ఒప్పుకోవడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఏ శాంతి ఒప్పందం లేకుండా, ఉగ్రవాదులను అప్పగించకుండానే కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకున్నారో దేశ ప్రజలకు ప్రధాని మోదీ చెప్పాలి. పక్కలో బల్లెం లాంటి పాకిస్థాన్ పీక పిసికే ఒక సువర్ణావకాశాన్ని అమెరికా ఒత్తిడికి తలొగ్గి మాత్రమే వదులుకున్నామా? అనేది దేశ ప్రజల ముం దున్న అతిపెద్ద ప్రశ్న. 1971లో కూడా పాకిస్థాన్‌కు మద్దతుగా దాడి చేస్తామని అమెరికా బెదిరించింది. ఆ బెదరింపులను లెక్కచేయని ఇందిరా గాంధీ పాకిస్థాన్‌ను రెండు ముక్కలు చేయడాన్ని జనం ఇప్పుడు గుర్తు కు తెచ్చుకుంటున్నారు. ఈ కాల్పుల విరమ ణ కూడా మన దేశ ప్రధాని కాకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించడం యావత్ దేశానికే అవమానకరంగా ఉన్నది.
ఆధునిక యుగంలో యుద్ధం ఎలా ఉన్నా దౌత్యనీతి, రాజనీతి ద్వారా మాత్రమే శత్రువును మన కాళ్ల దగ్గరికి తీసుకురాగలమని, ప్రజలను మతపరమైన భావోద్వేగాల కు గురిచేసి ఓట్లు దండుకున్నంత సులువుగా ప్రపంచ దేశాలు మనకు అండగా ఉంచుకోలేమని గుర్తెరగాలి. అంతేకాకుండా అమెరికా లాంటి దేశాలు తమ దేశ ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాలకే పెద్దపీఠ వేస్తాయి కానీ, ఆలింగనాలకు మిత్రులైపోయి మనకు సహకరిస్తాయనుకోవడం అవివేకమే అవుతుంది. చరిత్రలో మనకంటే ముందు దేశా న్నేలిన ప్రధానులు, ప్రభుత్వాలు కూడా అప్పటి కాలమాన, దేశ అంతర్గత, అంతర్జాతీయ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకున్నారు తప్ప బీజేపీ ప్రచారం చేసినట్టు వారికి ధైర్యం లేక కాదు, రాజనీతిజ్ఞత తెలువక కాదు. గత ప్రభుత్వాలను నిందించడం సులువే కానీ, ప్రభుత్వంలో ఉండి సంక్షోభాలు ఏర్పడినప్పుడు దేశాన్ని విజయం వైపు నడిపించడం అంత సులువు కాదన్న విషయాన్ని బీజేపీ నాయకులు, శ్రేణులు ఇకనైనా గమనించాలి. ఆపరేషన్ సిందూర్ విషయంలో అమెరికా జోక్యానికి అవకాశం ఇచ్చి మన దేశ అంతర్గత సమస్య అయిన కశ్మీర్ విషయంలో ఇతర దేశాలకు అవకాశం ఇచ్చినట్టయింది.
– (వ్యాసకర్త: న్యాయవాది) మహ్మద్ జమీలొద్దీన్ అహ్మద్ 86862 11556