న్యూఢిల్లీ, మార్చి 18 : దేశంలోని 10.35 లక్షల పాఠశాలల్లో సుమారు 11 కోట్ల మంది పిల్లలకు సేవలందిస్తున్న ప్రధాని పోషణ్ మధ్యాహ్న భోజన పథకం ఎల్పీజీ కొరత కారణంగా అమలులో పెను సవాళ్లను ఎదుర్కొంటున్నది. సామాజికంగా వెనుకబడిన, తక్కువ ఆదాయ వర్గాల పిల్లలకు పుష్టికరమైన భోజనం అందించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లుతున్నది. కొన్ని పాఠశాలలు వంటచెరకును ఉపయోగించడం అప్పుడే మొదలుపెట్టేశాయి. ఈ మార్పు పాఠశాలల్లో వంటశాలలను నడుపుతున్న మహిళలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. ఈ పథకం కింద ఉన్న 24 లక్షల మంది వంట సహాయకుల్లో (సీసీహెచ్) 90 శాతం కంటే ఎక్కువ మంది మహిళలే ఉండడం ఇందుకు కారణం.
బీహార్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సీసీహెచ్గా పనిచేస్తున్న భారతి అనే మహిళ ఎల్పీజీకి మారడానికి ముందు సంవత్సరాల తరబడి కట్టెలతో వంట చేయడం వల్ల కలిగే శారీరక శ్రమను గుర్తు చేసుకున్నారు. ఇటీవల మళ్లీ కట్టెల పొయ్యికి మారడంతో కండ్లలో నీరు కారడం, ఛాతిలో అసౌకర్యం వంటి అవే ఇబ్బందులు తిరిగి మొదలయ్యాయని ఆమె వాపోయారు. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో వంటగదిలో పరిస్థితులు మరింత కష్టంగా మారాయని ఆమె చెప్పారు. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ భారతి మరో ముగ్గురు సీసీహెచ్లతో కలసి దాదాపు 500 మంది పిల్లలకు భోజనం తయారు చేస్తూనే ఉన్నారు.
తెలంగాణకు చెందిన లక్ష్మి అనే సీసీహెచ్ ఎల్పీజీ ధరలు అందుబాటులో లేకపోవడంతో దాదాపు 17 ఏండ్లుగా కట్టెల పొయ్యిపైనే ఆధారపడ్డారు. వంట చెరకు కొనడానికి ఆమె నెలకు రూ.3,000 ఖర్చు చేస్తున్నారు. దీనివల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతిని శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నడుము నొప్పి వంటి సమస్యలు తలెత్తాయి. ప్రభుత్వం నుంచి నిధుల రాకలో జాప్యం వల్ల ఆర్థిక భారం మరింత పెరిగి భోజనం ఖర్చుల కోసం ఆమె వడ్డీకి అప్పు చేయవలసి వస్తున్నది.
వంటచెరకు వంటి సంప్రదాయ ఇంధనాలను ఉపయోగించడం వల్ల ఈ వంటశాలలను నడుపుతున్న మహిళలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడే ముప్పు పొంచి ఉంది. కట్టెలతో వంటచేయడం వల్ల ఇప్పటికే ఉన్న శ్వాసకోశ సమస్యలు తీవ్రతరం కావడమే కాకుండా బ్రాంకైటిస్, ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయని డాక్టర్ సిల్వియా కర్పగం పేర్కొన్నారు. ఇప్పటికే ఇండ్లలో, స్కూళ్లలో వంట బాధ్యతలను తమ భుజాన మోస్తున్న మహిళలపై ఎల్పీజీ కొరత మోయలేని భారంగా మారుతుందని శాతవాహన యూనివర్సిటీ సోషియాలజీ ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి అభిప్రాయపడ్డారు. ఎల్పీపీ కొరత కొనసాగుతున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని సీసీహెచ్లు తమ తదుపరి కార్యాచరణపై ఆందోళన చెందుతున్నారు. కొందరు ఇప్పటికే వంటచెరుకుకు మరలిపోయారు.