అగ్ర తారలు విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ఇటీవలే వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి వేడుక వైభవంగా జరిగింది. దాదాపు రెండు వారాల పాటు వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో బిజీగా ఉన్న రష్మిక మందన్న తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టింది. తాజాగా ఆమె పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ షూటింగ్లో జాయిన్ అయ్యింది. ఈ సినిమాలో రష్మిక మందన్న గోండు తెగకు చెందిన యోధురాలి పాత్రలో కనిపించనుంది.
కెరీర్లో తొలిసారి రష్మిక మందన్న ఫుల్‌లెంగ్త్ యాక్షన్ రోల్‌ని చేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం షూట్లో భాగంగా ఆమెపై యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఆండీలాంగ్ నేతృత్వంలో ఈ ఎపిసోడ్‌ని తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. ‘మైసా’ చిత్రీకరణ తాలూకు ఫొటోను అభిమానులతో పంచుకుంది రష్మిక మందన్న. దీనికి ‘వేట మొదలైంది’ అనే క్యాప్షన్‌ను జత చేసింది. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది.