మార్పు పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆదినుంచే తెలంగాణ అస్తిత్వంపై దాడి కొనసాగిస్తున్నది. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు మొదలు అనేక నిర్ణయాలు మళ్లీ సమైక్య పాలనను తలపిస్తున్నాయి. ఆ పరంపరలోనే ఇక్కడి ప్రజల బలం-బలహీనతల మీద ప్రతిసారి రేవంత్ సర్కార్ దాడులు చేస్తూనే ఉన్నది. నాడు వ్యవసాయం దండుగన్న ప్రాంతం లో వ్యవసాయాన్ని పండగలా మార్చిన తెలంగాణ సాధకుడైన కేసీఆర్‌పై కువిమర్శలకు పాల్పడుతున్నది. కేసీఆర్ పాలనను ఆదర్శంగా తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి ఆనవాళ్లను తుడిచివేస్తాననే దుర్బుద్ధితో ఆంధ్రా ఆధిపత్యపు పాలకుల పంచన చేరి తెలంగాణను పలుచన చేస్తున్నాడు.
కేసీఆర్ పదేండ్ల హయాంలో వెలుగులు నిండిన అన్నదాతల జీవితాలు మళ్లీ ఆగమవుతున్నాయి. విద్యాకుసుమాలను విరజిమ్మిన గురుకులాలు నిర్వీర్యం అవుతున్నాయి. అయినా రేవంత్ మాత్రం పక్కన ఉన్న ఏపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారుతో చెట్ట పట్టాలేసుకొని తెలంగాణ అభివృద్ధిని తిరోగమనం దిశగా తీసుకువెళ్తున్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన ఏమో కానీ, తెలంగాణ హక్కులు హరించే పరాయి పాలన నడుస్తున్నదని ప్రజలు వాపోతున్నారు. సుభిక్షంగా ఉన్న తెలంగాణను కబళించే ప్రక్రియ కొనసాగుతున్నది. అవకాశం వస్తే తెలంగాణను మళ్లీ ఆంధ్రలో కలిపేసుకుంటామనే దురాక్రమణ ధోరణి నేడు కనిపిస్తున్నది. కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిత్వాలను హననం చేసేలా విషపు కథనాలను సీమాంధ్ర మీడియా వండి వారుస్తున్నది. తెలంగాణను కించపరిచిన, అవమానించివాళ్లను తరిమికొట్టాల్సిన ప్రభుత్వం, బాధ్యతగా నడుచుకోవాల్సిన మంత్రులు వలసవాద శక్తులకు మద్దతుగా నిలుస్తుండటం సిగ్గుచేటు. కేంద్రమంత్రి బండి, మంత్రి సీతక్క వంటి కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆంధ్రా ఆధిపత్యపు ముఠాకు అనుకూలంగా మాట్లాడటం తెలంగాణ ప్రజలను కించపరచడమే అవుతుంది.
తెలంగాణ ప్రజలకు నాయకుడిగా, ప్రభుత్వంపై పోరాడుతున్న కేటీఆర్‌పై సీఎం రమేశ్ వంటి సమైక్యవాది నీతిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను ఖండించాల్సిన కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆయనకు అనుకూలంగా మాట్లాడటం తెలంగాణకు ప్రమాదకరమనే భావించాలి. ఈ క్రమంలోనే తెలంగాణ ద్రోహుల విమర్శలకు తగిన బుద్ధి చెప్తామని తెలంగాణ ప్రజలు హెచ్చరిస్తున్నారు. చరిత్రలో ఎన్నో కుట్రలను ఎదుర్కొని ఎదిగిన తెలంగాణ, భవిష్యత్తులో కూడా తన అస్తిత్వాన్ని, హక్కులను కాపాడుకుంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల చైతన్యమే ఒక రాష్ర్టానికి అసలైన రక్షణ అన్న విషయాన్ని తెలంగాణ విరోధులు గుర్తెరగాలి.
(వ్యాసకర్త: బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు)
-పడాల సతీష్ కుమార్