మనకు నోబెల్ బహుమానం రావలసిందే. మణిపూర్ ఘోరకలి దానికి జోతలిడి స్వాగతించవలసిందే. విశ్వగురువులమని మనకు మనమే భుజకీర్తులు తొడుకుంటున్న మనం విషనాగుల వలె అకృత్యాలకు హారతి పట్టవలసిందే. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా కీర్తిస్తున్న మణిపూర్, సెవెన్ సిస్టర్స్ ఆఫ్ ఇండియాలో భాగమైన మణిపూర్ ఇప్పుడు తగలబడుతున్నది. ప్రపంచం ముందు అంగాంగ ప్రదర్శనకు వేదికైంది. మన్నించు తల్లీ భూమి భారతి.. మన్నించు. ‘ఆడదంటే భోగ వస్తువు కాదురా.. ఆడజన్మ అంటే నీ సేవ కొరకే లేదురా’ అని ఎలుగెత్తి గళమెత్తిన నోళ్లు అచేతనమై ఉగ్గపట్టి ఏడుస్తున్నయ్. సర్వ ప్రపంచం ముందు భారతావనిని మణిపూర్ పవిట చాచి అర్థిస్తున్నది. తమకింత న్యాయం చేయమని ప్రార్థిస్తున్నది.
దేశం కోసం ప్రాణం ఒడ్డేందుకు సిద్ధపడి కార్గిల్ యుద్ధంలో శత్రువు శిరస్సును వంచి.. తుంచిన యోధుడు ఇప్పుడు నిట్టూరుస్తున్నాడు. ‘తల్లీ నేను నా దేశాన్ని ప్రాణాలకు తెగించి రక్షించగలిగాను. కానీ, నా దేహ అర్ధభాగమైన నా భార్యను కాపాడలేకపోయాను’ అని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. కన్నుల ముందే కన్న బిడ్డలను వివస్త్రలను చేసి, పశువుల కన్నా హీనాతిహీనంగా తరిమివేసి విషనాగుల వలె కాటేసి చంపుతుంటే గుండెలవిసిపోయాయని ఓ తల్లి శిలాస్తంభమైంది. బిడ్డ కన్నుల నుంచి రాలే ప్రతీ నెత్తురు చుక్కా తన మాంసపు ముద్దను వేపుడు చేసిందని యెద బాదుకుంటున్నదా తల్లి! ‘మంటల నుంచి మణిపూర్‌ను రక్షించండీ’ అంటూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా.. రాజ్‌నాథ్ సింగ్ ఇలా అనేక మందిని వేడుకున్నది. గీతోపదేశం ప్రజ్వలించిన కర్మభూమియని, బుద్ధుడు ప్రబోధించిన పుణ్యభూమియని, మహాత్ముడు ఎగురవేసిన శాంతికపోతమని, అంబేద్కర్ రాజ్య భూమియని ఇలా ఎన్నెన్నో చెప్పుకొన్నాం.. కానీ, అనాథ అయింది మానవత. మనిషిగా పుట్టిన పాపానికి అమానవీయ మానవ సంచారానికి సిగ్గుతో తలవంచుకోవలసిందేనా అబల?
మూడు నెలలుగా మణిపూర్ రావణకాష్టమై రగులుతున్నది. అయితేనేమి? అక్కడ అంత జరుగుతున్నా మన ఏలిక యథేచ్ఛగా కర్ణాటకలో ఓట్ల కవాతు చేసిండు. ఇకడ సౌభ్రాతృత్వం గాలిలో కొడిగట్టిన దీపమై కొట్టుమిట్టాడుతుండగా ‘స్వేచ్ఛా.. సమానత్వం.. సౌభ్రాతృత్వం’ అనే ఆదర్శాలను విప్లవించిన నేల మీద అడుగిడి భారతసుందర దృశ్యాన్ని తనదైన బాణీలో.. తనదైన వాణిలో ఆవిషరిస్తూపోతున్నాడు. ‘జేజేలు భారతీ.. జయము నీకు.. భారతీ..’ కానీ, ‘ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసుమాలు..?’ మానవత్వం హిమానీ నదాల్లో గడ్డకట్టుకుపోయిందా? మణిపూర్ భారత్‌లో విలీనమై, స్వరాష్ట్రమై నిలిచిన దగ్గరి నుంచీ అనేకానేక ఘర్షణలు జరిగాయి. అప్పుడెప్పుడూ ఒకరి ప్రార్థనా మందిరాలను మరొకరు ద్వేషించుకోలేదు సరి కదా, పరస్ప రం గౌరవించుకున్న సంప్రదాయమే దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నది. అటువంటిది.. ఏకంగా ప్రార్థనా మందిరాలను కూల్చివేసి, కాల్చివేసే ద్వేషం ఇప్పుడే వెలుగు చూడటం వెనుక కారణం ఏమై ఉంటుంది? డబుల్ ఇంజిన్ సర్కార్ చేష్టలుడిగిపోయిందా? లేక చేయదలచుకున్నది చేసి చూపిస్తున్నదా? మణిపూర్ మనసుకు మాత్రమే తెలుసు. కుకీ గిరిజన తెగ, గిరిజనేతర తెగ మెయితీ. ఈ రెండు తెగలను తెగల మనుషులుగా కాకుండా మతం మనుషులుగా చూస్తూ ఉండటమే మారణహోమానికి హేతువని సర్వప్రపంచం గుర్తించినా ఈ డబుల్ ఇంజిన్ల సర్కారు గుర్తించకపోవటాన్ని ఏమనాలి తల్లీ!
‘మా బతుకులను ఆగం చేయకండీ.. మణిపూర్‌లో ప్రేరేపిత హింసను అడ్డుకోండి.. కొండకోనల్లో మా బతుకు మేం బతుకుతున్నాం. మా బతుకును మా నుంచి దూరం చేసే శక్తుల నుంచి మమ్మల్ని కాపాడండీ’ అని పౌలీన్లాల్ హౌకెప్ అనే కుకీ తెగ శాసనసభ్యుడు (కుకీ తెగలోని మొత్తం 10 ఎమ్మెల్యేల్లో బీజేపీకి ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఒకరు) ప్రధానిని కలిసి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నాడు. ‘ప్రజాప్రతినిధినైన నేను, సాక్షాత్తు ఎమ్మెల్యే అయిన, నేను రేపు శాసనసభకు స్వేచ్ఛగా వెళ్లే పరిస్థితి లేదు. భారతసైన్యం రంగ ప్రవేశం చేసి మమ్ములను సమయానికి రక్షించి ఉండకపోతే మా తెగ చరిత్రపుస్తకాల్లో నిక్షిప్తమైపోయేది’ అని సాక్షాత్తు ప్రజా ప్రతినిధే నిట్టూర్చే కాలం దాపురించింది. ‘రెండు నెలల ఆలస్యంగా (మే 3న) ఇద్దరు అబలలను వివస్త్రలను చేసి ఊరేగించిన వీడియోలు ప్రధానికి చేరితే కానీ ‘సిగ్గుపడాల్సిన విషయం’ అని ప్రకటించి ఊరుకున్నారే కానీ, పరిస్థితిని చక్కదిద్దేందుకు ముందుకురాలేదని ప్రశ్నిస్తున్న హౌకెప్కు ఎవరు సమాధానం చెప్పాలి?
ఇంత జరుగుతున్నా.. విశ్వగురువులు నోరు మెదపరు. దేశమా సిగ్గుపడు..! భారతమా…!! మన్నించు ఫర్ నెక్స్ పరేడ్. అది మణిపూర్ అయినా.. ‘జనగణ మన అధినాయక జయహే’ అని రవీంద్రుడు పల్లవించిన వంగభూమి అయినా.. ఎకడైనా ఒకటే. మనది కాదని మనం మౌనం పాటిద్దాం. మౌనమే శరణం గచ్ఛామి. ఓటు పీఠం కోసం.. ఆధిపత్య పగ్గం కోసం పాసంగం ఎటువైపని పాకులాడుతున్నది. నగ్న ప్రద్రర్శన జరిగిన రెండు నెలలకు కానీ నిందితులపై కేసు నమోదు కాలేదంటే, వారు అరెస్టు కాలేదంటే అక్కడున్న డబుల్ ఇంజిన్ల సర్కారు ఎంత బాగా ప్రజల మాన ప్రాణాలకు రక్షణగా నిలబడిందో అర్థమవుతున్నది. ఒకనాడు ‘రవి అస్తమించని’ అమానవీయ పాలన సాగించిన దేశ పౌరుల సభ (హౌజ్ ఆఫ్ కామన్ (బ్రిటన్) ‘మణిపూర్ ఘోరకలి కలచివేసింది’ అని నిట్టూర్చినా.. యురోపియన్ యూనియన్ పార్లమెంట్ ‘అదొక అమానవీయ దుర్ఘటన… బాధితుల వద్దకు న్యాయం చేరాలి’ అని ఆశించినా ఫలితమేమిటి తల్లీ! దేశం గొంతు చించుకుంటున్నా.. ఆ నగ్నకలి సగటు మనిషికి నోట్లో ముద్ద దిగనీయని దిగులు కు కారణమైనా… మన పార్లమెంట్‌కు మణిపూర్ దినుసు కాదు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన క్షణం నుం చి విపక్షాలు అన్నీ ఏకమై మణిపూర్‌కు అండగా నిలవాలని నినదిస్తుంటే ‘సున్నితమైన అంశం’ అని ‘నిర్మల’ సందేశా లు తప్ప మణిపూర్‌ను నిమ్మలం చేసే భరోసా ఏదీ? దేశ సర్వోన్నత న్యాయస్థానం కలుగజేసుకున్నా కూడా అది సున్నిత అంశమే. ‘యత్ర నార్యస్తు పూజ్యన్తే’. అవును నిజం. ఆ నిజమే ఇప్పుడు మణిపూర్‌లో అబద్ధం!
-నూర శ్రీనివాస్
91827 77011