‘దశాబ్దాల ద్రోహంతో విసిగిపోయిన ప్రజలు..ఎడతెగని ఉద్యమాలతో అలసిపోయిన ప్రాణాలు.స్వరాష్ట్రంలో సంక్షేమం పథకాలతో హాయిగా సేదతీరాయి. తమ కోసం కేసీఆర్ నాయకత్వం ఉన్నదని ధీమాగా బతికాయి’.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష వెనుక సుదీర్ఘమైన చారిత్రక నేపథ్యం ఉన్నది. 1956లో భాషా ప్రయుక్త రాష్ర్టాల పేరుతో తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంతో కలిపి, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచీ తెలంగాణ ప్రజలు నిరసిస్తూనే ఉన్నారు. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమం హింసామార్గం పట్టటంతో ఆనాటి కాంగ్రెస్ పాలకులు కర్కశంగా అణచివేశారు.
పోలీసు కాల్పుల్లో 369 మంది తెలంగాణ బిడ్డలు మరణించారు. అప్పటి నుంచి తెలంగాణ ఆకాంక్ష మాత్రం దశాబ్దాలపాటు అందరిలోనూ రగులుతూనే ఉన్నది. ఈ క్రమంలోనే 2001లో కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. మలిదశ స్వరాష్ట్ర సాధన పోరాటంలో వెయ్యిమందికి పైగా తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగం చేశారు. అయితే, ఈ దఫా ఉద్యమంలో హింసాత్మక చర్యలు జరగొద్దని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అహింసామార్గంలో, శాంతియుత పంథాలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించి, కచ్చితంగా అమలు చేశారు. అలా టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) పుట్టిన తర్వాతనే, కేసీఆర్ గొంతు విప్పినంకనే తెలంగాణ నిటారుగా లేచి నిలబడింది.
కరీంనగర్ సభ సాక్షిగా దిక్కులు పిక్కటిల్లేలా సింహగర్జన చేసింది. ఏవీ నా నిధులు, ఏవీ నా నీళ్లు, ఏవీ నా కొలువులు అని బరిగీసి కొట్లాడింది. వివిధ దశల్లో ముందుండి ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్…తెలంగాణకు కాంగ్రెస్ అడుగడుగునా చేసిన ద్రోహాలతో విసిగిపోయారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఆమరణ నిరాహార దీక్షనే అస్త్రంగా ఎంచుకున్నారు. ‘కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో’ ఏదో ఒక్కటే జరగాలని శపథం పూని దీక్షకు కూర్చున్నారు. అయితే ‘తెలంగాణ జైత్రయాత్ర లేదా నా శవయాత్ర’ అని ధైర్యంగా ప్రకటించిన ఏకైక నాయకుడు కేసీఆర్. ఆమరణ దీక్షతో దిగివచ్చిన కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేసింది. అయితే, ఆంధ్రా నాయకులు రాజీనామాలతో బెదిరిస్తే కాంగ్రెస్ మళ్ల్లీ వెనక్కి తగ్గింది. దీంతో మళ్లీ కేసీఆర్ పూనుకొని ప్రొఫెసర్ జయశంకర్‌తో సమాలోచనలు జరిపి, తెలంగాణ పార్టీలన్నింటినీ ఒక్క తాటిమీదికి తెచ్చి కోదండరాం ఆధ్వర్యంలో జేఏసీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కూడా మూడేండ్లు ఉద్యమం నడిపించారు. వంటావార్పు, సాగరహారం, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మెలాంటి అస్ర్తాలను ప్రయోగించారు. ఆంధ్రా నాయకుల కుట్రలను బద్దలు కొట్టారు.
అలా దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు స్వప్నించిన తెలంగాణ రాష్ట్రసాధన కలను సాకారం చేశారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమ ఉధృతితో చివరకు కేంద్రం దిగివచ్చింది. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేసింది. రాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడే పాలకుడు కావాలని ప్రజలు తీర్పునిచ్చారు. దీంతో ఉద్యమ నాయకుడే పాలనా పగ్గాలు చేపట్టారు. తొమ్మిదిన్నరేండ్లపాటు రాష్ర్టాన్ని సుభిక్షంగా పాలించారు. సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించారు. సంపదను పెంచి, ప్రజలకు పంచారు. తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రపథాన నిలబెట్టారు. 2014 జూన్ 2న, ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాడే నవ తెలంగాణ నిర్మాణానికి పునాది పడింది. ఆ క్షణం నుంచే కోట్లాది మంది ప్రజల దశాబ్దాల కలలను, ఆకాంక్షలను నిజం చేస్తూ ‘సుపరిపాలన’ పర్వం మొదలైంది. కేవలం ఎన్నికల మేనిఫెస్టోకే పరిమితం కాకుండా, ప్రజల కష్టాలను కండ్లారా చూసిన కేసీఆర్, మేనిఫెస్టోలో చెప్పినవి చేస్తూనే, చెప్పని ఎన్నో విప్లవాత్మక పథకాలను అమలుచేశారు.
ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కాళేశ్వరం నిర్మాణం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, గ్రామీణ వృత్తులకు చేయూతనిచ్చే గొర్రెల పంపిణీ, చేపల పెంపకం, పాడి రైతులకు పథకాలు చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ‘ఓవర్సీస్ స్కాలర్షిప్లు..ఇలా ప్రతి పథకం వెనుక ఒక మానవీయ కోణం, ప్రతి అడుగులో ప్రజల పురోభివృద్ధిని నింపుకొని, బీఆర్ఎస్ పాలన చేసింది. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి.. రెండున్నరేండ్లయినా పూర్తి చేయలేక చేతులెత్తేసింది. ‘మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు ప్రజల ఆశలను నీరుగార్చుతూ కేవలం ప్రచారానికే పరిమితమైంది. అస్తవ్యస్త నిర్ణయాలతో తెలంగాణ ప్రగతిరథం వెనక్కి పరుగులు పెడుతున్నది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు పోరాడుతూ ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా పోషిస్తున్నది.
(వ్యాసకర్త: శాసనమండలి సభ్యుడు)
-తక్కెళ్లపల్లి రవీందర్రావు