మురికి వాడల్లోని పేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేసే సెర్ప్ పరిధిలోని మహిళా సంఘాల సహాయకులకు రక్షా బంధన్ పర్వదినం నాడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనాన్ని రూ.5900 నుంచి రూ.8 వేలకు పెంచింది. మహిళా సంఘాల కృషిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆయా సంఘాల మనుగడకు ఎంతో ప్రోత్సాహకరం.
క్షేత్రస్థాయిలో పనిచేసే రాష్ట్ర ప్రభుత్వ చిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో, వారి కుటుంబ అవసరాలకు తగిన విధంగా వేతనాలు చెల్లించడంలో సీఎం కేసీఆర్ ఎప్పుడూ ముందుంటున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగా వీఓఏలు, ఆర్పీలు మరింత ఉత్సాహంతో పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) పరిధిలో 4,31,402 మహిళా సంఘాలు పని చేస్తున్నాయి. వాటిలో 46,21,275 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. 10 లేదా 15 మంది సభ్యులతో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయించి, వారికి పొదువు అలవాట్లను నేర్పించి, రుణాలు ఇప్పించి ఆర్థికంగా పైకి ఎదగడానికి విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు(వీఓఏలు), రిసోర్స్ పర్సన్లు(ఆర్పీలు) నిరంతర కృషి చేస్తున్నారు. సభ్యుల నుంచి రుణాలు తిరిగి వసూలు చేయడం, మహిళా సంఘాల సమావేశాలు సక్రమంగా నిర్వహించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి కృషిని గుర్తించిన సీఎం కేసీఆర్ 2017లో వీఓఏలకు ప్రభుత్వం తరపున రూ.3 వేలు, సమాఖ్యల తరపున రూ.2 వేలు కలిపి మొత్తం రూ.5 వేలు గౌరవ వేతనంగా చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. 2019లో ఆర్పీలకు రూ.6 వేలు గౌరవ వేతనంగా చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం అందించిన గౌరవ వేతనాలతో వీఓఏలు, ఆర్పీలు మరింత ఉత్సాహంగా పని చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ, ప్రభుత్వానికి అవసరమైన సర్వేలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో మహిళలు చురుగ్గా పాల్గొనేటట్టు ప్రోత్సహిస్తున్నారు. స్వచ్ఛ తెలంగాణ, మరుగుదొడ్ల నిర్మాణం, అక్షరాస్యత కార్యక్రమాలు, కంటి వెలుగు, సమగ్ర కుటుంబ సర్వే మొదలైన కార్యక్రమాల్లో తమ వంతు బాధ్యత నిర్వహిస్తూ ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నారు.
మొత్తం రుణాల్లో 98 శాతం రుణాలను రికవరీ చేయడంలో వీఓఏలు, ఆర్పీలు గురుతరమైన బాధ్యత నిర్వహిస్తున్నారు. ఈ కారణం వల్ల స్త్రీ నిధి సహకార బ్యాంకు మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలు జాతీయ బ్యాంకులు ఇచ్చే రుణాలను మించిపోతున్నాయి. సంవత్సరానికి రూ.20 వేల కోట్ల రుణాలు మహిళా సంఘాలకు మంజూరవుతున్నాయి. మహిళల్లో ఆర్థిక స్వావలంబనను పెంపొందించి వారు కుటుంబ పోషణకు సహాయపడేలా తీర్చిదిద్దేందుకు 2000 సంవత్సరం నుంచి మురికి వాడల్లో సెర్ప్ అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. వారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనేందుకు రుణాలను అందిస్తూ చేయూతను అందిస్తున్నది. స్వయం సహాయక సంఘాల సహకారంతో పేద మహిళలు ఈ రుణాలతో వ్యాపారాలు ప్రారంభించి తమ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ సంఘాలకు కేటాయించి ప్రోత్సాహం అందించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఈ సంఘాలకే అప్పగించారు.
వీఓఏలు, ఆర్పీల సంక్షేమం గురించి మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రభుత్వ చిరుద్యోగులు, కార్మికుల బాగోగులను పట్టించుకోవడంలోనూ సీఎం కేసీఆర్ బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. వారితో ప్రగతి భవన్లో సమావేశమై వారి కష్ట సుఖాలను తెలుసుకొని, వారి కుటుంబ అవసరాలకు అనుగుణంగా వేతనాలు పెంచుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చిరుద్యోగుల ఇతర సమస్యలను కూడా మానవతా దృక్పథంతో పరిష్కరించడం ఆయన సహృదయతకు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం పని చేసే ఆశా కార్యకర్తలకు దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకురూ.9750/- జీతాన్ని అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు సీఎం కేసీఆర్. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు గ్రామ పంచాయితీల ఆదాయం నుంచి 30 శాతం మాత్రమే జీతాల చెల్లింపునకు వినియోగించాలని నిబంధనలు ఉన్నప్పటికీ వారికి రూ.8500 వేతనం ఇచ్చి వారిని ఆదుకుంటున్నది కేసీఆర్ ప్రభుత్వం. చిరుద్యోగులకు వేతనాలు పెంచి ఆదుకొన్న సీఎం కేసీఆర్, ఏ ఆసరా లేని అభాగ్యులు, వికలాంగులకు, వృద్ధులకు ఆసరా పింఛన్లు అందిస్తూ వారి జీవనానికి అండగా నిలుస్తున్నారు. అందుకే వారంతా సీఎం కేసీఆర్ను తమ పెద్దన్నగా, పెద్ద కొడుకుగా భావిస్తూ ఆయన ప్రజా పాలనను కొనియాడుతున్నారు.
(వ్యాసకర్త: రాష్ట్ర గౌరవాధ్యక్షులు, వీఓఏ ఉద్యోగుల సంఘం)