తెలంగాణ వచ్చేనాటికి వ్యవసాయరంగం ఎలా కుదేలైందో రాష్ట్ర రైతులకు తెలుసు. సాగునీటి వసతి లేదు, కాకతీయుల పుణ్యమాని తవ్విన చెరువులు పూడుకుపోయాయి. పేరు కోసమే మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులుగానే ఉన్నాయి. లక్షలాది రూపాయలతో వేసుకున్న బోర్లకు చాలినంత కరెంటు రాదు. సాగుకు పెట్టుబడి లేక, పంట దిగుబడి సరిగా రాక, పండిన పంటకు సరైన ధర రాక రైతు వ్యవసాయం చేయాలంటేనే బాధతో కుమిలిపోయాడు. తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తూనే కొంతమంది రైతులు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం.. 2014 ముందు ఎక్కువగా వ్యవసాయ సంబంధిత ఆత్మహత్యలు నమోదయ్యాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారింది. ప్రభుత్వం రైతు ప్రాయోజిత పథకాలను తీసుకువచ్చి సాగుకు సంబంధించిన అన్ని వసతులపై ప్రత్యేక దృష్టి సారించింది. తద్వారా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కనుమరుగయ్యాయి.
2014లో తెలంగాణ వచ్చేవరకు అరవై ఏండ్ల కాంగ్రెస్, టీడీపీల పాలనలో వ్యవసాయ రంగానికి కరెంటు ఎప్పుడూ పూర్తిస్థాయిలో అందలేదు. లో వోల్టేజీతో మోటర్లు తరచూ కాలిపోయేవి. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేవి. రాత్రి వేళల్లో కరెంటు మోటర్ పెట్టేందుకు వెళ్లి ఎంతోమంది రైతులు పాము, తేలు కాటుకు బలయ్యారు. ఇలా ఎన్నో రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలనాపగ్గాలు చేపట్టిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ రైతులకు ఇచ్చిన అపురూప కానుక వ్యవసాయానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, మిషన్ కాకతీయ ద్వారా 46 వేల చెరువుల పునరుద్ధరణ, రైతుబంధు, రైతు బీమా లాంటి ఎన్నో రైతు సంక్షేమ పథకాలను ఆయన ప్రవేశపెట్టారు. ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారింది. తెలంగాణలో 2014 జూన్ 1 నాటికి 19 లక్షల బోర్లు ఉంటే, అవి 2023 నాటికి 30 లక్షలకు పెరిగాయి. ఈ మోటర్లకు 24 గంటల ఉచిత కరెంటు కోసం ప్రభుత్వం ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి విద్యుత్ సరఫరా చేసేందుకు ఇప్పటిదాకా రూ.37,911 కోట్లు ఖర్చుచేసింది. 2014లో తెలంగాణలో స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా 2023లో ఇది 18,528 మెగావాట్లు.
తెలంగాణ రైతులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినాయి. ఇప్పటివరకు రైతుబంధు పథకం కింద సుమారు 70 లక్షల మంది రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున 11 విడుతల్లో రూ.75,000 కోట్లు రైతు ఖాతాల్లో నేరుగా జమచేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే రైతు బీమా పథకం ద్వారా రూ.5 లక్షల చొప్పున 1,05,997 రైతు కుటుంబాలకు మొత్తం రూ.5,300 కోట్లు బీమా పరిహారంగా చెల్లించి, రైతు కుటుంబాలకు అండగా నిలిచింది. ఇలాంటి పథకం ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు.
కేసీఆర్ మది నుంచి పుట్టిన అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టుతో పాటు 20కి పైగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసి, 46 వేల చెరువులను బాగుచేసి, వేలాది చెక్‌డ్యాములు నిర్మించిందీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా చేసిన ఘనుడు సీఎం కేసీఆర్. తెలంగాణను మొత్తం 2,604 వ్యవసాయ క్లస్టర్లుగా చేసి, ఒక్కో క్లస్టర్‌కు రైతువేదిక నిర్మించి, ఒక ఏఈవోను నియమించి, గ్రామ గ్రామాన రైతుబంధు కార్యకర్తలను ప్రవేశపెట్టి రైతు ఇంటిముందు వ్యవసాయశాఖను నిలబెట్టిందీ ప్రభుత్వం. ఈ విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గత తొమ్మిదేండ్లలో వ్యవసాయరంగాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేసి రైతన్నకు భరోసా కల్పించారు. తెలంగాణ వ్యవసాయాభివృద్ధి సూచికలను ఈ వ్యాసంలోని పట్టికలో చూద్దాం.

రైతు సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేకరకాలుగా చర్యలు తీసుకొని అద్భుత విజయాలు సాధిస్తుంటే, మరో పక్క కాంగ్రెస్ నాయకత్వం వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని ఊదరగొడుతున్నది. కరెంటు ఉచితంగా ఇవ్వొద్దని రాగం అందుకుంటున్నది. రైతులందరికీ తమ పంటకు ఎంత కరెంటు కావాలో తెలుసు. పరాయి పాలనలో రైతులు ఎదుర్కొన్న బాధలను రైతుబంధు కార్యకర్తలు, రైతులు వివరిస్తుంటే కాంగ్రెస్ నాయకులు వారిని బెదిరిస్తున్నారు. బూతు పురాణం చదువుతున్నారు.
ఈ సందర్భంగా రైతులు, రైతుబంధు కార్యకర్తలు తమ రైతు వేదికల్లో సమావేశం కావాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్తు మీద చర్చించి, ఎకరానికి ఒక గంట ఇస్తే సరిపోతుందని, మొత్తం 3 గంటల కరెంటు ఇస్తే చాలని, అది కూడా ఉచితంగా అవసరం లేదని చెప్తున్న రైతు వ్యతిరేక నాయకులను, వారి పార్టీ విధానాలను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అటువంటి రైతు వ్యతిరేకులను ఊరి పొలిమేర దాకా తరిమికొడదాం. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన అద్భుతమైన కానుక 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్తు సరఫరా కొనసాగించాలని తీర్మానం చేద్దాం.
(వ్యాసకర్త: ఎమ్మెల్సీ, అధ్యక్షులు తెలంగాణ రైతుబంధు సమితి)
డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి