Petro rates : ఇరాన్ (Iran) పై ఇజ్రాయెల్-అమెరికా చేస్తున్న దాడులు, ఇరాన్ ప్రతిదాడుల కారణంగా పశ్చిమాసియాలో చెలరేగుతున్న యుద్ధ సెగలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను దహించివేస్తున్నాయి. ఈ యుద్ధం ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీసింది. ఫలితంగా పొరుగు దేశమైన నేపాల్ (Nepal) లో పెట్రో ధరలు రాత్రికి రాత్రి రికార్డు స్థాయికి చేరాయి. ఈ మేరకు నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ (NOC) సంచలన నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థలో అంతరాయాల కారణంగా నేపాల్ ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా పెంచింది. పెట్రోల్ లీటరుకు రూ.31 పెరిగి ఇప్పుడు రూ.188 కి చేరింది. డీజిల్ ఏకంగా రూ.54 పెరిగి లీటరు ధర రూ.196 కి చేరుకుంది. ఎల్పీజీ సిలిండర్‌పై రూ.296 భారం పడటంతో.. ఇప్పుడు ఒక్కో సిలిండర్ ధర రూ.2,126 కు చేరింది. ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి.
ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ గుండా నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో అంతర్జాతీయంగా ముడి చమురు కొరత ఏర్పడింది. ఈ ప్రభావం నేరుగా దిగుమతులపై ఆధారపడే నేపాల్ వంటి దేశాలపై పడింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తమకు నిరంతరాయంగా ఇంధనాన్ని సరఫరా చేస్తున్న ‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్’కు నేపాల్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. భారత్‌లో ప్రస్తుతానికి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ సరిహద్దు దాటితే మాత్రం పెట్రో మంటలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి.