నాయకులందరూ ప్రజల ఓట్లతోనే గెలుస్తారు. గెలిచిన వారందరూ కొద్దో గొప్పో ప్రజాసేవ చేస్తుంటారు. వారిలో కొందరే ప్రజల మనసులను గెలుస్తారు. ఆ కొందరిలో ఒక్కరో ఇద్దరో మాత్రమే బాధ్యతగా తమను గెలిపించిన ప్రజలను కూడా గెలిపిస్తారు. ప్రజలు వాళ్ల జీవితాలను గెలుచుకునేలా తోడుగా, నీడగా, అండగా నిలుస్తారు. అలా నిలిచిన నాయకుడే మన కేటీఆర్. ఆయన ప్రజా నాయకుడే కాదు.ప్రజల నాయకుడు. ప్రజలను గెలిపిస్తున్న నాయకుడు.
దయార్ద్ర హృదయుడే కాదు, నాయకుడిగా తన బాధ్యతలు తెలిసి దయాగుణంతో స్పందిస్తున్నవాడు. తాను నమ్మిన ప్రజలకు, తనను నమ్మిన ప్రజలకు తోడుగా నీడగా ఉండాలన్న తపన ఉన్నవాడు. తపన ఉండటమే కాదు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్నవాడు. కేవలం ట్విట్టర్లో ఒక మెసేజ్ పెడితే చాలు, వెంటనే బాధ్యతగా స్పందిస్తున్నవాడు.
ఆ పేరే ఒక చైతన్యం ఆ రూపంలో ఒక దయాగుణం. అంతే కాదు, అతను ఒక గొప్ప పరిపాలనాదక్షుడు. కాలానికి అనుగుణంగా ఈ సమాజానికి ఏం కావాలో గుర్తించేవాడు. గుర్తించడమే కాదు, యువత కలలను నిజం చేసేవాడు. నిరుద్యోగ సమస్యను తీర్చి యువతకు ఉపాధి కల్పించడంలో కేటీఆర్ అందరికంటే ముందున్నారు.
ఎక్కడో ఆదిలాబాద్ అడవుల్లో ఓ పసికూన అనారోగ్యంతో తల్లడిల్లిపోతుంది. వైద్యం అందుబాటులో ఉండదు. ఉన్నా చేయించుకునే స్థోమత ఉండదు. తల్లిదండ్రులు ఆశ చాలించుకుంటారు. అమ్మాయి పడక మీద చావును ఆహ్వానిస్తూ అవస్థలు పడుతుంది. ఎవరో చెప్తే మిణుకు మిణుకు మంటున్న ఆశతో చివరిసారిగా ఆ తండ్రి కేటీఆర్ ట్విట్టర్‌ను ఆశ్రయిస్తాడు. ఒక్కసారిగా ధర్మగంట మోగుతుంది. ఆఫీసు అలర్ట్ అవుతుంది. అందాల్సిన సహాయం సమయానికి అందుతుంది. చచ్చిపోతుందనుకున్న ఆ చిన్నారి చిరునవ్వుతో బతికి బయటపడుతుంది. ఆ తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగు నిండుతుంది.
ఎక్కడో ఖమ్మంలో ఓ మారుమూల పల్లెలో ఓ చదువుల తల్లికి ఉన్నత చదువుల్లో సీటు వస్తుంది. చదువాలని ఉంటుంది. కానీ చదువలేని పరిస్థితి. ఫీజులు కట్టడానికి డబ్బులుండవు. తల్లిదండ్రులు చేతులెత్తేస్తారు. చదివినకాడికి చాల్లే ఓ కుట్టుమిషనో, బీడీలో నేర్చుకొని బతుకుదెరువును చూసుకోమంటారు. ఆత్మను చంపుకోలేక, అలాగని చదువలేక ఆ తల్లి తనలో తాను ఏడుస్తూ తల్లడిల్లి పోతుంది. ఎవరో చెప్తే చివరి ఆశగా ‘అన్నా నన్ను ఆదుకో’ అని ట్విట్టర్లో ఓ నాలుగు మాటలు రాస్తుంది. అంతే ఇక్కడ ధర్మగంట మోగుతుంది. ఆఫీసు అలర్ట్ అవుతుంది. అందాల్సిన సహాయం సమయానికి అందుతుంది. ఆ అమ్మాయి చిరునవ్వుతో కాలేజీ మెట్లు ఎక్కుతుంది. ఆమె ఆశ నెరవేరినందుకు ఆ తల్లిదండ్రుల మొహంలో చిరునవ్వు విరుస్తుంది.
ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఒక్కటి కాదు, రెండు కాదు. ఇలాంటివి మరెన్నో… వందల మందికి అతను ఆపదలో ఆదుకునే ఒక భరోసా. ఎక్కడో ఎవరో ఏదో చిన్న ఆపదలో ఉండి అన్నా అని సహాయం కోసం అర్థిస్తే నేనున్నానని తన సైన్యంతో ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకునే ఒక గొప్ప మహోన్నత మనస్తత్వం ఆయనది. తెలంగాణలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుగా గుర్తొచ్చేది కేటీఆర్. అందరికీ అందుబాటులో ఉంటూ ఆపదలకు స్పందిస్తూ తర తమ భేదం లేకుండా నేనున్నానని ధీమా ఇచ్చే నాయకుడు కేటీఆర్.
ఆ పేరే ఒక చైతన్యం ఆ రూపంలో ఒక దయాగుణం. అంతే కాదు, అతను ఒక గొప్ప పరిపాలనాదక్షుడు. కాలానికి అనుగుణంగా ఈ సమాజానికి ఏం కావాలో గుర్తించేవాడు. గుర్తించడమే కాదు, యువత కలలను నిజం చేసేవాడు. నిరుద్యోగ సమస్యను తీర్చి యువతకు ఉపాధి కల్పించడంలో కేటీఆర్ అందరికంటే ముందున్నారు. ఐటీ రంగానికి ఆయన ఒక ఐకాన్. ఐటీ హబ్‌లను ఏర్పాటుచేస్తూ వేల మందికి ఉపాధినివ్వడంతో పాటు దేశదేశాలు తిరిగి ప్రపంచ దిగ్గజాలు అనుకున్న అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, క్వాల్కమ్, ఒరాకిల్, నొవార్టిస్, బ్యాంక్ ఆప్ అమెరికా, మైక్రాన్, డెల్ లాంటి వందల కంపెనీలను తెలంగాణకు తెచ్చి లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు.
తన చొరవతో రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు 2021-22లో రూ.1,83,569 కోట్లు కాగా 2022-23 నాటికి రూ.2,41,275 కోట్లకు పెరిగాయి. ఈ 57,706 కోట్ల పెంపు తెలంగాణ ఏర్పాటైన తర్వాత అత్యధిక వార్షిక పెరుగుదల. తన చొరవ పట్టుదలతోనే ఐటీ/ఐటీఈఎస్ రంగంలో రాష్ట్రం వేగంగా పురోగమిస్తున్నది. రెండవ ఐసీటీ పాలసీ ప్రకారం 2026 వరకు 3 లక్షల కోట్ల ఎగుమతులు, 10 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా 2024 నాటికే ప్రతిష్ఠాత్మకమైన ఆ మైలురాళ్లను సాధించే దిశగా అడుగులు వేస్తున్నది. అందులో కేటీఆర్ కృషి ఎంతో ఉన్నది.
అంతే కాదు. ఆయన రాజకీయ చతురుడు. గతాన్ని పునాదిగా చేసుకొని వర్తమానం మీద భవిష్యత్తును అందంగా నిర్మించగల ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు. రాజకీయ నాయకుడిగా ఆయన తన ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు నిజంగా ఒక ఆణిముత్యం. ఇప్పుడూ అంతే.. ఆయన మనసు నవనీతం. రాజకీయాల్లో ఎలా ఇముడుతాడో అనుకుంటే ఇప్పుడు రాజకీయాలకే దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగారు. అసలు ఆయన రాజకీయ ప్రస్థానమే ఉద్యమంతో మొదలైంది. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి కొట్లాడి ఉద్యమానికి నాయకత్వం వహించి లక్షల మందిని కదిలించి, మెప్పించి, ఒప్పించి తెలంగాణ సాధనలో ముందున్నారు. పార్టీ పగ్గాలు చేతబట్టి తన విలక్షణ ఆలోచనా విధానంతో శత్రువులకు దీటైన సమాధానం ఇచ్చారు. ఇప్పుడు రాజకీయాలే ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. నాయకులంతా ఇలా ఉంటే నిజంగా ప్రజలకు మేలు జరుగుతుంది. కాలానికనుగుణంగా కొందరు నాయకులు తయారుకావచ్చు. కానీ మారుతున్న కాలం తనకనుగుణంగా కొందరు నాయకులను తయారుచేసుకుంటుంది. అలా ఎదుగుతున్న కాలం తన కోసం తయారుచేసుకున్న ఉత్తమ నాయకుడే కేటీఆర్. ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
పెద్దింటి అశోక్ కుమార్
94416 72428