‘తెలంగాణ’ పదాన్ని శాసనసభలోనే నిషేధించిన సమయం. తెలంగాణ ప్రజలు వాళ్ల యాసను వారే మర్చిపోవాలన్న నిర్బంధం. తెలంగాణ కళలు, సంస్కృతిని రూపుమాపడానికి కొనసాగుతున్న కుట్రలు. తెలంగాణ చరిత్రనే చెరిపేశామని, ఇక తెలంగాణ పదాన్ని మర్చిపోయేలా చేశామని సమైక్యాంధ్ర వాదులు విర్రవీగుతున్న సందర్భం. చంద్రబాబు ఏపీ రాజకీయాలనే కాకుండా భారత రాజకీయాలను కూడా శాసిస్తూ విజన్-2020 అంటూ అప్పటివరకు నేనే ముఖ్యమంత్రిని అని తనకు తానే ప్రకటించుకున్న అంతులేని అధికార దాహం… అప్పుడే మొదలైంది ఒక ధిక్కార స్వరం. నేనున్నాను తెలంగాణ కోసం అంటూ వినిపించింది సిద్దిపేట నుంచి గళం. ‘నా స్వప్నం.. నా ధ్యేయం.. తెలంగాణ రాష్ట్రం’ అంటూ తన పదవులను గడ్డిపోచలా విసిరి తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా టీఆర్ఎస్ను స్థాపిస్తున్నట్టు ప్రకటించారు కేసీఆర్.
పార్టీ స్థాపనకు కొన్ని నెలల ముందునుంచే ఆయనతో నా ప్రయాణం ప్రారంభమైంది. పద్నాలుగేండ్ల ఉద్యమం, పదేండ్ల అధికారం, ఏడాదిన్నర ప్రతిపక్ష పాత్రలో కేసీఆర్‌తో లక్షలాది గుర్తులు. అంతేస్థాయిలో జ్ఞాపకాలు ఉన్నాయి. రాష్ట్ర సాధకునితో సమీప సాన్నిహిత్యం నా జన్మకు సార్థకం. కీలక పరిణామాల్లో సాక్షిగా నాకు అరుదైన అవకాశం. ఉద్యమ సమయంలో గంటలు, రోజులు, నెలలు, ఏండ్ల పాటు చర్చల్లో కేసీఆర్‌తో ఉన్నా. ‘సోనియా గాంధీ ఇస్తామంటే తీసుకొని పోదామని’ కేసీఆర్ సార్ అంటుంటే అక్కడ కాంగ్రెస్ పెద్దల ద్వారా ‘రేపు’ అనే సమాచారం వచ్చేది. చాలాసార్లు పొద్దున్నే కాంగ్రెస్ పెద్దలు సారీ అనేవారు. ఏండ్ల తరబడి ఆశ.. నిరాశ.. కొన్ని సందర్భాల్లో 3 నుంచి 6 గంటలు ఇద్దరమే కూర్చొని ఒక్కమాట మాట్లాడకుండా ఉండేవారం.
ఏడెనిమిది గంటలు కూడా ఉండేవాళ్లం. మౌనంతోనే ఉండే సందర్భాలె న్నో… కేసీఆర్ వెంట నడవడం అంటే నా అదృష్టం. ఓ అనుభూతి. నన్ను నమ్మకస్థునిగా చూడటమే కాకుం డా సూర్యాపేటపై ప్రత్యేక అభిమానం చూపించిన కేసీఆర్ 2012లో సూర్యాపేట నుంచే కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, పించన్లతో పాటు అనేక పథకాలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేయడం ద్వారా సూ ర్యాపేటపై ఆయనకున్న అభిమానాన్ని తెలుపుతున్నది. పదవి ఉన్నా లేకున్నా ఆయనతో సాన్నిహిత్యమే నా ఆశయం.
విద్యుత్తు చార్జీలు పెంచాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆ ఉత్తరం చదివి కొంతమంది న్యాయవాదులతో కలిసి నేను కేసీఆర్ దగ్గరికి వెళ్లా. ఆనాడు అనేక విషయాలపై చర్చ జరిగింది. స్వతహాగా లెఫ్ట్ ఉద్యమం నుంచి వచ్చిన నేను కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని ఆనాడే నిర్ణయం తీసుకున్నాను. మీ వెంట నడుస్తానని నాడే కేసీఆర్‌కు చెప్పాను. బంద్‌లు, రాస్తారోకోలు వద్దు, ఒక్క రక్తపు చుక్క కారొద్దు, ఒక్క విద్యార్థి బడి గంట కూడా వృథా కావద్దని వందల, వేల సార్లు చెప్పారు. ఈ ఉద్యమ పంథా అర్థం కాని వారికి, నచ్చని వారికి వంద సార్లయినా కేసీఆర్ ఓపికగా చెప్పేవారు.
నాటి టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు మంత్రి పదవి ఇస్తే కేసీఆర్ అసలు ఉద్యమం మొదలుపెట్టేవాడు కాదని కొందరు అర్భకులు అంటుంటారు. కానీ, అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిన అంశం ఒకటి ఉన్నది. కేసీఆర్‌కు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోరిక అనేది పార్టీ స్థాపించిన దానికి దాదాపు పదేండ్ల ముందునుంచే ఉన్నది. దానికి ఓ ఉదాహరణ అంటూ వివరిస్తూ.. 2002లో నిర్మల్ పార్టీ ఇంచార్జిగా పొమ్మని కేసీఆర్ నాకు చెప్పిండు.
పోయే రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు పిలిచి ‘నిర్మల్‌లో సత్యనారాయణ అని టీడీపీ నాయకుడుంటాడు, ఆయనను కలవ’మని చెప్పడంతో వెళ్లి కలిశాను. కేసీఆర్ చెప్పినట్టుగా ఆయనను ఉద్యమంలోకి ఆహ్వానించగా, ఆయన 1996లో పోచంపాడు ప్రాజెక్టుపై జరిగిన సంఘటనను గుర్తుచేశాడు. నాడు మంత్రిగా ఉన్న కేసీఆర్ నిర్మల్ ఉప ఎన్నికకు వచ్చినప్పుడు తనను సమీపంలోనే ఉన్న ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు వద్దకు తీసుకుపోయి చూపిస్తూ ‘తెలంగాణ ప్రాజెక్టులేమో ఈ రకంగా బోసిపోయి ఉన్నాయి, కానీ ఆంధ్రా ప్రాజెక్టులు మాత్రం వెలుగులు విరజిమ్ముతుంటాయి. తెలంగాణ వస్తే తప్ప మన ప్రాజెక్టులు బాగుపడవు. మనకు నీళ్లు రావు’ అని కేసీఆర్ అన్న విషయాన్ని సత్యనారాయణ నాతో చెప్పాడు. 1996లోనే కేసీఆర్ తెలంగాణ పదం అంటే ఆశ్చర్యం ఏసిందిని సత్యనారాయణ నాకు చెప్పాడు. మరి తెలంగాణ ఎట్ల వస్తదంటే ఆ సందర్భం వచ్చినప్పుడు నేనే ఉద్యమం ప్రారంభిస్తానేమోనని కేసీఆర్ అన్నడని సత్యనారాయణ చెప్పడాన్ని బట్టి కేసీఆర్‌కు ప్రత్యేక రాష్ట్ర వాంఛ ఎప్పుటి నుంచి ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాదు, భారత రాజకీయాలనూ శాసిస్తున్న రోజులవి. అలాంటి సమయంలో కేసీఆర్ అధికారాన్ని వదిలి ‘జై తెలంగాణ’ నినాదం ఎత్తుకోవడమే ఒక సాహసం.
పక్కన పిడుగుపడితే పడిపోయిందిలే అనుకునేంత మొండి ధైర్యం కేసీఆర్‌ది. ఎలాంటి ఒత్తిళ్లు, బాధలు వచ్చినా గుండె నిబ్బరంతో ఉండేవారు. అలాంటి కేసీఆర్ కళ్లల్లో ఎన్నోసార్లు ఎమోషనల్‌గా నీళ్లు తిరిగాయి. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారుల విషయంలో ఆగ్రహం, చాలా బాధ వ్యక్తం చేసేవారు. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొన్ని గంటల పాటు ఆలోచిస్తూ ముభావంగా గడిపేవారు.
తెలంగాణ సాధించి జీవితం సంతోషంగా గడపాల్సిన విద్యార్థులు ప్రాణాలు చాలిస్తే ఎలా?, సమయం వచ్చినప్పుడు ఏది చేయడానికైనా మనం సిద్ధంగా ఉన్నామని కాస్త వెనుకో ముందో తెలంగాణ సాధించి తీరుతామని విద్యార్థులు, యువతకు చెప్పాలని పదే పదే మాకు చెప్పేవారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా పార్టీ మారినప్పుడు కాస్త బాధపడ్డారు. ‘ఆ రోజు వరకు వెంట ఉండిపోతే బాధ ఉంటుంది కదా, మన వెంట ఉన్న కుక్కపిల్ల పోతేనే బాధ పడతాం, ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతుంటే గెలిచినవాళ్లు పోతే బాధపడమా’ అంటూనే మాకు ధైర్యం నూరిపోసేవారు. ఒక రోజు… సూర్యాపేటకు సమీపంలో జాతీయ రహదారి వద్ద కాలువలో నీళ్లు పోతుంటే ‘అవి కాళేశ్వరం నీళ్లన్నా’ అని నేను చెప్తే, వెంటనే కారు దిగి ఆ నీళ్లలో పూలు జల్లారు. కష్టపడి కాళేశ్వరం కడితే కాలువల ద్వారా దాదాపు 405 కిలోమీటర్ల దూరంలో ఆ నీటిని చూసి పరవశించిపోయా రు. ఫలితంగా ఆ రోజు ఆయన కండ్లల్లో ఆనందబాష్పా లు చూశాను. నవ మాసాలు మోసి ప్రసవించిన తర్వా త మొదటిసారి తన బిడ్డను చూసుకున్నప్పుడు తల్లికి ఎటువంటి భావన ఉంటదో ఆ నీళ్లను చూసినప్పుడు కేసీఆర్ కళ్లల్లో అటువంటి అనుభూతి కనిపించింది.
కేసీఆర్… తెలంగాణ ఎలా తీసుకురావాలి. రేపు ఎలాంటి కార్యక్రమం చేయాలి. ఎవరెవరిని కలవాలి. ఏ రూపంలో ఉద్యమం చేయాలనే వాటిపైనే రోజుకు 12 గంటలకు పైనే చర్చలు చేస్తూ బిజీగా ఉండేవారు. అయినా కేసీఆర్ సామాజిక అంశాలను పట్టించుకునేవారు. ఓ సారి రోడ్డు వెంట నడుస్తుంటే అక్కడ ఒక పెద్ద వృక్షాన్ని సగానికి పైనే కొట్టివేసి ఉంది. దాన్ని చూసి ‘అయ్యో ఆ చెట్టును చూడు.. కొట్టివేస్తున్నారు’ అని బాధపడ్డారు. ‘పెంచడానికి ఎంతకాలం పట్టుద్ది, కాపాడాలి కదా’ అన్నారు. మరోసారి వీధిలో వెళ్తూ మున్సిపల్ నల్లా ద్వారా వృథాగా నీరు పోతుంటే చూసి ‘కట్టడి చేయలేమా’ అని ప్రశ్నించారు.
ఉద్యమ సమయంలోనే ఇలాంటివాటిని చూసి కలెక్టర్ లేదా ఇతర అధికారులకు ఫోన్ చేయించేవారు. మమ్మల్ని అలా బాధ్యతాయుతమైన నాయకులుగా తీర్చిదిద్దారు. ఈ ప్రాంతం మనది. ప్రజలు మనవారు అనేలా ఉండాలని చెప్పేవారు. కేసీఆర్ దగ్గరికి వెళ్లేనాటికి నేను ఏమీ కాను. అలాంటి నేను కేసీఆర్ వెంట ఉండటం నా అదృష్టంగా భావిస్తాను. ప్రతి క్షణం ఒక అనుభూతి. పోరాటమైనా, చర్చల సందర్భమైనా.. కలిసి భోజనం చేసినా.. కలిసి ప్రయాణం చేసినా.. ప్రతి క్షణం కేసీఆర్ నుంచి నేర్చుకోవడమే నా పని.
ఆయన మాటల్లో భావం ఉంటుంది, అలాగే మౌనంలోనూ భావం ఉంటుంది. నాటి ఉద్యమంలోనైనా, పదేండ్ల మంత్రిగానైనా, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నా… ప్రతి క్షణం నేర్చుకున్న విషయమే ఈ రోజు కనిపిస్తున్న నేను. నా ప్రతి మాట కేసీఆర్‌దే. నా ప్రతి అడుగు కేసీఆర్‌దే. జీవితం అన్నాక గెలుపోటములు, ద్రోహాలు అన్నీ ఉంటాయి. ఏ సందర్భంలో ఆ ఆనుభూతి, ఎక్కడైనా, ఎలా ఉన్నా నాయకుడనే వాడు బా ధ్యతతో ఉండాలనేది కేసీఆర్ నేర్పిన పాఠం. తెలంగాణ రాష్ట్ర సాధనతోనే కేసీఆర్ జీవితం ధన్యమైంది. అంతకుమించిన అద్భుతమేమీ లేదు. దానిముందు ఈ పదవులన్నీ చాలా చిన్నవి. నా విషయానికి వస్తే కేసీఆర్‌తో కలిసి నడవడం కంటే గొప్పదేదీ లేదు. కేసీఆర్ సహచర్యమే గొప్ప అనుభూతి. 25 ఏండ్లుగా కేసీఆర్‌తో కలిసి నడిచే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా.
– (వ్యాసకర్త: మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు) గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి