‘నా ప్రాణం పోయినా సరే.. రాబోయే ఐదేండ్లలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించి తీరుతా.. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిరూపిస్తా.. ఆరు నూరైనా ఎన్ని ఆటంకాలు కల్పించినా, ఎవరు అవరోధాలు సృష్టించినా.. హరిత తెలంగాణను సాధించేవరకు మా ప్రస్థానం ఆగేది కాదు. మమ్మల్నెవరూ ఆపలేరు. ఆపుదామనుకుంటే అది భ్రమే. నాకు ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటూ దీవిస్తున్న నా ప్రజల సహకారంతో ప్రాజెక్టులు కట్టితీరుతా. తెలంగాణ రాష్ట్రం మెయిన్ ట్యాగ్‌లైన్.. నీళ్లు, నిధులు, నియామకాలు. స్వరాష్ట్రంలో నిధులు, నియామకాలు సాధించాం. ఇక కావాల్సింది నీళ్ల పరిష్కారమే..’
2016 మార్చి 31న శాసనసభా వేదికగా చేసిన ప్రాజెక్టు రీ-డిజైనింగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలివి. నాడు చెప్పిన మాటలు ప్రస్తుతం ప్రజల కండ్లముందు సాక్షాత్కారవుతుంటే.. బహుముఖ ప్రజ్ఞాశాలి, విజ్ఞాని అయిన నేత కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ నవోదయాన్ని చూస్తున్నది.
గోదావరి నది ఒక్కటే, నిశితంగా చూస్తే విభిన్న దృశ్యాలు. ఎగువన గోదారమ్మ నీళ్లు లేక ఆపసోపాలు పడుతుంటే.. దిగువన పరవళ్లు తొక్కుతున్నది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ)లో నామమాత్రంగా నీళ్లుంటే.. దిగువన కాళేశ్వరం వద్ద జలకళ ఉట్టి పడుతున్నది. రోజురోజుకు వచ్చే ఇన్‌ఫ్లో పెరుగుతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం వద్ద వస్తున్న ప్రతి నీటిబొట్టును ఒడిసి పడుతూ.. ఎగువకు పంపింగ్ చేస్తూ.. లక్ష్మీబరాజ్ నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరకు వీటిని తీసుకెళ్తున్నారు. తద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో తాగు, సాగు నీటికి ఢోకా ఉండని పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నది. ఇక్కడ యావత్తు తెలంగాణ సమాజం ఆలోచించాల్సిందొక్కటే. ఒకవేళ మిగిలిన పాలకుల వలె.. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టకపోయి ఉంటే.. నేటి తెలంగాణ పరిస్థితి ఏమిటి? గోదావరి దిగువ నుంచి వందల టీఎంసీలు సముద్రం పాలయ్యేవి. కండ్లముందే నీళ్లు పారుతున్నా చుక్క నీటికోసం తెలంగాణ దిక్కులు చూడాల్సి వచ్చేది? సాగుకే కాదు, తాగుకు అల్లాడాల్సి వచ్చేది. నిత్యం మొగులుకు ముఖం తిప్పి రైతన్న దీనంగా కాలం వెళ్లదీయాల్సి వచ్చేది. సాగు భూములు బీడు భూములుగా మారేవి. ఎగువన గోదావరి ఎప్పుడొస్తుందా.. ఎస్సారెస్పీ నుంచి నీటిని ఎప్పుడు విడుదల చేస్తారా.. అని ఎదురుచూడాల్సి వచ్చేది.
దేశవ్యాప్తంగా కరువు పరిస్థితులు కనిపిస్తున్నా.. తెలంగాణలో మాత్రం కాళేశ్వరం జలాలు కాలువల వెంట పరుగులు తీస్తున్నాయి. జల వనరులపై సంపూర్ణ అవగాహన కలిగిన సీఎం కేసీఆర్ స్వయంగా రీ-డిజైన్ చేసిన కాళేశ్వరం ఆవశ్యకత ఇప్పుడు కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్నది.
ఒక విజ్ఞానవంతుడు, దార్శనికత గల వ్యక్తి, తమ ప్రాంతంపై సంపూర్ణ అవగాహన కలిగిన నాయకుడు ఉంటే.. వారు చేసే పనులు ప్రజలకు కష్టకాలంలో ఎలా ఉపయోగపడుతాయో అని చెప్పడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిదర్శనం. సీఎం కేసీఆర్ 2016 మార్చి 31న అసెంబ్లీ సాక్షిగా ప్రాజెక్టులపై ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లోనే కూలంకషంగా చెప్పారు.
‘గోదావరి నీటి ప్రవాహ పరిస్థితి మారింది. ఎస్సారెస్పీకి ఎగువన ఉన్న రాష్ర్టాలు వందల సంఖ్యలో బరాజ్‌లు కట్టడం వల్ల దిగువకు నీరు రావడం లేదు. ఫలితంగా ఉత్తర తెలంగాణ వరప్రదాయిని ఎస్సారెస్పీ మనుగడే ప్రశ్నార్థకమవుతున్నది. ఈ నేపథ్యంలో భవిష్యత్ తరాలకు ఇంద్రావతి, ప్రాణహిత నీళ్లే ఆధారం. వాటిని వినియోగించుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. ఆ నీటిని ఒడిసిపట్టి కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చి తీరుతాం. ఇందులో భాగమే మా రీ-డిజైనింగ్’ అని వివరించారు. కాళేశ్వరం వద్దే ఎత్తిపోతల పథకం చేపట్టడానికి కారణాలను కూడా ఆ రోజు విప్పిచెప్పారు. మేడిగడ్డ, తుమ్మిడిహట్టి వద్ద 57 ఏండ్ల సగటు నీటి లెక్కలను వివరించారు. తుమ్మిడిహట్టి వద్ద 1,144.8 టీఎంసీలు సరాసరి నీటి లభ్యత ఉంటే.. కాళేశ్వరం వద్ద 1,651 టీఎంసీల లభ్యత ఉన్నదని, ఇంద్రావతి కలిసిన తర్వాత పేరూరు వద్ద లభ్యత 2,340 టీఎంసీలుగా ఉందని గణాంకాలతో సహా వివరించారు. గోదావరిలో ఇంద్రావతి కలిసిన తర్వాత తుపాకుల గూడెం వద్ద బరాజ్ నిర్మిస్తే.. మేడిగడ్డ వద్ద భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడినా ఇంద్రావతి నీటిని తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. నాడు చెప్పిన ప్రతి మాట నేడు కార్యరూపం దాల్చి ప్రజల ముందు సాక్షాత్కరిస్తున్నది.
ఒక్క మాటలో చెప్పాలంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ తన నిర్ణయాలతో సాగునీటి రంగ ముఖచిత్రాన్ని మార్చడమే కాదు, నీటికి కరువు లేకుండా చేశారు. రైతన్న వాన కోసం మొగులు వైపు చూడాల్సిన అవసరం లేకుండా చేశారు. ప్రకృతి ప్రసాదిస్తున్న జల వనరులను ఎలా వినియోగించుకోవచ్చో కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా యావత్ దేశానికి ఒక మార్గం చూపారు.
ఏటా దేశవ్యాప్తంగా లక్షలాది టీఎంసీలు సముద్రం పాలవుతున్నా.. ప్రజల అవసరాలకు ఆ నీటిని మళ్లించకుండా నిర్లక్ష్యం చేసిన పాలకులకు ఒక బాట చూపించి మార్గదర్శిగా నిలిచారు. ‘తలాపున పారుతుంది గోదావరి.. మన చేను, మన చెలక ఎడారి’ అన్న రాతలను మార్చి కాళేశ్వరం జలాలతో తెలంగాణ పుడమి తల్లిని పులకింపజేస్తున్నారు.
అందుకే ఇప్పుడు తెలంగాణ రైతాంగం ముఖ్యమంత్రిపై భరోసాతో సాగులో విప్లవం సృష్టిస్తున్నది. ఇది నా ప్రాంతం.. నా ప్రజలు బాగుండాలనే అంకితభావంతో పనిచేసే నాయకుడు ఉంటేనే అసాధ్యాలు ఇట్లా సుసాధ్యమవుతాయి.
(వ్యాసకర్త: నమస్తే తెలంగాణ ప్రతినిధి)
-కడపత్రి ప్రకాశ్‌రావు
91827 77022