మనిషి జీవితంలో ప్రాణానికి మించిందేదీ లేదు. అటువంటిది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం వందల మంది తమ ప్రాణాలను ధారపోశారు. అలాంటి అమరవీరులను స్మరించడం అనివార్యం. ‘తెలంగాణ ప్రజలను రాజకీయంగా చైతన్యపరిచి ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటును ఒప్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడమే తెలంగాణ రాష్ట్ర సమితి అంతిమ లక్ష్యం’ అని తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం సందర్భంగా జలదృశ్యంలో నిర్వహించిన సమావేశంలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ వ్యాఖ్యానించారు.
తాను కోల్పోయిన ఉనికిని తెలంగాణ తిరిగి ఎలా ప్రతిష్టించుకున్నదన్న విషయం తెలుసుకోవాలంటే చరిత్ర లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. భారత స్వాతంత్య్రానికి ముందు కొన్ని సంస్థానాలు మినహా దేశమంతా బ్రిటిష్ పాలనలో ఉండేది. హైదరాబాద్ సంస్థానంలో అంతర్భాగమైన తెలంగాణ నిజాం పాలనలో ఉండేది. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే తెలంగాణ 1948, సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమైంది. హైదరాబాద్ రాష్ర్టాన్ని భారతదేశంలో విలీనం చేసుకునేందుకు నిజాం రాజును లొంగదీసుకోవడం కోసం ‘ఆపరేషన్ పోలో’ పేరుతో కేంద్రం పోలీస్ యాక్షన్ చేపట్టిందని చరిత్ర లిఖించబడినది.
తెలంగాణలో జరుగుతున్న సాయుధ రైతాంగ పోరాటం దేశమంతా విస్తరించకుండా అణచివేసేందుకే నిజాంను లొంగదీసుకోవడం అనే ముసుగులో నాటి నెహ్రూ ప్రభుత్వం ‘ఆపరేషన్ పోలో’ పేరిట తెలంగాణ మీదికి సాయుధ బలగాలను పంపారని తర్వాత కాలంలో ప్రజలకు అర్థమైంది. ఆ తర్వాత తెలంగాణలో సాధారణ ఎన్నికలు నిర్వహించేవరకు ఎంకే వెల్లోడి తెలంగాణకు ముఖ్యమంత్రిగా వ్యవహరించే విధంగా కాంగ్రెస్ కుట్ర పన్నింది. వెల్లోడి ప్రభుత్వ కాలంలోనే చాపకింద నీరులా భాష పేరుతో, ఇతర కారణాలతో ఇక్కడికి చేరి ప్రభుత్వంలో ఇతర ప్రాంతాల వారు, ముఖ్యంగా ఆంధ్ర వారు ఉద్యోగాలు పొందారు.
1952లో తెలంగాణలో ఎన్నికలు జరిగాక బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1956 వరకు కూడా వెల్లోడి చీఫ్ అడ్వైజర్‌గా నెహ్రూ ప్రభుత్వం కొనసాగించింది. ఫజల్ అలీ కమిషన్ సిఫారసులకు వ్యతిరేకంగా భాషా ప్రయుక్త రాష్ర్టాలు అనే కుట్రకు తెరలేపి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాలో విలీనం చేశారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణలో ఉద్యోగాలు పొందడమనేది నిజాం కాలంలో మొదలై, వెల్లోడి పాలన, ఉమ్మడి ఏపీలో కూడా కొనసాగింది. ఇది తెలంగాణ ఏర్పాటయ్యే వరకు కొన్ని దశాబ్దాలుగా కొనసాగింది. ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేయడానికి తెలంగాణ సాధించిన కేసీఆర్ ఎంతో ముందుచూపుతో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ యువతకే దక్కే విధంగా చట్ట సవరణ చేశారు. నిజాం కాలం నుంచే హైదరాబాద్ ప్రపంచానికి ఒక మోడల్‌గా నిలిచింది. నిజాం రాచరిక పాలనతో పాటు ఫ్యూడల్ దోపిడీ ఉన్నప్పటికీ తెలంగాణలో విద్య, వైద్యం, సాగునీరు, రవాణా, విద్యుత్తు రంగాలలో ఆధునిక దేశాల సరసన హైదరాబాద్ సంస్థానం ఉన్నాయనేది చారిత్రక సత్యం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన తర్వాత తిరిగి తెలంగాణ ఏర్పాటు ఏ విధంగా తెలంగాణ వెనుకపడేయబడిందో అందరికీ తెలిసిందే.
చెరువులు, కుంటలతో భాసిల్లిన ప్రాంతం తెలంగాణ. కులమతాల అంతరాలు దైనందిన జీవితంలో కనిపించకుండా ఒక సమతుల్యత పాటించిన ప్రాంతం తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా తెలంగాణలోని జలాలను ఆంధ్రాకు మళ్లించుకుపోవడం, చెరువులు, కుంటలను నిర్లక్ష్యం చేయడం, కట్టిన ప్రాజెక్టుల సామర్థ్యం కుదించడం, తెలంగాణకు చేకూరాల్సిన ప్రయోజనం కలిగించకుండా, దశాబ్దాల పాటు ప్రాజెక్టుల నిర్మాణం సాగదీయడం, కట్టాల్సినవి కట్టకపోవడం ఉమ్మడి పాలనలో నిరంతరం జరిగింది. అన్ని రంగాల్లో తెలంగాణ మీద వివక్ష ప్రదర్శించి చివరికి తెలంగాణ అన్న పదం ఉచ్ఛరించలేని స్థితికి తీసుకువచ్చారు.
1969 తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన తర్వాత అహంకారంతో యథేచ్ఛగా ఆంధ్రా పరిపాలన కొనసాగింది. అంతటి వివక్ష పాలనలో ప్రజలు విసిగి వేసారి ఉన్న సమయంలో తెలంగాణ జనసభ, మహాసభలు తెలంగాణ ప్రజల్లో కొంతమేరకు చైతన్యపరిచే ప్రయత్నం కొన్ని ప్రాంతాల్లో చేశాయి. కోల్పోయిన తెలంగాణ రాష్ట్రం తిరిగి ఉనికిలోకి ఎలా తీసుకురాగలమన్న విషయంలో మాత్రం స్పష్టత 2001 నాటికి లేని పరిస్థితి.
తెలంగాణ రాష్ట్ర అవతరణ మాత్రమే లక్ష్యంగా కేసీఆర్ 2001, ఏప్రిల్ 27న టీఆర్ఎస్కు అంకురార్పణ చేశారు. అప్పుడు జలదృశ్యంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ బానిసత్వానికి అలవాటుపడిన తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ నేతలు, పరిమితంగా ఉన్న బీజేపీ నేతలు మింగుడుపడక ఎగతాళి చేశారు. స్వామిభక్తి పేరుతో వారు అడుగడుగునా బానిసత్వాన్ని చాటుతూ వచ్చారు. చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డిలకు ఊడిగం చేశారు నాటి కాంగ్రెస్, టీడీపీ నాయకులు. తెలంగాణ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకపోగా ఉద్యమంలోని క్లిష్ట సమయాల్లో తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసేవారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వేసిన ఎత్తుగడలు, ఆలోచనతో కూడిన వ్యూహాత్మకంగా వదిలిన మాటలే తూటాలై తెలంగాణ సమాజాన్ని ఏకం చేశాయి. ఒకరు పదులుగా, పదులు వందలుగా, వందలు వేలుగా, వేలు లక్షలుగా, లక్షలు కోట్లయి సకల జనులను కదిలించి వారి ఐక్యతకు పునాది వేసింది కేసీఆర్ ఆలోచనలే.
తెలంగాణ ఒక్క కేసీఆర్ వల్ల రాలేదన్న వంకర మాటలు మాట్లాడే వారి పాత్ర తెలంగాణ ఉద్యమంలో విద్రోహ పాత్రనే. కేసీఆర్ ఎంతో చతురత, వ్యూహంతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలను ముగ్గులోకి లాగి వారిని తెలంగాణ అనక తప్పని అనివార్య పరిస్థితిని తీసుకువచ్చారు. వారి శ్రేణులను, పార్టీలను సందర్భానుసారంగా పార్టీలోకి చేర్చుకుంటూనే ఉద్యమం వైపు నడిపించారు. రాజీనామాలు, ఉప ఎన్నికలు, ప్రత్యక్ష ఆందోళనా రూపాలు, ఒకటి కాదు, టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఈ 25 ఏండ్ల కాలంలో బీఆర్ఎస్, కేసీఆర్ ప్రసావన లేకుండా ఏపీ, తెలంగాణలో రాజకీయాలు నడిచిన పరిస్థితి లేదు. ఇదొక ప్రాంతీయ పార్టీగా ఉద్బవించిన పార్టీ 25 ఏండ్ల ఉజ్వల ప్రస్థానం. ఎన్నికల్లో గెలుపోటములు ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజలకు కోల్పోయిన తమ అస్తిత్వాన్ని తిరిగి పొందేలా చేసింది బీఆర్ఎస్. ఉనికినే కోల్పోయి, తానెక్కడుందో భారత చిత్రపటంలో తెలియని పరిస్థితిలో తెలంగాణను సుస్థిరం చేయడమే కాదు, అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలిపి ఒక నమూనాగా చూయించింది కేసీఆర్.
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ నేతృత్వంలోని ప్రభుత్వం తెలంగాణను ఆర్థికంగా, సమృద్ధిగా మార్చే దిశగా అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ (జీడీపీ) రూ.4.9 లక్షల కోట్ల నుంచి రూ.13.5 లక్షల కోట్లకు పెరుగగా, ప్రతి వ్యక్తికి ఆదాయం రూ.1.12 లక్షల నుంచి రూ.3.47 లక్షలకు గణనీయంగా పెరిగింది. ద్రవ్యవ్యాప్తిలో సైతం 200 శాతం వృద్ధి నమోదైంది. నీటి పరిపాలనలో తెలంగాణ కొత్త అధ్యాయం లిఖించింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకంగా పేరుగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు, మిషన్ కాకతీయ ద్వారా 46,000 చెరువుల పునరుద్ధరణ జరిగింది. ఫలితంగా భూగర్భ జలమట్టాలు 6 మీటర్ల మేర పెరిగాయి. రైతుల సంక్షేమం దిశగా రైతుబంధు ద్వారా రూ.72,000 కోట్ల పెట్టుబడి మద్దతును అం దించగా, రైతు బీమా పథకంతో లక్షల మంది రైతుల కుటుంబాలకు 5 లక్షల బీమా భద్రతను కల్పించింది. అంతేకాదు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తును అందించి దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది.
ఈ దేశంలో పుట్టిన ఎన్నో రాజకీయ పార్టీలు రాజకీయ అస్తిత్వం కోసం, రాజకీయ పదవుల కోసం, అధికారం కోసమే పుట్టాయి. కాలగమనంలో కొన్ని అంతరించిపోయాయి. కానీ, దేశంలో ఉన్న ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించినప్పుడు భిన్న భాషా సంస్కృతులు, భిన్న ఆచారవ్యవహారాలు, భిన్న వైవిధ్యభరితమైన సువిశాల దేశంలో రాష్ర్టాల ప్రాధాన్యాలను, ఆయా ప్రాంతాల అభిలాషలను సమన్వయపరచడం గానీ, అర్థం చేసుకోవడం గానీ చేయని కారణంగానే జాతీయపార్టీలు విఫలమయ్యాయి. అందుకే ఈ దేశంలో అత్యంత బలీయమైన శక్తులుగా ప్రాంతీయ పార్టీలున్నాయి.
కొన్ని జాతీయ పార్టీలు అంతరించిపోతున్నాయి కానీ, ప్రాంతీయ పార్టీలేవీ కనుమరుగైన దాఖలాలు లేవు. అన్ని ప్రాంతీయ అభిలాషకన్నా బలమైన, భిన్నమైన అభిలాష తెలంగాణది. భిన్నమైన చరిత్ర, భిన్నమైన పోరాటం తెలంగాణ సొంతం. అందుకే, తెలంగాణ అజేయంగా నిలిచింది. దీన్ని ఎవరూ రూపు మాపలేరు. దీన్ని ఎవరూ చరిత్ర నుంచి చెరపలేరు. ఈ 25 ఏండ్ల బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం అనేది ఒక తెలంగాణలోనే కాదు, భారతదేశ రాజకీయాల్లోనే ఒక అద్వితీయమైన ఘట్టం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాలను ఎంత గొప్పగా నిర్వహించవచ్చో ఆధునిక యుగంలో రుజువు చేసినటువంటిది కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్య మం. ఇది దేశానికే కాదు, ప్రపంచ పోరాటాలకే అనుసరణీయం. అది తెలంగాణ సాధించిన శాశ్వతమైన గెలుపు. కోల్పోయిన ఉనికిని తిరిగి సాధించిన పార్టీ గా రజతోత్సవం సందర్భంగా తన విజయాన్ని తానే నమోదు చేసుకుంటున్నది.
– (వ్యాసకర్త: వ్యవసాయ శాఖ మాజీ మంత్రి)
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి