నాడు కేసీఆర్ పాలనలో చిన్నచిన్న సమస్యలు వస్తే ‘దొరల పాలన, గడీల రాజ్యం’ అంటూ యూట్యూబ్ చానళ్లు హోరెత్తించాయి. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా కేసీఆర్ తీర్చిదిద్దినా.. ‘ఆయన ఇంట్లకెళ్లి తెస్తుండా?’ అని కుహనా మేధావులు అన్నారు. ‘మేమొస్తే అంతకన్నా ఎక్కువ చేస్త’మని కాంగ్రెస్ నేతలు ఊదరగొట్టారు. వారి మాటలను నమ్మిన ప్రజలు ‘రెండుసార్లు కేసీఆర్ను గెలిపించాం,ఒక్కసారి కాంగ్రెస్కు అవకాశమిద్దాం’ అని హస్తం పార్టీని గద్దెనెక్కించారు. అయితే, ప్రజలు ఆశించిందొకటి, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నదొకటి. 10 మాసాల రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేక పాలనలో ప్రజలు అరిగోస పడుతున్నారు.
తెలంగాణ వస్తే మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే దక్కుతాయని, తద్వారా మన బతుకులు బాగుపడతాయని ఉద్యమ సమయంలో కేసీఆర్ పదే పదే చెప్పేవారు. తెలంగాణ గోస తెలిసిన వ్యక్తి కావడంతో స్వరాష్ట్రం సిద్ధించాక ఆయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అధికారంలోకి రాగానే తాగు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు పూనుకున్నారు. చెరువులు, కుంటలను పునరుద్ధరించారు. 24 గంటల కరెంటు ఇచ్చారు. రైతు బంధు, రైతు బీమా, రూ.2000 పింఛన్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను తీసుకొచ్చారు. కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి పాలనను ప్రజల దరికే చేర్చారు. జిల్లాకో మెడికల్ కళాశాల, బస్తీ దవాఖానల ఏర్పాటు, కేసీఆర్ కిట్ అందజేసి ఆరోగ్య తెలంగాణను సాక్షాత్కరించారు. పదేండ్లలో సుమారు 1.60 లక్షల వరకు ఉద్యోగాలు కల్పించారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.
మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిజంగానే ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక, డైవర్షన్ రాజకీయాల కోసం పేదల ఇళ్లను కూలుస్తూ, వారి బతుకులను బజారుకీడ్చి కాంగ్రెస్ మార్క్ మార్పును రుచి చూపిస్తున్నది. ఎన్నికల్లో హస్తం పార్టీ ఇచ్చిన వందల హామీలన్నీ అటకెక్కాయి. కేసీఆర్ సర్కార్ అమలుచేసిన సంక్షేమ పథకాలను నిలిపివేసిన రేవంత్.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను సైతం తుంగలో తొక్కారు. రుణమాఫీ ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. రుణాలు మాఫీ అవ్వని రైతులు రోడ్డెక్కుతున్నారు. కల్యాణలక్ష్మి రూ.లక్షతో పాటు ఇస్తానన్న తులం బంగారం, రైతు భరోసా పెంపు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ.. ఇలా ఉద్యోగ, నిరుద్యోగ, రైతు, కార్మిక, మహిళా లోకాలకు లెక్కలేనన్ని హామీలిచ్చి ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి వాటిని అమలు చేయలేక కొత్త హైడ్రామాకు తెరదీశారు. ఈ నేపథ్యంలో ఇదేనా ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రజలు కాంగ్రెస్ పాలకులను ప్రశ్నిస్తున్నారు.
ఇచ్చిన హామీలను అమలుచేయలేక, ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హైడ్రామా చేస్తున్నారు. రేవంత్ తెరలేపిన హైడ్రామాకు అమాయకులు బలవుతున్నారు. ఏకపక్షంగా రేవంత్రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా.. పేద, మధ్యతరగతి ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. ఏ క్షణం బుల్డోజర్లు వచ్చేస్తాయో, తమ ఇళ్లను ఎక్కడ కూల్చివేస్తారోనని పేద ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
హైదరాబాద్ పరిధిలో వేలాది చెరువులు, కుంటలు ఉండేవన్నది అక్షర సత్యం. అవి అన్యాక్రాంతం అయ్యాయన్నది వాస్తవమే. కానీ, అది ఒక్క రోజులో జరగలేదు. ఉమ్మడి ఏపీని ఎక్కువ ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ హయాంలోనే కబ్జాకోరులు చాలా చెరువులను చెరబట్టారన్నది జగమెరిగిన సత్యం. పాలకుల వద్ద పలుకుబడి ఉన్న సంపన్నులు, బడా రియల్ఎస్టేట్ వ్యాపారులు చెరువు, కుంటలను ఆక్రమించేసి, అక్రమ నిర్మాణాలు చేపట్టి పేదలు, మధ్యతరగతి ప్రజలకు అంటగట్టేశారు. అన్ని అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్న, కొనుగోలు చేసిన అమాయక ప్రజలపై ఇప్పుడు చెరువుల పరిరక్షణ, మూసీ ప్రక్షాళన అంటూ ప్రతాపం చూపిస్తే ఏం లాభం? ప్రత్యామ్నాయం చూపకుండా బాధితులను రోడ్డున పడేయటం ఎంతవరకు సమంజసం. చెరువుల పరిరక్షణ చేయాలంటే మొదటగా పూర్తిస్థాయిలో సర్వే చేయాలి. చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్జోన్లను శాస్త్రీయంగా నిర్ధారించాలి. ఆ తర్వాత నోటీసులిచ్చి చర్యలకు ఉపక్రమించాలి. అంతేగాని ఇలా రాత్రికి రాత్రి ఇళ్లను కూలగొట్టడం సబబు కాదు. అధికారుల ఉదాసీనత కారణంగానే చెరువులు అన్యాక్రాంతం అయ్యాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నీటిపారుదల, మున్సిపల్, రెవెన్యూ శాఖాధికారుల నిర్లక్ష్య ఫలితమే ఇది. చెరువుల పరిధిలో వెంచర్లకు అనుమతులిచ్చిన అధికారులపై మొదట చర్యలు తీసుకోవాలి. వారిని బోనులో నిలబెట్టాలి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్రెడ్డి మాట్లాడిన మాటలకు ఇప్పటి చేతలకు పొంతనే లేదు. బీఆర్ఎస్ హయాంలో ఒక కాలనీలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినప్పుడు ఆయన అప్పట్లో నానా యాగీ చేశారు. నిర్మాణాలను కూల్చడం సరికాదని, వాటిని రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన లేదా? అని ఆయన ప్రశ్నించారు. నాడు పేదల ఇళ్లను కూల్చడం సరికాదని చెప్పిన రేవంత్ ఇప్పుడు హైడ్రా కూల్చివేతలను ఎలా సమర్థించుకుంటారో చెప్పాలి.
తమ రెక్కల కష్టం హైడ్రా కబంధ హస్తాల కింద నలిగిపోతుండటంతో ఇప్పుడు బాధితులు కేసీఆర్ను తలుచుకుంటున్నారు. గూడు కోల్పోయి రోడ్డున పడుతున్నవారంతా ఆయనను గుర్తుచేసుకుంటున్నారు. సంక్షేమ సర్కార్ను దూరం చేసుకొని తప్పు చేశామని మదనపడుతున్నారు. కాంగ్రెస్ పాలకులు అరిగోస పెడుతుండటంతో ‘ఏ పల్లె పిల్లడో.. ఏ తల్లి బిడ్డడో అయ్య కడుపు సల్లగుండా రాజ్యం తెచ్చాడో..’ పాటను ప్రజలు యాదిచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా హైడ్రామాకు తెరదించాలి. లేకపోతే పేద ప్రజల కన్నీటి శోకంలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయం.
-జీడిపల్లి రాంరెడ్డి
96666 80051